క్యాట్‌లో నిర్దిష్ట కటాఫ్ సాధించే మార్గాలు ఇవే..

క్యాట్‌ పరీక్షలో విజయం కోసం విద్యార్థులు ప్రతి సెక్షన్‌లో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు పొందేలా కృషి చేయాలి.

ఐఐఎంలు మలి దశకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్దిష్టంగా సెక్షనల్‌ కటాఫ్, ఓవరాల్‌ కటాఫ్‌లను పేర్కొంటున్నాయి. జనరల్‌ అభ్యర్థులు ఓవరాల్‌ కటాఫ్‌ కనిష్టంగా 85 పర్సంటైల్, గరిష్టంగా 90 పర్సంటైల్‌ పొందాలి. అదే విధంగా సెక్షనల్‌ కటాఫ్‌ పరంగా 75 నుంచి 80 పర్సంటైల్‌ అవసరం ఉంటుంది.

కాన్సెప్ట్స్, ప్రాక్టీస్‌..
క్యాట్‌లో ప్రతి సెక్షన్‌ కీలకంగా నిలుస్తుంది. ఇందులో మెరుగైన స్కోర్, పర్సంటైల్‌ సాధించేందుకు అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తొలుత సిలబస్‌ను పరిశీలించి.. వాటికి సంబంధించిన కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్‌ను ఆధారంగా చేసుకొని ప్రిపరేషన్‌ సాగించాలి. దీంతోపాటు ప్రతి టాపిక్‌ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్‌ చేయడం తప్పనిసరి. అభ్యర్థులు గత ఏడాది పరీక్షలో ఎక్కువ వెయిటేజీ లభించిన అంశాలను గుర్తించి.. వాటిపై దృష్టి సారించాలి.

మాక్, మోడల్‌ టెస్ట్‌లు..
క్యాట్‌ సన్నద్ధతలో అభ్యర్థులు మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుంది. వీటి ఫలితాలను విశ్లేషించుకుని ఇంకా అవగాహన పొందాల్సిన టాపిక్స్‌పై ఫోకస్‌ చేయాలి. ఇలా ఒకవైపు సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌ సాగిస్తూనే.. మరోవైపు నిరంతరం తమ ప్రిపరేషన్‌ను సమీక్షించుకోవాలి.

మలి దశ కీలకం..
క్యాట్‌లో స్కోర్‌ సాధించగానే.. ఐఐఎంలో సీటు ఖరారవుతుందని భావిస్తే పొరపడినట్లే! ఎందుకంటే.. ఐఐఎంలు క్యాట్‌ స్కోర్‌ను తొలి ప్రామాణికంగానే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ప్రతి ఐఐఎం తమ ఇన్‌స్టిట్యూట్‌లోని పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు మలి దశలో ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నాయి. క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి..అర్హులైన అభ్యర్థులకు మలి దశలో గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వూలను నిర్వహిస్తున్నాయి. వీటికి నిర్దిష్ట వెయిటేజీ కేటాయిస్తున్నాయి. ఆయా ఐఐఎంల గత ప్రవేశ విధానాలను పరిశీలిస్తే.. క్యాట్‌ స్కోర్‌కు 50 నుంచి 70 శాతం, జీడీ/పీఐలకు 30 నుంచి 50 శాతం మధ్యలో వెయిటేజీ లభించింది.

ఇంకా చ‌ద‌వండి :part 3: ఐఐఎంల్లో గ్రూప్‌ డిస్కషన్స్‌, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వూ.. ప్రిప‌రేష‌న్ సాగించండిలా..




#Tags