Tenth Class Public Exams 2024: పకడ్బందీగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) డాక్టర్‌ వీ.శేఖర్‌ తెలిపారు. డీఈఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పది పబ్లిక్‌ పరీక్షలను తిరుపతి జిల్లా వ్యాప్తంగా 162 పరీక్షా కేంద్రాల్లో ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్‌ 27,012 మంది, ప్రైవేటు 3,909 మంది, మొత్తం 30,921మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షల కోసం 162 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 162 మంది డీఓలు, 1,666 మంది ఇన్విజిలేటర్లు, ఆరుగురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించినట్టు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల సౌకర్యార్థం బల్లలు, తాగునీరు, అలాగే ఏఎన్‌ఎంలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, ఆ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

చదవండి: AP 10th Class Study Material

మధ్యాహ్నం నుంచి ఓపెన్‌ స్కూల్‌
ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను అదే తేదీల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జిల్లా వ్యాప్తంగా పదో తరగతికి 7, ఇంటర్‌ పరీక్షకు 13, మొత్తం 20 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ తెలిపారు. పదో తరగతి పరీక్షకు రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు 1,611 మంది, ఇంటర్‌ పరీక్షకు రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు 3,235 మంది, మొత్తం 4,846 మంది హాజరు కానున్నట్టు ఆయన వెల్లడించారు.

#Tags