Andra Vamsi IAS Success Story : ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసే కలెక్టర్ కాదు ఈయన.. ప్రతి ఫిర్యాదుకు.. ఒక డెడ్‌లైన్.. ప్రజల్లోనే ఉంటూ..
తన జిల్లాలో ఎవరు, ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని.. వాళ్ల దగ్గరికి వెళ్లి మరీ పరిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో ఆండ్ర వంశీ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ మీకోసం..
ఎడ్యుకేషన్ :
ఆండ్ర వంశీ.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన 2006లో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీఏ పూర్తి చేశారు. తర్వాత యాక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు.
ఉద్యోగాలు..
ఆండ్ర వంశీ.. 2008 లో ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగం సాధించారు. చిన్నప్పటి నుంచి చదువులో రాణించే ఆయన దేశం కోసం ఏదైనా చేయాలనుకున్నారు. ఐఏఎస్ కావడం ద్వారా దోపిడీకి గురైన, అణగారిన వర్గాల, పేదల గొంతుకగా నిలవాలన్నది ఆయన కల. 2011లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అయ్యారు.
మథుర, ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, ఫిలిబిత్, షాజహాన్‌పూర్ తదితర జిల్లాల్లో కలెక్టర్‌గా సేవలందించారు. లక్నోలో స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా ఆయనకు యూపీలోని బస్తీ జిల్లా పగ్గాలు అప్పగిస్తున్నట్లు ఆదేశాలు వచ్చాయి. బస్తీ డీఎంగా బాధ్యతలు తీసుకొన్న తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అభివృద్ధి, రెవెన్యూ పనులు కూడా మరింత మెరుగ్గా జరగాలన్నారు.
ఏకంగా 50 వేల పెండింగ్ ఫిర్యాదులను..
కలెక్టర్ ఆండ్ర వంశీ.. తన జిల్లాలో ఎవరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని.. వాళ్ల దగ్గరికి వెళ్లి మరీ పరిష్కరిస్తారు. అంతేకాదు.. ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి కూడా ఆయన ఓ డెడ్‌లైన్ విధించుకొంటారు. నిర్ణీత సమయంలోపు సదరు సమస్యను ఎంత కష్టమైనా పరిష్కరిస్తారు. అలా బాధ్యతలు చేపట్టిన కేవలం నాలుగు నెలల్లోనే ఏకంగా 50 వేల పెండింగ్ ఫిర్యాదులను పరిష్కరించారు వంశీ. దీంతో ఈ కలెక్టర్ పనితీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నది.
దాదాపు 30 ఏండ్లుగా పరిష్కారంకాని..
సర్కారు ఆఫీసులో పని పూర్తవ్వాలంటే ఏండ్లకేండ్లు సాగదీతే అని నిట్టూర్చే ప్రజలకు.. ఇంటి వద్దకే అన్ని సేవలను క్షణాల్లో అందేలా వంశీ పటిష్ట చర్యలు తీసుకొన్నారు. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలోని వందలాది గ్రామాల్లో దాదాపు 30 ఏండ్లుగా పరిష్కారంకాని 49,823 ఫిర్యాదులను కేవలం నాలుగు నెలల్లోనే ఆయన శాశ్వతంగా పరిష్కరించారు.
ఇందులో భూతగాదాలు, కబ్జాలు, బ్యాంకుల రుణాలు-చెల్లింపులు, నీటి పారుదలకు సంబంధించి ఎన్నో క్లిష్టమైన కేసులు కూడా ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో బస్తీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రతి రోజూ కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, తహశీల్దార్, గ్రామ పెద్దలతో సదస్సును నిర్వహిస్తున్న వంశీ.. అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఒకవేళ.. అధికారులు ఎవరైనా సదస్సుకు హాజరుకాకపోతే.. విధిగా ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి సదరు అధికారి ఆ రోజు సాయంత్రంలోగా సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇలా.. రోజూ డెడ్‌లైన్ విధించుకొని కేసులను పరిష్కరించడం వల్లే దశాబ్దాలుగా ఎడతెగని ఎన్నో కేసులను 4 నెలల్లోనే పరిష్కరించగలిగినట్టు వంశీ పేర్కొన్నారు. దీనికి అధికారులు, గ్రామస్థులు ఎంతో సహకారం అందించినట్టు కొనియాడారు.
నేను దీనిని గట్టిగా నమ్ముతా.. : వంశీ ఆండ్ర, బస్తీ జిల్లా కలెక్టర్
జస్టిస్ డిలేడ్ ఇజ్ జస్టిస్ డినైడ్ అన్న మాటను నేను గట్టిగా నమ్ముతా. ఉదాహరణకు.. భూమి విషయంలో గొడవ చిన్నగా మొదలైనప్పుడే దాన్ని పరిష్కరించాలి. లేకపోతే.., అది క్రమంగా పెద్దగా మారి నేరాలు జరుగడానికి కారణం కావొచ్చు. చిన్న చిన్న వివాదాలతో ఇక్కడి ప్రజలు అనవసరంగా తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. బాధ్యతలు చేపట్టగానే అక్టోబర్ 2023 నుంచి జనవరి 2024 మధ్య 49,823 కేసులను పరిష్కరించాం. దీంతో మమ్మల్ని ఆశ్రయించే బాధితుల సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా 17,700 ఫిర్యాదులు నమోదవ్వడమే దీనికి నిదర్శనం. అధికారులు, గ్రామస్థుల సహకారం ఎంతో ఉన్నది.