Skip to main content

PJTSAU Admissions 2024: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్‌

PJTSAU Admissions 2024 Agriculture course admission notification  Veterinary course admission details  Fisheries course application process   Horticulture studies admissions   Food technology program information  ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్‌
PJTSAU Admissions 2024: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్‌

జగిత్యాల: రాష్ట్రంలోని వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీష్‌, హార్టికల్చర్‌, ఫుడ్‌ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు అవసరమైన నోటిఫికేషన్‌ను ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. బైపీసీ చదివి తెలంగాణ ఎఫ్‌సెట్‌–2024(మెడికల్‌ అండ్‌ అగ్రికల్చర్‌)లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెటర్నరీ సైన్స్‌ కోర్సు వ్యవధి ఐదున్నర ఏళ్లు కాగా, మిగతా కోర్సుల వ్యవధి నాలుగేళ్లు.

సీట్ల వివరాలు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌, జగిత్యాల జిల్లా పొలాస, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా, సిరిసిల్ల–సిద్దిపేట మధ్యలో, ఆదిలాబాద్‌, సిద్దిపేట జిల్లా తోర్నాలలో ఎనిమిది అగ్రికల్చర్‌ కళాశాలలున్నాయి. ఇందులో 615 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 227 సెల్ఫ్‌ ఫైనాన్స్‌(పేమెంట్‌) సీట్లున్నాయి. బీఎస్సీ(వెటర్నరీ) కళాశాలలు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌, జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, వరంగల్‌ అర్బన్‌ జిల్లా మమూనూర్‌లో ఉండగా, అందులో 184 సీట్లున్నాయి.

ఇదీ చదవండి:  44,228 GDS Opportunities in India Post

ఇంకా బీఎఫ్‌ఎస్సీ(ఫిషరీష్‌) కళాశాలలు వనపర్తి జిల్లా పెబ్బెరులో 28 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముత్తుకూర్‌లో తెలంగాణ విద్యార్థులకు 11 సీట్లు కేటాయించారు. బీఎస్సీ(హార్టికల్చర్‌) కళాశాలలు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌, వనపర్తి జిల్లా మోజర్ల, మహబూబాబాద్‌ జిల్లా మల్యాలలో ఉండగా, ఇందులో 200 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 34 పేమెంట్‌ సీట్లను కేటాయించారు. బీఎస్సీ(కమ్యూనిటీ సైన్స్‌) కళాశాల హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో ఉండగా, 38 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 5 పేమెంట్‌ సీట్లు ఉన్నాయి. బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కళాశాల నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌లో ఉండగా, 25 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 5 పేమెంట్‌ సీట్లు ఉన్నాయి. అన్ని కోర్సుల్లో ఫేమెంట్‌ సీట్లను సైతం తెలంగాణ ఎఫ్‌సెట్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు.

ఆగస్టు 18 ఆఖరు తేదీ

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. సీటు వస్తే వ్యవసాయ, కమ్యూనిటీ సైన్స్‌, ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులకు రూ.46,550, వెటర్నరీ కోర్సులకు రూ.63,260, ఫిషరీస్‌ కోర్సులకు 48,130, హార్టికల్చర్‌ కోర్సులకు రూ.46,710 చెల్లించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్‌ కోర్సుల్లో పేమెంట్‌ సీట్లకు రూ.10లక్షలు, హార్టికల్చర్‌ కోర్సులో పేమెంట్‌ సీట్లకు రూ.9లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్‌ సీట్లకు సంబంధించి ప్రత్యేక కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ ఎంసెట్‌–2024 ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు ఆగస్టు 17 ఆఖరు తేదీ కాగా, ఆన్‌లైన్‌ దరఖాస్తులు పంపేందుకు ఆగస్టు 18 చివరి తేదీ.

అర్హతలివే..

డిసెంబర్‌ 31, 2023 నాటికి జనరల్‌ అభ్యర్థులు వయస్సు 17 ఏళ్లు పూర్తయి, 22 ఏళ్లు దాటి ఉండొద్దు. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు, పీహెచ్‌లకు 27 ఏళ్ల వరకు అనుమతి ఉంటుంది. ఒక్క వెటర్నరీ కోర్సుకు మాత్రం జనరల్‌ అభ్యర్థులు 17–25 ఏళ్ల మధ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు 30 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఎకరం వ్యవసాయ భూమి ఉన్న రైతుల పిల్లలకు వెటర్నరీ కళాశాలల్లో 25 శాతం సీట్లు, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కోర్సుల్లో 40 శాతం సీట్లు రిజర్వ్‌ చేయబడ్డాయి. అయితే ఆ భూమి విద్యార్థి పేరు మీద లేదా తల్లిదండ్రుల పేరు మీద పట్టా ఉండాలి. ఇంటర్‌ వరకు కనీసం నాలుగేళ్లపాటు నాన్‌ మున్సిపల్‌ ఏరియా(గ్రామీణ ప్రాంతం)లో చదివి ఉండాలి. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 40 శాతం సీట్లు రిజర్వ్‌ చేయబడ్డాయి. మరిన్ని పూర్తి వివరాలు https://www.pjtsau.edu.in/admission.html వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చు.

 

Published date : 15 Jul 2024 01:54PM

Photo Stories