AP Intermediate Education Board News: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు
అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ విద్యలో జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా సంస్కరణలను అమలు చేయనున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్‌ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సైతం సీబీఎస్‌ఈ విధానంలోకి మారింది. 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.
జాతీయ విద్యా విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు బోర్డు పరీక్షలను రద్దు చేసి, సాధారణ వార్షిక పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనలు, సలహాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బోర్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లో అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. ఇంటర్ విద్యలో తీసుకురానున్న విద్యా సంస్కరణలపై బుధవారం తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: Inter Exams Fee News: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యార్థుల ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం..తేదీలు ఇవే..
ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చే సంస్కరణల ఫలితాలు 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశమని, అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనలు కోరుతున్నట్టు చెప్పారు. ప్రతిపాదిత సంస్కరణలను www.bieap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచామని.. సూచనలు, అభ్యంతరాలను జనవరి 26వ తేదీలోగా biereforms@gmail.com మెయిల్ చేయాలన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్
ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియేట్ సిలబస్ కొన్ని సంవత్సరాలుగా మార్చలేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తేనున్నట్టు కృతికా శుక్లా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 15కు పైగా రాష్ట్రాల్లో ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాయన్నారు. విద్యా రంగంలో అనుభవం గల నిపుణులతో ప్రతి సబ్జెక్టుకు ఒక నిపుణుల కమిటీ చొప్పున 14 కమిటీలను వేశామన్నారు.
వారి సూచనలతో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్–2023కు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యలో ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశ పెడుతున్నామన్నారు. ఆ పై సంవత్సరం ఇంటర్ రెండో ఏడాది సిలబస్ అందుబాటులోకి వస్తుందన్నారు.
ఇదీ చదవండి: Inter Practical Exams: ఇంటర్‌లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్.. ఈసారి ప్రాక్టికల్స్ ఇలా..
పాఠశాల విద్యా శాఖ 2024–25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టిందని, ఈ విద్యార్థులకు అనుగుణంగా 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ, 2026–27 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోను ఎన్సీఈఆర్టీ సిలబస్ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, జేఈఈ సిలబస్‌కు అనుగుణంగా సైన్స్ సిలబస్ ఉంటుందని ఆమె వెల్లడించారు.
ఇంటర్ తొలి ఏడాది పరీక్షల రద్దు ప్రతిపాదన
దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల బోర్డులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించడం లేదని శుక్లా తెలిపారు. అత్యధిక రాష్ట్రాల్లో ఇంటర్ బోర్డులు, యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారన్నారు. ఈ కమ్రంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలు, మూల్యాంకనంలోనూ మార్పులు తీసుకొస్తున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరానికి బోర్డు పరీక్షలు రద్దుచేసి, కళాశాలల అంతర్గత పరీక్షలుగా మార్చనున్నట్టు చెప్పారు.
బోర్డు నిర్ణయించిన సిలబస్, బ్లూ ప్రింట్ ఆధారంగా కాలేజీల్లో అంతర్గతంగా నిర్వహిస్తారన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తుందన్నారు. ఈ ప్రతిపాదనలపై సలహాలను ఈనెల 26వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఇంటర్ బోర్డుకు తెలియచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కొత్త ముసాయిదా ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా మార్పులు చేస్తామని, ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ మార్కులతో పాటు ప్రాక్టికల్స్ తప్పనిసరి చేస్తామన్నారు.
పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ఒక్క మార్కు ప్రశ్నలను ప్రతిపాదించారని, 8 మార్కుల వ్యాసరూప ప్రశ్నల స్థానంలో 5 లేదా 6 మార్కుల ప్రశ్నలు ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, మొదటి సంవత్సరం పరీక్షల రద్దు అనేది ప్రతిపాదనలు మాత్రమే అని, ఇంకా రద్దు చేయలేదన్నారు.
ఇదీ చదవండి: Inter Students Breaking News : ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో పరీక్షలు ఉండవు.. ? కారణం ఇదేనా..?
అన్ని గ్రూపుల్లోను థియరీ, ప్రాక్టికల్ మార్కులు
సీబీఎస్‌ఈ విధానం ప్రకారం ఇంటర్మీడియట్ అన్ని గ్రూపులకు థియరీ, ప్రాక్టికల్ మార్కులు తప్పనిసరి చేశారు. ఆర్ట్స్ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టులకు 500 మార్కులు ఇచ్చారు. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు, ఇందులో 80 మార్కులు థియరీకి, 20 మార్కులు ప్రాక్టికల్స్/ ప్రాజెక్టు వర్క్‌కు కేటాయిస్తారు.
ఎంపీసీ గ్రూప్‌లో 380 మార్కులు థియరీకి, 120 మార్కులు ప్రాక్టికల్స్.. మొత్తం 500 మార్కులు ఇస్తారు. బైపీసీ గ్రూప్‌లో 370 మార్కులు థియరీకి, 130 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఇస్తారు. అన్ని గ్రూపులకు ఐచ్చికంగా ఎంచుకునే ఆరో సబ్జెక్టుకు మార్కులు ఎన్ని అనేది ఇంకా నిర్ణయించలేదు.
ప్రతి గ్రూప్‌లో ఐదు సబ్జెక్టుల విధానం
ప్రస్తుతం ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్‌లు, నాలుగు మెయిన్‌సబ్జెక్టులు (మొత్తం ఆరు), ఆర్ట్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్‌లు, మూడు మెయిన్ సబ్జెక్టుల (మొత్తం ఐదు) విధానం అమల్లో ఉంది. మార్కుల కేటాయింపు కూడా భిన్నంగా ఉంది. దీంతో సైన్స్ గ్రూపుల విధానంపై దేశంలోని కొన్ని యూనివర్సిటీలు అభ్యంతరం పెడుతుండడంతో జేఈఈ, నీట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఐదు సబ్జెక్టులు ప్రధానంగా.. ఆరో సబ్జెక్టు ఐచ్చికంగా ఎంపిక చేసుకునే విధానం రానుంది.
ఈ క్రమంలో అన్ని గ్రూపులకు ఒక లాంగ్వేజ్, నాలుగు మెయిన్ సబ్జెక్టులు (మొత్తం ఐదు), 500 మార్కుల విధానం ప్రతిపాదించారు. ఇందులో ఒక సబ్జెక్టు ఇంగ్లిష్ లాంగ్వేజ్ తప్పనిసరి. రెండో సబ్జెక్టు ‘ఎలక్టివ్’. ఇందులో ఏదైనా లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకటి ఎంచుకోవచ్చు.
సైన్స్ లేదా ఆర్ట్స్ గ్రూపుల్లో మూడు (3, 4, 5 సబ్జెక్టులు) ప్రధాన సబ్జెక్టులు ఎంచుకోవాలి. ఎంపీసీలో మ్యాథ్స్–ఏ, బీ పేపర్ల స్థానంలో ఒకే పేపర్ ఉంటుంది. బైపీసీలో బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి ‘జువాలజీ’గా పరిగణిస్తారు. ఆర్ట్స్‌లో కోర్సులైన సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రస్తుతం ఉన్న 26 కాంబినేషన్లు ఉంటాయి. విద్యార్థులు నచ్చిన కాంబినేషన్‌ను ఎంచుకోవచ్చు.
ఆరో సబ్జెక్టుగా (ఆప్షనల్ మాత్రమే.. తప్పనిసరి కాదు) ఏదైనా లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి ఐదు సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టు ఫెయిలై.. ఆరో సబ్జెక్టు పాసైతే అప్పుడు ఆరో సబ్జెక్టును మెయిన్ సబ్జెక్టుగా పరిగణిస్తారు. ఆరో సబ్జెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్ తప్పనిసరిగా పాసవ్వాలి.