Inspiring Story: అమెరికాలో ఐటీ జాబ్ వదిలేసి,రీ యూజబుల్ న్యాప్‌కిన్స్ తయారీ
‘ఎంత పెద్ద చదువులు చదివినా.. ఆర్థికంగా ఎంత ఎదిగినా మనసుకు తృప్తిగా లేకపోతే అందులో సహజత్వం లోపిస్తుంది. చేసే పనుల్లో నైపుణ్యం రాదు..’ అంటున్నారు హేమ. పర్యావరణహితంగా మహిళలకు ఉపయుక్తంగా ఉండే రీ యూజబుల్ క్లాత్‌తో ప్యాడ్స్, పిల్లలకు డైపర్లు తయారు చేస్తూ, గ్రామంలోని మహిళలకు ఉపాధి కల్పిస్తూ వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు.
తమిళనాడు, చిత్తూరు బార్డర్‌లో ఉన్న అతిమంజరీ పేట్‌లో ఉన్న హేమ తన ఉత్పత్తులతో హైదరాబాద్‌లోని క్రాఫ్ట్ కౌన్సిల్‌లోని ప్రదర్శనశాలలో తన స్టాల్ ద్వారా పరిచయం అయ్యారు. అత్యంత నిరాడంబరంగా కనిపిస్తున్న ఆమె... అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసి, స్వదేశానికి వచ్చి తనను తాను పర్యావరణ ప్రేమికగా ఎలా మలచుకున్నారో, మరికొందరి మహిళలను ఎలా భాగస్వాములను చేస్తున్నారో వివరించారు.
‘‘మా ఊరిలో పన్నెండేళ్లుగా ఉంటున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వాడకంలో ఉన్న వస్తువులకు ప్రత్యామ్నాయ, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. చాలా ఆలోచనలు చేశాక మహిళల రుతుక్రమ సమయంలో వాడే ప్యాడ్స్‌కు సంబంధించిన పరిష్కారం కనుక్కోవాలనుకున్నాను.
అందులో భాగంగా 2020లో ‘కొన్నై’ పేరుతో మా ఉత్పత్తులన్నీ గ్రామంలోని మహిళలు, యువతతో కలిసి చిన్న చిన్న సమూహాలుగా ఏర్పాటు చేసి, వారితో తయారుచేస్తున్నాను. మహిళలు, చంటిపిల్లలకు ఉపయోగపడే రీ యూజబుల్ ఉత్పత్తుల తయారీకి కొంతమందిని గ్రూప్‌గా చేసి వారి ఇళ్ల నుంచే, సౌకర్యవంతమైన సమయంలో తయారుచేసిచ్చేలా ప్రణాళిక చేశాను. చదువుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇది ఒక పార్ట్‌టైమ్ ఉపాధి లాగా కూడా ఉపయోగపడుతుంది.
వాడకం సులువు..
మృదువుగా, మన్నికగా ఉండటమే కాకుండా వాడిన తర్వాత రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టి, ఎండలో ఆరవేయవచ్చు. తిరిగి వీటిని వాడుకోవచ్చు. వెదురు కాటన్‌ను వాటర్‌ఫ్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో జత చేసి వీటిని తయారుచేస్తుంటాం. ఇవి సురక్షితంగానూ, అనుకూలంగానూ ఉంటాయి. తిరిగి ఉపయోగించడం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్నీ నివారించవచ్చు.
డిస్పోజబుల్ ప్యాడ్‌లలో రసాయనాల కారణంగా చర్మానికి హాని కూడా కలిగిస్తాయి. మహిళలకు రీ యూజబుల్ క్లాత్ ప్యాడ్స్ మాత్రమే కాదు పిల్లలకు డైపర్లు, మ్యాట్లు, వైప్స్.. అన్నీ ఎకో ఫ్రెండ్లీవే తయారుచేస్తున్నాం. ఇవి మృదువుగా ఉంటాయి. కాబట్టి చర్మానికి ఎలాంటి హానీ కలిగించవు. స్మాల్, మీడియమ్.. సైజులను బట్టి డిజైన్ల బట్టి ధరలు ఉన్నాయి.
ఆర్డర్లను బట్టి ఒక్కొరికి రూ.5,000 వరకు ఆదాయం లభిస్తుంది. ఇందులో ఇప్పుడు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. నేను ఆదాయం, రాబడి గురించి ఆలోచించడం లేదు. మునుముందు అందరూ పర్యావరణహితంగా మారాల్సిందే. అందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను.
సొంత ఊరికి...
మేం పన్నెండేళ్లు అమెరికాలో ఉన్నాం. నేనూ, మా వారు దేవ్ అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేశాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒక దశలో మాకు అక్కడ ఉండాలనిపించలేదు. మొత్తం కుటుంబంతో సొంత ఊరికి వచ్చేశాం. ఇక్కడే ఊళ్లో ఏడెకరాల భూమి కొనుగోలు చేశాం. అందులో ఎక్కువ శాతం రాగులు పండిస్తాం. ఆ పని అంతా మా వారు చూసుకుంటారు.
ఎవరికి నచ్చిన పని వాళ్లు...
అమెరికన్ సంస్కృతిలో పిల్లల మీద చదువుల ఒత్తిడి ఉండదు. పిల్లలకు ఏది ఇష్టమో, ఏ కళలో నైపుణ్యం సాధించాలనుకుంటారో దానిని వారే కనిపెట్టేలా, నైపుణ్యాలు సాధించేలా చూస్తారు. మేం కూడా పిల్లలను స్కూళ్లను, కాలేజీకి పంపించలేదు. హోమ్ స్కూలింగ్ అని మాకు గ్రూప్ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో పిల్లలకు నచ్చినవి చదువుకుంటారు.
తప్పనిసరిగా చదవాలనే నిబంధన పెడితే, మనసుకు ఇష్టంలేని దానిమీద వారెప్పటికీ ప్రావీణ్యులు కాలేరు. ఇవన్నీ ఆలోచించాం. పిల్లలకు ఏది ఇష్టమో అదే చేయమన్నాం. ఇద్దరూ సంగీతం నేర్చుకున్నారు. ఇరవై ఏళ్ల మా అబ్బాయికి శాస్త్రీయ సంగీతం అంటే ఎక్కువ ఇష్టం. పద్దె నిమిదేళ్ల మా అమ్మాయి ఉడెన్ ఫర్నీచర్‌లో తన నైపుణ్యాలను చూపుతుంటుంది. నేను పర్యావరణ హితంగా ఉండే పనులు చేయాలనే ఆలోచనతో రీ యూజబుల్ న్యాపికిన్స్ పై దృష్టి పెట్టాను.
మా విధానాలు మా ఇతర కుటుంబాల వారికి నచ్చుతుందని నేను అనుకోను. ఎందుకంటే, ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరుగులు పెట్టేవారే. తమకేది నచ్చుతుందో, ఏం చేయగలమో, ఎందులో సంతృప్తి లభిస్తుందో దానిని కనుక్కోలేరు. ప్రకృతి నీడన, నచ్చిన పనుల్లో భాగస్వాములం అవుతూ పర్యావరణహితగా జీవిస్తున్నాం. నా ఈ ఆలోచనను విరివిగా మార్కెట్లోకి తీసుకెళ్లడానికి ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్ ద్వారా రకరకాల క్రాఫ్ట్స్ మేళాలో పెడుతూ సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళుతున్నాను’ అని వివరించారు హేమ.
– నిర్మలారెడ్డి