BED Colleges: బీఈడీ కళాశాలలపై కొరడా!

నిజామాబాద్‌ అర్బన్‌: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బీఈడీ కళాశాలలపై అధికారులు కొరడా ఝళిపించనున్నారు. ఈ ఏడాది బోధన ప్రా రంభం కాకముందే కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. సక్రమంగా ఉన్న కళాశాలలకే అనుమతి లభించేలా చర్యలు తీసుకోనున్నారు.

కొన్నేళ్లుగా అదే తీరు..

జిల్లా వ్యాప్తంగా 14 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో వంద సీట్ల చొప్పున ప్రవేశాలు కల్పిస్తున్నారు. మూడు కళాశాలలో 50 సీట్లకు అనుమతి ఉంది. కానీ బీఈడీ కళాశాలలు ఎన్‌సీటీఈ(నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌) నిబంధనల ప్రకారం కళాశాలలు కొనసాగాలి. కనీస సౌకర్యలైన తాగునీరు, బాత్‌రూంలు, ఫర్నీచర్‌ ఏర్పాటు, బోధకుల ఏర్పాటు, ప్రతిరోజూ బోధన కొనసాగాలి.

ఇవి కచ్చితంగా అమలు కావాల్సి ఉండగా జిల్లాలో ఆయా కళాశాలల్లో కొనసాగడం లేదు. 16 మంది రెగ్యులర్‌ బోధకులు కచ్చితంగా ఉండాలి. కానీ ఎక్కడా లేదు. నగరంలోని ఓ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేటు పాఠశాలలో కొనసాగుతోంది.

చదవండి: Dr Jayaraj: చదువుకు పేదరికం అడ్డుకాదు.. వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థినులు..

కేవలం ఒక్క గదిలోనే విద్యాబోధన చేపడుతున్నారు. విద్యార్థులు కళాశాలకు రాకుండానే విద్యాబోధన కొనసాగుతుంది. సొంత భవనాలు లేవు. నగర శివారులోని ఓ బీఈడీ కళాశాలలో ప్రతి ఏటా విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటున్నా విద్యాబోధన చేపట్టడం లేదు.

కేవలం విద్యార్థులను పరీక్షలకు మాత్రం అనుమతి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. బోధన్‌లోని ఓ కళాశాలలో ఇదే పరిస్థితి నెలకొంది. భవనం సక్రమంగా లేదు. కనీస సౌకర్యాలు కొనసాగడంలేదు. ఆర్మూర్‌లోని మరో కళాశాల లాడ్జి భవనంలో కొనసాగుతోంది. ప్రతి కళాశాలలో విద్యార్థులు రాకపోయినా వారి వద్ద డబ్బులు వసూలు చేసి అటెండెన్స్‌ను కొనసాగిస్తున్నారు.

ఫ్యాక్టలీ మాత్రం ఎక్కడా లేదు. ఒక్కరు ఇద్దరితో కళాశాలను నడిపిస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. ల్యాబ్‌ ఫ్యాక్టలీ అందుబాటులో ఉండదు. తరగతి గదిలో ఫర్నీచర్‌ కూడా అందుబాటులో లేదు. ఇదే స్థితిలో జిల్లాలోని బీఈడీ కళాశాలలు కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి.

నిబంధనలు పాటించని వాటిపై చర్యలు

నిబంధనలు పాటించని బీఈడీ కళాశాలలపై చర్యలు తీసుకునేందుకు అకడమిక్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ నడుంబిగించారు. కళాశాలలను దారికి తీసుకురావడంపై దృష్టిసారించారు. దీనిలో భాగంగా నేటి నుంచి కళాశాలల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టనున్నారు.

సంబంధిత కళాశాలల్లో లోట్లుపాట్లను గుర్తించి మే చివరి వారం వరకు సంబంధిత కళాశాలలకు సౌకర్యలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. లేదంటే సంబంధిత కళాశాలలకు ఈ ఏడాది బీఈడీ విద్యాబోధనకు అనుమతి రద్దు చేయనున్నారు. గతంలోనే ఇలాంటి కళాశాలల యజమాన్యాలను పిలిపించి పలుమార్లు సమావేశాలు నిర్వహించి పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు.

అయినా మార్పు రాకపోవడంతో ఈసారి కఠినంగా వ్యవహరించనున్నారు. కనీస వసతులు, ఫ్యాక్టలీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. గతంలో కొన్ని కళాశాలలు కోర్టు ద్వారా అనుమతి తీసుకొని అడ్మిషన్లు కొనసాగించా రు. ఇలాంటి కళాశాలలపై ముందస్తుగానే అధికారులు న్యాయబద్ధంగా చర్యలు తీసుకోనున్నారు.

నిబంధనలు పాటించకపోతే చర్యలు

బీఈడీ కళాశాలలు నిబందనల ప్రకారం కొనసాగవల్సిందే. లేదంటే చర్యలు తీసుకుంటాం. కళాశాలలను తనిఖీలు చేసి లోట్లు పాట్లను గుర్తిస్తాం. గడువులోగా మారితే మంచిదే. లేదంటే ఈ ఏడాది అడ్మిషన్లు కూడా రద్దు చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– చంద్రశేఖర్‌, తెయూ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌
 

#Tags