Tech Skills: పైథాన్‌.. కొలువుల కొండ!

Python Programming Language Specialties, Qualifications, Career Opportunities

వివిధ ప్రాంతాల ప్రజలకు వేర్వేరు భాషలు ఎలా ఉన్నాయో.. కంప్యూటర్లకూ అలాగే లాంగ్వేజెస్‌ ఉన్నాయి. కోడింగ్‌ రూపంలో ఉండే ఈ భాషలను ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ అంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌.. ‘పైథాన్‌’. ఇది మెరుగైన, సంక్షిప్త, సరళమైన కోడింగ్‌ కలిగిన కంప్యూటర్‌ భాష. దాంతో ఫైథాన్‌ డెవలపర్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ప్రత్యేకతలు, అర్హతలు, కెరీర్‌ అవకాశాల గురించి తెలుసుకుందాం...

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, టెస్టింగ్, వెబ్‌ డెవలప్‌మెంట్, యాప్‌ డెవలప్‌మెంట్, స్క్రిప్ట్‌ రైటింగ్, డేటాసైన్స్‌ వంటి అనేక విభాగాల్లో పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తున్నారు. అనేక కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లతో పోటీపడి ఎంతోకాలంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది..పైథాన్‌! ప్రపంచంలోని ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీలు గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ మొదలైనవి పైథాన్‌ను వినియోగిస్తున్నాయి. దాంతో పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో నైపుణ్యాలు సాధించినవారికి విస్తృత కెరీర్‌ అవకాశాలు లభిస్తున్నాయి.


చ‌ద‌వండి:  Data Scientist Jobs Roles, Salary: డిగ్రీ అవసరం లేకున్నా.. ఈ నైపుణ్యాలు తప్పనిసరి..

ఎవరు నేర్చుకోవచ్చు

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కావాలని ఆసక్తి ఉండి.. బ్యాచిలర్‌ స్థాయి కోర్సులు పూర్తిచేసిన వారు పైథాన్‌ ప్రోగ్రామింగ్‌పై దృష్టిసారించొచ్చు. అందుబాటులో ఉన్న సర్టిఫికేషన్ల ద్వారా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చు. 

ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్స్‌

ఈ లాంగ్వేజ్‌ నైపుణ్యానికి సంబంధించి ఐబీఎం, సిస్కో, వీఎంవేర్‌ వంటి సంస్థలు అందించే ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకూ∙ఆదరణ లభిస్తోంది. పైథాన్‌ ప్రోగ్రామర్‌గా రాణించాలనుకునేవారికోసం పైథాన్‌ ప్రోగ్రామింగ్, డేటాసైన్స్‌ విత్‌ పైథాన్‌ కోర్స్, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ మెషిన్‌ లెర్నింగ్, ఏఐ విత్‌ పైథాన్, పైథాన్‌ ట్రైనింగ్‌ కోర్సు, మెషిన్‌ లెర్నింగ్‌ విత్‌ పైథాన్, పైథాన్‌ స్క్రిప్టింగ్‌ సర్టిఫికేషన్‌ ట్రైనింగ్, ఏఐ ప్రోగ్రామింగ్‌ విత్‌ పైథాన్‌ తదితర సర్టిఫికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మూక్స్‌ విధానంలో ఆన్‌లైన్‌లోనూ పైథాన్‌పై అవగాహన పెంచుకోవచ్చు. ఈ లాంగ్వేజ్‌ను యూట్యూబ్‌లో ఉచితంగానే నేర్చుకునే అవకాశం ఉంది. పైథాన్‌ నేర్చుకునేందుకు ప్రధానంగా ఆసక్తి ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.
 

చ‌ద‌వండి:  Blockchain‌ Jobs: బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్‌.. అవసరమైన నైపుణ్యాలు ఇవే...

సులభంగా

పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌.. సీ,సీ++,జావా తదితర ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ కంటే సులభంగా ఉంటుంది. వాటికంటే తక్కువ కోడింగ్‌తో మెరుగైన ఫలితాలు ఇవ్వడంతో పైథాన్‌కు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. కెరీర్‌ ప్రారంభ దశలో ఉన్నవారు సైతం ఈ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ను సులువుగా నేర్చుకోవచ్చు. పైథాన్‌ లాంగ్వేజ్‌కు ప్రపంచవ్యాప్తంగా బలమైన డెవలపర్‌ కమ్యూనిటీ ఉంది. అది నిర్వహించే అనేక బ్లాగులు,ఫోరమ్‌ల ద్వారా సాంకేతిక సమస్యలు, సందేహాలకు సమాధానం లభిస్తుంది.

కెరీర్‌ అవకాశాలు

  • పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాలు సాధించినవారు ప్రాథమికంగా పైథాన్‌ డెవలపర్‌గా కెరీర్‌ ప్రారంభించొచ్చు. వీరు వెబ్‌సైట్‌లను రూపొందించడం, డేటా అనలిటిక్స్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, సమర్థమైన కోడింగ్‌ రాయడం, డేటా అల్గారిథమ్‌లను ఆప్టిమైజ్‌ చేయడం, డేటా ప్రొటెక్షన్, సెక్యూరిటీ బాధ్యతలను నిర్వహిస్తారు. 
  • పైథాన్‌ నిపుణులు డేటా అనలిస్ట్‌గానూ పనిచేయొచ్చు. భారీ మొత్తంలో ఉండే డేటా నిర్వహణ కోసం చాలా కంపెనీలు వీరిని నియమించుకుంటున్నాయి. అనుభవం ఉన్నవారు మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. 
  • ప్రొడక్ట్‌ మేనేజర్‌గానూ పలు సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. మార్కెట్‌ను అర్థం చేసుకొని, వ్యాపారాభివృద్ధికి దోహదపడే ఉత్పత్తిని రూపొందించడంలో ప్రొడక్ట్‌ మేనేజర్‌ పాత్ర కీలకం.ఏదైనా ఉత్పత్తికి సంబంధించిన కొత్త ఫీచర్‌లతో కూడిన ప్రొడక్ట్‌లను వీరు నిర్మిస్తారు. పైథాన్‌లో నైపుణ్యం కలిగిన ప్రొడక్ట్‌ మేనేజర్‌లకూ విపరీతమైన డిమాండ్‌ ఉంది. 
  • గత రెండేళ్లలో మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు భారీగా పెరిగాయి. యంత్రాలు, ప్రోగ్రామ్‌లు, ఇతర కంప్యూటర్‌ ఆధారిత సిస్టమ్‌లను రూపొందించడంలో మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్లది ప్రధాన పాత్ర. పైథాన్‌లో నైపుణ్యం కలిగి, డేటా ఆటోమేషన్, అల్గారిథమ్‌లతో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటే.. మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌గా పుష్కల అవకాశాలు అందుకోవచ్చు. 


చ‌ద‌వండి:  Robotics and AI: పది లక్షల ఉద్యోగాలకు వేదిక‌... రూ. 12 లక్షల వార్షిక వేతనం

లక్షల్లో వేతనాలు

  • పైథాన్‌పై పట్టు సాధించి.. ఉద్యోగాల్లో చేరిన వారు రూ.లక్షల్లో వేతనాలు అందుకోవచ్చు. సంస్థ, హోదా, పనిచేసే ప్రాంతం, సంబంధిత సర్టిఫికేషన్‌లు, నైపుణ్యాలను బట్టి వేతనం లభిస్తుంది.
  • పైథాన్‌ నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ సగటు వేతనం ఏడాదికి సుమారు రూ.5 లక్షలుగా ఉంది. అనుభవంతోపాటు అదనపు స్కిల్స్‌ ఉంటే.. వార్షిక వేతనం రూ.పది లక్షల వరకూ అందుతుంది.
  • అమెజాన్, యాక్సెంచర్, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ వంటి ప్రఖ్యాత సంస్థలు నైపుణ్యం కలిగిన ‘ఫైథాన్‌’ డెవలపర్లను ఆకర్షణీయ వేతనాలతో నియమించుకుంటున్నాయి. ఆయా సంస్థల్లో అనుభవం పెరిగేకొద్దీ వేతనంతోపాటు కెరీర్‌ కూడా దూసుకెళ్తుంది. టీమ్‌ లీడర్,ప్రాజెక్టు మేనేజర్,డేటా సైంటిస్టులు, బిజినెస్‌ అనలిస్ట్, మెషిన్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పర్ట్‌ స్థాయిలో చేరితే రూ.20లక్షలకు పైగా వార్షిక వేతనం అందుకోవచ్చు.

చ‌ద‌వండి:  Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!

#Tags