Boeing Startup Grant Winners: ఇన్నోవేటర్స్..తక్కువ ఖర్చుతో అద్భుత ఆవిష్కరణలు!
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న వారి కోసం తక్కువ ధరలో, సౌకర్యవంతమైన ఇయర్ ఇంప్లాంట్‌ను డెవలప్ చేశారు మదురైకి చెందిన ట్విన్స్ రామన్, లక్ష్మణన్. బోయింగ్ ఇండియా (బెంగళూరు) బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్‌షిప్ అండ్ డెవలప్‌మెంట్(బిల్డ్) గ్రాంట్ ΄పొందిన వారిలో రామన్, లక్షణన్ ఒకరు...పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న అమ్మాయికి తల్లిదండ్రులు వైద్యం చేయించాలనుకున్నారు. తమ ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బుతో కూతురుకి నెల రోజులు మాత్రమే వైద్యం చేయించగలిగారు. ఈ విషయం రామ్, లక్షణ్ సోదరులకు తెలిసింది.
ఈ ట్విన్స్ మదురైలోని ఒక కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదువుతున్నారు. స్క్రాప్ మెటీరియల్‌తో వెంటిలేటర్‌ను తయారుచేయాలని ప్రయత్నిస్తున్న సోదరులు అమ్మాయి విషయం తెలిసిన తరువాత ఇయర్ ఇంప్లాంట్‌ను డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. పుట్టుకతో వచ్చే వినికిడి లోపానికి చికిత్స చేయడానికి నాన్–ఇన్వేసివ్ హియరింగ్ ఇంప్లాంట్ డెవలప్ చేయడంలో విజయం సాధించారు. సంప్రదాయ ఇంప్లాంట్‌లతో పోల్చితే దీని ధర తక్కువ. ఫస్ట్ ప్రోటోటైప్‌ను తమ పెరట్లో(బ్యాక్ యార్డ్)లో క్రియేట్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ వేంచర్‌కు ‘బ్యాక్‌యార్డ్ క్రియేటర్స్’ అని పేరు పెట్టుకున్నారు.
ఖర్చును తగ్గించడం తోపాటు సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఇంప్లాంట్ ఇది. బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్‌షిప్ అండ్ డెవలప్‌మెంట్ (బిల్డ్–బెంగళూరు) గ్రాంట్ పొందిన విజేతల్లో రామ్,లక్ష్మణన్‌లు ఉన్నారు. చెవి వెనుక భాగంలో ఉంచే ఈ పరికరం విద్యుత్ తరంగాలను విడుదల చేసి నరాలను తాకి ఉత్తేజపరుస్తుంది. ఎలాంటి అసౌకర్యం లేకుండా వినడానికి సహాయపడుతుంది. ‘మాగ్నటిక్ ఇంప్లాంట్‌కు ఉండే పరిమితులు మా డివైజ్‌లో ఉండవు’ అంటున్నాడు రామన్.
మన దేశంలో ప్రారంభ దశ స్టార్టప్‌లను ప్రొత్సహించడానికి 2019లో ‘బిల్డ్’ను ప్రారంభించారు. కస్టమర్ సెగ్మెంటేషన్ గురించి ఎంత బాగా ఆలోచించారు....మొదలైన విషయాల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది 1200 ఐడియాలు వచ్చాయి. ‘గ్రాంట్’ మొదలైనప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఐడియాలు రావడం ఇదే మొదటిసారి. ఒక్కో స్టార్టప్‌కు పది లక్షల రూపాయలు ఇస్తారు. రామన్, లక్ష్మణన్‌లతో ΄ాటు ప్రిత్వీష్ కుందు (గ్రీన్ ఎనర్జీ ఫర్ ఏవియేషన్ సెక్టార్), ఐశ్వర్య కర్నాటకి, పరీక్షిత్ మిలింద్ సోహోని–ముంబై (గ్లోవట్రిక్స్–సైన్‌లాంగ్వేజ్‌ను స్పీచ్ అంట్ టెక్ట్స్‌లోకి ట్రాన్స్‌లెట్ చేసే పరికరం), సత్యబ్రత శతపథి–ఒడిషా (బన్వీ ఏరో), దేవేంద్ర ప్రధాన్, బిశ్వజిత్ (సిటీపీఎల్–భువనేశ్వర్)లు ‘బిల్డ్’ గ్రాంట్‌కు ఎంపికైన వారిలో ఉన్నారు.
అండర్ వాటర్ రోబోటిక్స్..
మన దేశంలో డ్యామ్‌లు, బ్రిడ్జీలు... మొదలైన వాటికి సంబంధించిన అండర్‌వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించి ఇన్‌స్పెక్షన్, ఆపరేషన్ అనేది సవాలుగా మారింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలాలో చదువుకున్న దేవేంద్ర ప్రధాన్, బిశ్వజిత్ ఈ సమస్యకు పరిష్కారం కనుకొన్నారు. అండర్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణను వేగవంతం, సురక్షితం చేయాలనే లక్ష్యంతో ‘సిటీపీఎల్’ కంపెనీ స్థాపించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఏఐ–బేస్డ్ టెక్నాలజీతో అటానమస్ అండర్‌వాటర్ వెహికిల్(ఏయూవీ), రిమోట్లీ ఆపరేట్ వెహికిల్(ఆర్‌వోవీ)ని డెవలప్ చేశారు.
‘అండర్‌వాటర్ రోబోటిక్స్‌కు సంబంధించిన రంగంలో మన దేశంలో నాలుగు స్టార్టప్‌లు మాత్రమే ఉన్నాయి. అందులో సిటీపీఎల్ ఒకటి’ అంటున్న దేవేంద్ర మెర్సిడెస్ బెంజ్ ‘ఆర్ అండ్ డీ’ విభాగంలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని జర్మనీ నుంచి ఇండియాకు వచ్చి బిస్వజిత్‌తో కలిసి ‘సిటీపీఎల్’ను స్టార్ట్ చేశాడు. మెకట్రోనిక్స్, ఆటోమేషన్ ఇంజనీరింగ్ చేసిన బిశ్వజిత్ స్టార్టప్ కోసం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు