A.P. Open School Society: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల షెడ్యూల్‌ విడుదల

A.P. Open School Society: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల షెడ్యూల్‌ విడుదల
A.P. Open School Society: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల షెడ్యూల్‌ విడుదల

రాయవరం: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్‌ స్కూల్‌) ద్వారా నిర్వహించే పది, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను ఏపీ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్‌ కె.నాగేశ్వరరావు విడుదల చేశారు. పరీక్ష ఫీజుల విధి విధానాలు, పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ సార్వత్రిక విద్యాపీఠం జిల్లా కోఆర్డినేటర్‌ పి.సాయివెంకటరమణ తెలిపారు. పరీక్ష ఫీజును అపరాధ రుసుం లేకుండా 2024 జనవరి 5 నుంచి 19వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంది. అపరాధ రుసుం లేకుండా పదవ తరగతికి ఒక సబ్జెక్టుకు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.5, పరీక్ష ఫీజుగా రూ.95 చెల్లించాలి. ఇంటర్‌కు ఒక సబ్జెక్టుకు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.5, పరీక్ష ఫీజుగా రూ.145 చెల్లించాల్సి ఉంది.

Also Read:  TSWREIS, Hyderabad Inter Admission 2024 Notification

ప్రాక్టికల్‌ ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలి. ఉత్తీర్ణత సాధించని ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు పాసైన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్‌కు థియరీ ఒక్కో సబ్జెక్టుకు రూ.250, ఫెయిలైన సబ్జెక్టుకు రూ.150 వంతున ఫీజుగా చెల్లించాలి. ప్రాక్టికల్‌ ఒక సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలి. రూ.25 అపరాధ రుసుంతో జనవరి 20 నుంచి 27వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 4 నుంచి 9వ తేదీ వరకు తత్కాల్‌ రుసుంతో పదవ తరగతికి రూ.500, ఇంటర్‌కు రూ.1,000 అపరాధ రుసుంతో పాటు, ఆయా సబ్జెక్టులకు నిర్దేశిత పరీక్ష ఫీజును ఏపీ ఆన్‌లైన్‌, ఏపీఓఎస్‌ఎస్‌ ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశానికి 1,269 మంది, ఇంటర్‌లో చేరేందుకు 5,077 మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వీరంతా పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంది.

పరీక్షల షెడ్యూల్‌ ఇదీ

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ మూడవ తేదీ వరకు జరుగనున్నాయి.

నిర్ణీత గడువులోగా..

ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న విద్యార్థులు పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోపుగా చెల్లించాలి. ఆన్‌లైన్‌ ద్వారా గాని లేదా ఓపెన్‌ స్కూల్‌ కేంద్రాల కోఆర్డినేటర్ల వద్ద గాని పరీక్ష ఫీజును చెల్లించాలి. సందేహాలు, ఇబ్బందులు తలెత్తినా 8977645704 నంబరుకు ఫోన్‌ చేయవచ్చు.

                                                                                    – పి.సాయివెంకటరమణ, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌, అమలాపురం

#Tags