ITI Campus Placements: ఐఐటీల్లో భారీగా తగ్గిన క్యాంపస్‌ ఆఫర్లు.. అంతర్జాతీయ పరిణామాలు, నూతన సాంకేతికతలే కారణమా!

ఐఐటీలు.. దేశంలో ఇంజనీరింగ్‌ విద్యకు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌గా గుర్తింపు! ఐఐటీల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. లక్షల వేతనాలతో దేశ విదేశీ ఆఫర్లు స్వాగతం పలుకుతాయనే నమ్మకం!! కాని నాణేనికి మరోవైపు కూడా ఉంది.

ప్రస్తుతం పలు ఐఐటీల్లో విద్యార్థులు క్యాంపస్‌ కొలువుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 38 శాతం మందికి ఇంకా ఆఫర్లు అందలేదు. ఈ నేపథ్యంలో.. ఐఐటీ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌.. తాజా ట్రెండ్స్‌.. ఆఫర్లు తగ్గడానికి కారణాలు.. ఇంజనీరింగ్‌ విద్యార్థులు మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపై ప్రత్యేక కథనం.. 

ఐఐటీల్లో 2023–24లో బయటకు వచ్చే బ్యాచ్‌­కు సంబంధించి ప్లేస్‌మెంట్స్‌ సీజన్‌ ముగిసిన తర్వాత కూడా దాదాపు 38 శాతం మంది విద్యార్థులు క్యాంపస్‌ ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో ఈ ఏడాది మొత్తం 21,500 మంది క్యాంపస్‌ డ్రైవ్స్‌కు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 13,410 మందికి మాత్రమే ఇప్పటి వరకు ఆఫర్లు లభించాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, మారుతున్న టెక్నాలజీ కారణంగా.. సంస్థలు ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని, ఈ పరిస్థితి ఈ ఏడాదికే పరిమితమని ప్లేస్‌మెంట్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

NEET UG 2024: ‘నీట్‌’ గ్రేసు మార్కులు రద్దు.. మళ్లీ నీట్‌ పరీక్ష

ఫస్ట్‌ జనరేషన్‌ ఐఐటీల్లో సైతం
ఐఐటీ బాంబే, మద్రాస్, ఢిల్లీ తదితరాలను ఫస్ట్‌ జనరేషన్‌ ఐఐటీలుగా పేర్కొంటారు. కంపెనీలు ఈ ఇన్‌స్టిట్యూట్స్‌కు అధిక ప్రాధాన్యమిస్తాయనే అభిప్రాయం నెలకొన్న సంగతి తెలిసిందే. కాని 2023–24 బ్యాచ్‌కు సంబంధించి ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ ఈ ఏడాది ఇంకా ఎంతో మంది విద్యార్థులకు ఆఫర్లు లభించలేదు. ఇదే పరిస్థితి ఇతర ఐఐటీల్లోనూ కనిపిస్తోంది. ఐఐటీల్లో క్యాంపస్‌ ఆఫర్ల తగ్గుదల అనేది గత కొన్నేళ్లుగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం 3,500 మందికి పైగా విద్యార్థులు ఆఫర్లు రాకుండానే ఐఐటీల నుంచి బయటకు రాగా.. ప్రస్తుత బ్యాచ్‌లో ఆ సంఖ్య ఎనిమిది వేలకు చేరడం గమనార్హం.

అంతర్జాతీయ పరిస్థితులు
ఐఐటీల్లో క్యాంపస్‌ డ్రైవ్స్‌లో తగ్గుదలకు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆయా దేశాల్లో ఆర్థిక మందగమన పరిస్థితులు.. అమెరికా, యూకేల్లో ఎన్నికలు.. కొత్త ప్రభుత్వాల విధానాలు ఎలా ఉంటాయి.. పరిస్థితులు ఎప్పుడు గాడిన పడతాయి వంటి సందేహాలతో సంస్థలు నియామకాల పరంగా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం ఐఐటీల్లో ఇంటర్నేషనల్‌ ఆఫర్స్‌పై ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం.

NEET-UG Paper Leak: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి రియాక్షన్‌ ఇదే..

కన్సల్టింగ్‌ లేకపోవడం
ఐఐటీలు, ఐఐఎంల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో.. కన్సల్టింగ్‌ సంస్థల సంఖ్య 30 శాతం మేరకు ఉంటుంది. బోస్టన్, బెయిన్‌ అండ్‌ కో, ఏటీ కెర్నీ వంటి సంస్థలు నియామకాలు చేస్తుంటాయి. ఈ ఏడాది అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఈ రంగ సంస్థలు నియామకాల సంఖ్యను తగ్గించాయి. దీంతో.. ఇది మొత్తం ప్లేస్‌మెంట్స్‌ ఆఫర్స్‌పై ప్రభావం చూపినట్లు అంచనా వేస్తున్నారు. 

చాట్‌ జీపీటీ ఎఫెక్ట్‌
ఐఐటీల్లో క్యాంపస్‌ డ్రైవ్స్‌లో తగ్గుదలకు మరో కారణం..లేటెస్ట్‌ టెక్నాలజీ అనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా చాట్‌ జీపీటీ ప్రభావం క్యాంపస్‌ ఆఫర్లపై ప్రతికూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. చాట్‌ జీపీటీ, ఏఐ టూల్స్, జెన్‌ ఏఐ వంటి సాంకేతికతల కారణంగా.. ముగ్గురు చేసే పని ఇద్దరికి పరిమితమైందని, దీంతో నియామకాల్లో 20 నుంచి 30 శాతం మేరకు కోత పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

Sports School Admissions: టీజీటీడబ్ల్యూయూఆర్‌జేసీ స్పోర్ట్స్‌ స్కూళ్లలో ఐదో తరగతిలో ప్రవేశాలు

స్టార్టప్స్‌కు సైతం స్వాగతం
స్టార్టప్‌ సంస్థలకు క్యాంపస్‌ డ్రైవ్స్‌కు అనుమతించడంలో ఆచితూచి వ్యవహరించే ఐఐటీలు.. ఇకపై నిబంధనలను సడలించి సదరు స్టార్టప్‌లను కూడా స్వాగతం పలకనున్నాయి. తద్వారా తమ క్యాంపస్‌లో 100 శాతం ఆఫర్స్‌ నమోదయ్యేలా చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూనికార్న్‌లకు పెద్ద పీట వేయాలని ఆలోచిస్తున్నాయి. మిగిలిన స్టార్టప్స్‌ విషయంలో వాటి వ్యాపార ప్రణాళికలు, ఇప్పటి వరకు అవి సాధించిన ఫలితాలు, పొందిన పెట్టుబడులు వంటి వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పే ప్యాకేజ్‌లు
ఐఐటీ క్యాంపస్‌లు ఆయా బ్రాంచ్‌ల వారీగా ముందుగానే పే ప్యాకేజ్‌లను నిర్ధారించి.. అందుకు అంగీకరించిన సంస్థలకే డ్రైవ్స్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంటాయి. ఐఐటీ బ్రాండ్‌ ఇమేజ్‌ తగ్గకుండా ఉండేందుకు సగటు వార్షిక వేతనం 15 లక్షలుగా పలు క్యాంపస్‌లు నిర్ధారిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా పలు కంపెనీలు సదరు నిర్ధారిత ప్యాకేజ్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. అందుకే అవి క్యాంపస్‌ డ్రైవ్స్‌కు రావడంలేదని.. ఈ ప్రభావం ఆఫర్లపై పడిందని చెబుతున్నారు.

Management Trainee Posts: ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..!

పూర్వ విద్యార్థుల సహకారం
ఐఐటీ క్యాంపస్‌ డ్రైవ్స్‌లో అనిశ్చితి నెలకొనడంతో.. సదరు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ వర్గాలు పూర్వ విద్యార్థుల సహకారం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, ఖరగ్‌పూర్, కా­న్పూర్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ వర్గాలు తమ అలూమ్నీని సంప్రదిస్తున్నాయి. వారు పని చేస్తున్న సంస్థలు, ఇతర కంపెనీలు..ఐఐటీల్లో క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు ఇండస్ట్రీ వర్గాలతోనూ సంప్రదింపులు సాగిస్తున్నారు.

ఉన్నత విద్యవైపు
ఇటీవల కాలంలో ఉన్నత విద్యలో చేరే ఐఐటీయన్ల సంఖ్య పెరుగుతోందనే వాదన వినిపిస్తోంది. బీటెక్‌ విద్యార్థులు ఎంటెక్‌ వైపు, ఎంటెక్‌ విద్యార్థులు పీహెచ్‌డీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో.. క్యాంపస్‌ ఆఫర్లు అనుమతించే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందంటున్నారు. అంతేకాకుండా పే ప్యాకేజ్‌లు భారీ స్థాయిలో ఉంటేనే కొలువులో చేరుతున్నారు. లేకుంటే ఉన్నత విద్యవైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. 

TS LAWCET 2024 Results Out: లాసెట్‌లో 72.66 శాతం ఉత్తీర్ణత.. హైదరాబాద్‌ వాసికి ఫస్ట్‌ ర్యాంక్‌

నూతన నైపుణ్యాలు
ప్రస్తుతం నియామకాల్లో అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో.. ఇంజనీరింగ్‌ కోర్సుల విద్యార్థులు నూతన నైపుణ్యాల సాధన దిశగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేటెస్ట్‌ టెక్నాలజీ, వాటి అప్లికేషన్స్, రూపకల్పన వంటి అంశాల్లో మరింత మెరుగైన సామర్థ్యం పొందేందుకు కృషి చేయాలంటున్నారు. ఉన్నత విద్య కోర్సుల్లో చేరిన వారు తమ కోర్, డొమైన్‌ అంశాల్లో లోతైన అవగాహన పొందేందుకు ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు. ఏఐ, ఐవోటీ, ఆటోమేషన్, రోబోటిక్స్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ అంశాలపై పట్టు సాధించాలని సూచిస్తున్నారు.

2025 బ్యాచ్‌కు పూర్వ పరిస్థితి!
మొత్తంగా ఈ ఏడాది క్యాంపస్‌ డ్రైవ్స్‌లో ఐఐటీలు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా.. 2025లో పట్టా అందుకునే వారికి మాత్రం ఢోకా ఉండదని ఆయా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పటికి ఇండస్ట్రీ వర్గాలకు నియామకాలపై స్పష్టత లభిస్తుందని.. అంతర్జాతీయ పరిస్థితులు సైతం సాధారణ స్థితికి చేరుకుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ముఖ్యాంశాలు

  •     2023–24 బ్యాచ్‌లో భారీగా తగ్గిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌.
  •     దాదాపు ఎనిమిది వేల మందికి అందని ఆఫర్లు.
  •     అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వేచి చూసే ధోరణిలో సంస్థలు.
  •     స్టార్టప్స్‌కు సైతం స్వాగతం అంటున్న ఐఐటీలు.
  •     చాట్‌ జీపీటీ, ఏఐ, జెన్‌ ఏఐలు కారణమనే అభిప్రాయాలు. 

ఐఐటీల ప్లేస్‌మెంట్స్‌.. గత మూడేళ్ల గణాంకాలు

  •     2022లో 17,900 మందికి గాను 14,490 మందికి ఆఫర్లు.
  •     2023లో 20,000 మందిలో 15,839 మందికి ఆఫర్లు.
  •     2024లో 21,500కు గాను 13,410 మందికి ఆఫర్లు. 

 16347 AP Teacher Jobs Details 2024 : త్వ‌ర‌లోనే 16,347 డీఎస్సీ పోస్టులకు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే..

#Tags