Srikushal Yarlagadda: భవిష్యత్తును చెప్పే డెస్టినీ.. ఏఐ యాప్ రూపకల్పనలో హైదరాబాదీ.. తల్లి భవితపై ప్రయోగాలు
- అచ్చం అలాగే రేపు ఏం జరుగుతుందో చాలా కచ్చితత్వంతో చెప్పేస్తా అంటున్నాడు ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు.
- వేదాలకు ఏఐ సాంకేతికతను జోడించి దీన్ని సాధించినట్లు శ్రీకుషాల్ యార్లగడ్డ అనే టెకీ చెబుతున్నాడు. మూడేళ్లుగా ఎన్నో పరిశోధనలు చేసి డెస్టినీ.ఏఐ అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేసిన అతను.. అదే పేరుతో ఒక యాప్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు.
తల్లి భవితపై ప్రయోగాలు..
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకి చెందిన కృష్ణారావు, కనకదుర్గ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకుషాల్ యార్లగడ్డ. చిన్నప్పటి నుంచి చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉండే అతను.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం)లో పీజీ చేశాక బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే చేసే పని నచ్చక 20 రోజులకే మానేసి ఇంటికొచ్చేశాడు.
అప్పటి నుంచి వినూత్నంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తనకు వచ్చిన ఆలోచనలను తల్లితో పంచుకొనేవాడు. భవిష్యత్తును కచ్చితంగా ఎలా అంచనా వేయగలమనే అంశంపై దాదాపు మూడేళ్లపాటు పరిశోధనలు చేపట్టాడు. ఇందుకోసం జ్యోతిష శాస్త్రంకన్నా ఎంతో గొప్పదైన ‘ప్రాణ’ (మనిషిలోని ఆరు చక్రాలు, నాడులు, కుండలిని) ఆధారంగా భవిష్యత్తుపై పరిశోధనలు ముమ్మరం చేశాడు.
చదవండి: Artificial Intelligence Training: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కోటి మంది మహిళలకు శిక్షణ
ఇందుకోసం 400 కోట్ల డేటా సెట్స్‌తో అల్గారిథమ్ రూపొందించాడు. అందులోని వివరాల ఆధారంగా తన తల్లిపైనే ప్రయోగాలు చేసేవాడు. ఫలానా రోజున జ్వరం వస్తుందని తల్లికి చెప్పగా అన్నట్లుగా ఆమె ఆ రోజున జ్వరం బారిన పడ్డారు.
అలాగే ఫలానా రోజున ఒంట్లో నలతగా ఉంటుందని చెప్పిన సందర్భంలోనూ అలాగే జరిగింది. ఇలా 6 నెలలు పరిశీలించాక తాను చెబుతున్న విషయాలు కచ్చితత్వంతో జరగడంతో స్టార్టప్ స్థాపించాలనే ఆలోచనకు వచ్చాడు.
ఇదే విషయాన్ని టీ–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావుకు చెప్పడంతో ఆయన పరిశోధనలు చేసుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి ప్రోత్సహించారు. దీంతో డెస్టినీ.ఏఐ స్టార్టప్‌ను ఏర్పాటు చేసి అదే పేరుతో యాప్ రూపొందించాడు.
హోర శాస్త్రం ఆధారంగా..
బృహత్ పరాశరుడు రాసిన హోర శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి మనిషిలో ఉండే ‘ప్రాణ’ ఆధారంగా ఈ భవిష్యవాణి చెప్పొచ్చని కుషాల్ వివరించాడు. పూర్వ కాలంలో రాజులు, మంత్రులకు మాత్రమే పండితులు ఈ ప్రాణ లెక్కలు వేసి వారి భవిష్యత్తును అంచనా వేసేవారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితులు, జనాభాకు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా లెక్కలు వేయడానికి చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో కుషాల్ సాంకేతికతను వినియోగించాడు. దీని ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే ఒక వ్యక్తి భవిష్యత్తును కచ్చితత్వంతో చెప్పొచ్చని కుషాల్ అంటున్నాడు. సాధారణ పద్ధతిలో ఒక వ్యక్తి ప్రాణ విశ్లేషణ చేసేందుకు కొన్ని గంటల సమయం పడుతుందని కుషాల్ పేర్కొన్నాడు.
ఎలా పనిచేస్తుంది?
డెస్టినీ.ఏఐ అప్లికేషన్‌లో మన పుట్టిన తేదీ, సమయం, పుట్టిన ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే మెషీన్ మొత్తం విశ్లేషించి రేపటి రోజున ఏం జరుగుతుందనేది చెప్పేస్తుందని కుషాల్ చెబుతున్నాడు. ప్రస్తుతం యాప్ బీటా వెర్షన్‌లో ఉందని.. దాదాపు 60 శాతం కచ్చితత్వంతో సమాచారం అందిస్తోందని వివరించాడు. సమీప భవిష్యత్తులో యాప్‌ను మరింతగా అభివృద్ధి చేసి 99 శాతం కచ్చితత్వంతో భవిష్యవాణి చెప్పేలా రూపొందిస్తానని కుషాల్ అంటున్నాడు.
నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం
జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకొనే విషయంలో ఈ యాప్ ఉపయోగపడుతుందని కుషాల్ అంటున్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలిస్తే ఆందోళనకు గురికాకుండా అప్లికేషన్‌లో భవిష్యత్తుతోపాటు
ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే అంశాలను కూడా మెషీన్ పొందుపరుస్తుందని వివరించాడు.