IAS Uma Harathi Real Life Story : అద్భుత‌మైన దృశ్యం.. IAS అయిన కూతురికి.. IPS అయిన తండ్రి సెల్యూట్.. ఈమె స‌క్సెస్ జ‌ర్నీ ఇదే..

ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సార్లు యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌ రాసినా నూకల ఉమాహారతికి ర్యాంకు రాలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు వ‌లే యూపీఎస్సీ సివిల్స్‌ ఐదోసారి సైతం ప్రయత్నించి ఏకంగా జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించి.. ఐఏఎస్ ఆఫీస‌ర్ అయింది.

ఆమె నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు, శ్రీదేవిల కుమార్తె. ఏ త‌ల్లిదండ్రులైన త‌మ పిల్ల‌లు ఉన్న‌త స్థానంలో.. త‌మ‌క‌న్నా ఇంకా గొప్ప హోదాలో ఉండాల‌ని కోరుకుంటారు. ఇలాంటి ఒక‌ ఒక తండ్రి ఆశయం నెరవేరింది. దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్ ఉద్యోగం సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న చోటుకే శిక్షణ కోసం వ‌చ్చింది. అయితే ఇక్క‌డే ఒక అద్భుత‌మైన దృశ్యం ఆవిష్కృతమైంది. 

హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు అకాడమీని ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శిక్షణలో భాగంగా జూన్ 15వ తేదీన (శ‌నివారం) సందర్శించారు. ఈ బృందంలోని ఉమాహారతికి ఆమె తండ్రి, పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛం అందించి..  సెల్యూట్ చేశారు. దృశ్యం ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అది కూడా ఫాదర్స్‌ డే  జరుపుకొంటున్న తరుణంలో ఒక రోజు ముందు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతం కావ‌డంతో.. ఈ న్యూస్ వైర‌ల్ అయింది.

ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి రావడంతో అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి.. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

IAS Uma Harathi success Story :

Uma Harathi.. హైదరాబాద్‌లో 2010లో 9.8 జీపీఏతో టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించిన ఆమె 2012లో ఇంటర్‌ ఎంపీసీలో 955 మార్కులు సాధించారు. ఆపై 2017లో ఐఐటీ హైదరాబాద్‌ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందినవారు. యూపీఎస్సీ 2020లో నిర్వహించిన ఐఈఎస్‌లో ఆమె తమ్ముడు సాయి వికాస్‌ 12వ ర్యాంకు సాధించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం ముంబైలోని సీపీడబ్ల్యూడీలో ఐఈఎస్‌గా విధుల్లో చేరిన వెంట‌నే అక్క ఉమాహారతి సివిల్స్‌లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యింది. 

కోచింగ్ న‌చ్చ‌క‌.. ఇంటికి వ‌చ్చి..
సివిల్‌ ఇంజనీరింగ్‌ తర్వాత ఉద్యోగం బదులు సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఢిల్లీలోని వాజీరావు కోచింగ్‌ సెంటర్‌లో 2018–19లో శిక్షణ పొందినప్పటికీ అక్కడి కోచింగ్‌ నచ్చలేదు. ఇంటికొచ్చి ఆప్షనల్‌ సబ్జెక్టు అంథ్రోపాలజీతోపాటు కామన్‌ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్‌లో స్టడీ మెటీరియల్‌ సెర్చ్‌ చేశా. గత సివిల్‌ పేపర్లనూ చదివా. దేశ, అంతర్జాతీయ ఆంశాలు, సంఘటనలపై నిత్యం ఆంగ్ల దినపత్రికలు చదివేదాన్ని ఈ ఏడాదంతా నాన్న, అమ్మతో నారాయణపేటలో ఉండి చదివా. సివిల్స్‌ సాధించా. ఈసారి 2,500 ర్యాంకుల్లో ఏదో ఒకటి వస్తుందనుకున్నా. మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. 

ఐపీఎస్‌ అధికారి అయిన మా నాన్న వెంకటేశ్వర్లు నుంచే స్ఫూర్తి పొందా. తమ్ముడు సాయి వికాస్‌ను ఆదర్శంగా తీసుకున్నా. గత ప్రయత్నాల్లో నాలుగుసార్లు విఫలమైనా బాధపడొద్దని తమ్ముడు అండగా నిలిచాడు. స్నేహితులు నిఖిల్, అంకితల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి రంగంలోనూ విజయం సాధించిన ప్రతి ఒక్కరి నుంచీ ఏదో ఒక విషయంలో స్ఫూర్తి పొందవచ్చు. ఒకటి రెండుసార్లు విఫలమైనప్పటికీ ఆందోళన పడకూడదు. ఇది వరకు సివిల్స్‌ సాధించినవారి సహకారం తీసుకుని తప్పులు జరుగకుండా జాగ్రత్తపడాలి. ప్రతిరోజు చదవడం, ప్రాక్టీసు చేయడం మంచిది. వారానికోసారి చదివిన అంశాలను ప్రాక్టీస్‌ టెస్టు రాయడం అలవాటుచేసుకోవాలి. పరీక్షలో ఎన్నిసార్లు విఫలమైనా ఫెయిల్యూర్‌గా భావించకూడదు. మ‌నం ఎల్ల‌ప్పుడు సానుకుల వాతావ‌ర‌ణంలో ఉండాలి. ఏది జ‌రిగిన మ‌న మంచికే అనే విధంగా ఉండాలి. ఓట‌మి నుంచి మెల‌కువ‌లు నేర్చుకోవాలి.

#Tags