Anand Mahindra Extends Help To Viral Delhi Boy: నాన్న చనిపోయాడు, అమ్మ వదిలేసింది.. సొంతంగా ఫుడ్ బిజినెస్.. సెన్సేషన్‌గా మారిన పదేళ్ల పిల్లాడు
జీవితంలో అందరికి కష్టాలు ఉంటాయి. కొందరు వాటినే తల్చుకుంటూ బాధపడితే, మరికొందరు మాత్రం వాటినుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి ధైర్యంగా ముందడుగు వేస్తుంటారు. ఢిల్లీకి చెందిన 10 ఏళ్ల జస్‌ప్రీత్ కూడా ఇంతే. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను మోస్తూ, మరోవైపు చదువుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పుడీ బాలుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాడు. ఇతడి ధైర్యానికి పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయ్యారు.
ఆ బాలుడి వయసు కేవలం 10 ఏళ్లు మాత్రమే. ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యంలో బండెడు బారాన్ని మోస్తున్నాడు. తండ్రి చనిపోయి, తల్లి వదిలేసినా దైర్యంగా కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు ఇంటిని నడిపేందుకు రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకొని తన చెల్లెలిని పోషిస్తున్నాడు.
వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన జస్‌ప్రీత్ తండ్రి బ్రెయిన్ క్యాన్సర్‌తో ఇటీవలె మరణించాడు. తల్లి కూడా వదిలేసి వెళ్లిపోవడంతో కుటుంబ బాధ్యత మొత్తం ఆ పదేళ్ల పిల్లాడిపై పడింది. దీంతో ఉదయం స్కూల్‌కి వెళ్లి సాయంత్రం వేళలల్లో ఫుడ్ బిజినెస్ చేస్తూ ఇంటిని పోషిస్తున్నాడు. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకొని కుటుంబాన్ని ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
తాజాగా ఓ ఫుడ్ వ్లాగర్ జస్‌ప్రీత్‌కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అది కాస్తా ఆనంద్ మహీంద్రాను కూడా చేరింది. అయితే ఇంత చిన్న వయసులో కుటుంబ బారాన్ని మోస్తున్న బాలుడి పరిస్థితిని చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్రా.. ఆ కుర్రాడికి సాయం చేస్తానంటూ ముందుకు వచ్చారు.
UPSC Civils Ranker Ravula Jayasimha Reddy : ఐపీఎస్ టూ ఐఏఎస్.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే..
''ఈ ధైర్యం పేరు జస్‌ప్రీత్. తనకు ఉన్న బాధ్యతల కారణంగా చదువులపై ఎలాంటి ఆటంకం కలగకూడదు. అందుకే బాలుడ్ని చదివించేందుకు మహీంద్రా ఫౌండేషన్ ముందుకొచ్చింది. అతడి వివరాలు తెలిస్తే తెలియజేయండి'' అంటూ నెటిజన్లను కోరారు. ఆనంద్ మహీంద్రా పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. బాలుడికి సాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఆనంద్ మహీంద్రాను తెగ పొగిడేస్తున్నారు.