PM Narendra Modi: అలాంటి విద్యావిధానమే ఈరోజుల్లో అవసరం

భారతీయ విలువలతో కూడిన విద్యా విధానం ఈరోజుల్లో అవసరం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద్ సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకుని ఆయన జన్మస్థలమైన గుజరాత్ మోర్బీ జిల్లాలోని తంకారాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు.

ఆర్యసమాజ్‌ని స్థాపించి, వాటి గొప్పతనాన్ని తెలియజేసి
ప్రజలు బానిసత్వంతో కూరుకుపోయి, మూఢనమ్మకాలు బలంగా నమ్ముతున్న తరుణంలో భారతీయ సమాజాన్ని తిరిగి వేదాల వైపు చైతన్యం కలిగించిన గొప్ప సంస్కర్త అని మోదీ కొనియాడారు. ''1875లో అప్పట్లో బలంగా ఉన్న సామాజిక అసమానతలను ఎదుర్కోవడానికి (Arya Samaj) ఆర్యసమాజ్‌ని స్థాపించాడు. వేదాలకు తార్కిక వివరణలు ఇచ్చి, వాటి గొప్పతనాన్ని ఆయన తెలియజేశారు.

కీలకంగా ఆర్యసమాజ్‌ పాఠశాలలు
భారతీయ తత్వమంటే ఏమిటో బ్రిటిష్‌ పాలకులకు చాటిచెప్పారు. మహిళలకు సమాన హక్కులు కావాలని పోరాడారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విద్యాలయాలు సమాజానికి అవసరం.ఆర్యసమాజ్ పాఠశాలలు ఇలాంటి విద్యనందించడంలో కీలకంగా మారాయి.

జాతీయ విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా వీటిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. దయానంద్‌ సరస్వతి పుట్టిన రాష్ట్రంలోనే తాను పుట్టడం గర్వంగా భావిస్తున్నా'' అని మోదీ పేర్కొన్నారు. 
 

#Tags