Success Story: గ్రూప్-2లో విజయం సాధించా.. మళ్లీ గ్రూప్-2 రాశా.. ఎందుకంటే..?

వ్యాపారంలో నష్టాలు, కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. పిల్లలను ఉన్నత చదువులు చదివించి, మంచి హోదాలో చూడాలనే తండ్రి ఆశయం.. అదే ఆ అబ్బాయిలో పట్టుదల పెంచింది.
చింతలపూడి విజయ్‌కుమార్‌రెడ్డి

పదో తరగతిలో ఫస్ట్‌క్లాస్ మార్కులు మాత్రమే వచ్చినా.. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ.. క్రమంగా ఎదుగుతూ.. ఏపీ గ్రూప్-2 స్టేట్ టాపర్ స్థాయికి ఎదిగారు చింతలపూడి విజయ్‌కుమార్‌రెడ్డి. తనతోపాటు భార్య, తమ్ముడు సైతం గ్రూప్ 2 సాధించేలా తోడ్పాటు అందించడం ఆయన ఘనతకు నిదర్శనం. ఇటీవల విడుదలైన ఏపీ గ్రూప్-2 (2016) ఫలితాల్లో 357.35 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచి, డిప్యూటీ తహశీల్దార్‌గా ఎంపికైన చింతలపూడి విజయ్‌కుమార్‌రెడ్డి విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే..

కుటుంబ నేప‌థ్యం : 
నా సక్సెస్ స్టోరీ చెప్పాలంటే.. ముందు మా కుటుంబ పరిస్థితులతో ప్రారంభించాలి. వాస్తవానికి మా స్వస్థలం ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలంలోని కంభంపాడు. నాన్న సుబ్బారెడ్డి. నా చిన్నప్పుడు మా కుటుంబానికి 30 ఎకరాల భూమి ఉండేది. పూర్తి గ్రామీణ ప్రాంతం కావడంతో మా చదువుల కోసం ఆ భూమిని విక్రయించి, మార్కాపురానికి వలస వచ్చేశారు. నాన్న అక్కడ వ్యాపారం చేశారు. కానీ, నష్టాలు వచ్చాయి. దీంతో వ్యాపారం కంటే ఉద్యోగమే స్థిరమైందనే భావనను మాకు కల్పించారు. మమ్మల్ని మంచి చదువులు చదివించాలని, ఉన్నత స్థానాల్లో చూడాలన్నది నాన్న తపన. అందుకే.. నేను, తమ్ముడు మొదటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం కృషి చేశాం. ఫలితంగా ఇప్పటికే నేను రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవడం.. తాజాగా గ్రూప్-2లో విజయం సాధించడం సాధ్యమైంది.

Chaitra Varshini, RDO : ఈ మూడు వ్యూహాలు పాటిస్తే గ్రూప్స్‌లో విజయం ఖాయమే..!

నా చ‌దువు.. :
నా విద్యాభ్యాసం అంతా మార్కాపురంలోనే కొనసాగింది. 1999లో పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి. ఇంటర్‌లో 736 మార్కులు సాధించాను. బీఎస్సీలో 74 శాతం మార్కులు వచ్చాయి. బీఎస్సీ తర్వాత నా దృష్టి ఉపాధ్యాయ వృత్తిపై పడింది. దాంతో 2005లో బీఈడీ పూర్తిచేశాక.. 2006 డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్ట్‌కు ఎంపికయ్యాను.

గ్రూప్-2లోనూ విజయం.. కానీ..:
ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే మరింత ఉన్నతమైన హోదా పొందాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. ఈ లక్ష్యానికి అనుగుణంగా అప్పట్లో నాకు కనిపించిన మార్గం ఏపీపీఎస్సీ. సరిగ్గా అదే సమయంలో గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడటంతో ఆ దిశగా కృషిచేశాను. ఫలితంగా 2008లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టు లభించింది. ఇదే హోదాలో విశాఖపట్నం తొమ్మిదో సర్కిల్‌లో విధులు నిర్వర్తించాను.

Success Story: ఒక పోస్టు నాదే అనుకుని చదివా.. అనుకున్న‌ట్టే కొట్టా..

మళ్లీ గ్రూప్-2 ఎందుకు రాసానంటే..
2008, గ్రూప్-2లోనే ఏఎల్‌ఓగా ఎంపికైనా.. మళ్లీ గ్రూప్-2 (2016)కు హాజరుకావడానికి ప్రధాన కారణం.. స్వస్థలంలో విధులు నిర్వహించాలనే ఆకాంక్షే. గ్రూప్-2లో పోస్టుల‌న్ని జోన్ స్థాయి పోస్ట్‌లు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సొంత జోన్‌లో పని చేయాలనే లక్ష్యంతో చదివాను. 2016, గ్రూప్-2కు ప్రిపరేషన్ క్రమంలో కొంత విభిన్నమైన వ్యూహం అనుసరించాను. ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు.. ఒక స్టోరీ చదువుతున్నట్టు చదువుతూ.. ముఖ్యమైన అంశాలు, గణాంకాలను నోట్స్ రూపంలో రాసుకున్నాను. ఇంటర్నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించాను.

గందరగోళం సమస్య రాకుండా..
ఏ సబ్జెక్ట్‌లోనైనా.. ఒకటి లేదా రెండు పుస్తకాలు మాత్రమే చదివాను. దీనివల్ల మానసికంగా, సబ్జెక్ట్ పరంగా ఎదురయ్యే గందరగోళం సమస్య రాకుండా చూసుకోగలిగాను. అంతేకాకుండా ప్రతి సబ్జెక్ట్‌ను సమకాలీన అంశాలతో బేరీజు వేసుకుంటూ చదవడం కూడా ఎంతో కలిసొచ్చింది. గ్రూప్-2 ప్రిపరేషన్‌లో చాలామంది అభ్యర్థులు చేసే పొరపాటు బిట్స్, గైడ్స్‌ను ఫాలో కావడం. కానీ.. ఇది పరీక్ష హాల్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాస్తవానికి ఇటీవల ఏపీపీఎస్సీ పరీక్షల్లో పరోక్ష ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించి.. నా గ్రూప్-2 ప్రిపరేషన్‌ను అందుకు అనుగుణంగా ఉండేలా మలచుకున్నాను.

Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..

ఆరు నెలల సెలవు పెట్టి.. ప్రిపరేషన్
గ్రూప్-2, 2016లో ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయం సాధించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాను. గతేడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఆరు నెలలు సెలవు పెట్టి ప్రిపరేషన్ సాగించాను. ఫలితంగా తాజా విజయం లభించింది. రాష్ట్ర‌ స్థాయిలో అత్యధిక మార్కులు రావడం సంతోషంగా ఉంది. డిప్యూటీ తహశీల్దార్‌గా ప్రజలకు అందాల్సిన పథకాలు వారికి చేరేలా పనిచేయడం తద్వారా సమాజాభివృద్ధికి నా వంతు కృషిచేయడమే లక్ష్యం.

పరీక్ష రోజు వరకు ఇలా ఉండాలి..
గ్రూప్స్ ఔత్సాహిక అభ్యర్థులకు లక్ష్యంపై స్పష్టత ఉండాలి. లక్ష్యం నిర్దేశించుకున్నాక.. దాన్ని సాధించాలనే తపన.. పరీక్ష రోజు వరకు ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సబ్జెక్ట్ కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఫలానా సబ్జెక్ట్‌లో ‘వీక్’గా ఉన్నామనే భావనతోనే సాగితే.. ఆ సబ్జెక్ట్‌లో పట్టు సాధించడం అసాధ్యం. నాకు ఎకనామిక్స్ కష్టంగా అనిపించేది. క్రమేణా దానిపై ఆసక్తి పెంచుకున్నాను. ఫలితంగా ఆ పేపర్‌లో 115.86 మార్కులు వచ్చాయి. ఇలా.. ప్రతిఒక్కరూ తమకు ప్రతికూలం లేదా బలహీనంగా ఉన్న సబ్జెక్ట్‌పై ఆసక్తిని పెంపొందించుకుంటే.. తొలుత కష్టంగా ఉన్నప్పటికీ క్రమంగా అందులో లీనమై చదవగలిగే నైపుణ్యం అలవడుతుంది!!

Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

మరింత ఆనందం..
ప్రస్తుత ఫలితాల్లో మా కుటుంబానికి మరింత ఆనందం కలిగించే విషయం.. ఇంతకుముందు గ్రూప్-2 (2012)లో విజయం సాధించి ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై ప్రస్తుతం సీఐగా పనిచేస్తున్న భార్య గీతా కుమారి, అలాగే తమ్ముడు అశోక్ కుమార్‌రెడ్డి ఇద్దరూ గ్రూప్-2 ఫలితాల్లో మంచి మార్కులు సాధించి.. డిప్యూటీ తహశీల్దార్ పోస్టులకు ఎంపిక కావడం విశేషం.

Success Story: ఈ మాట కోస‌మే గ్రూప్‌–2 కొట్టా.. కానీ

#Tags