DSC Exams: DSCకి వేళాయె!
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలపై కసరత్తు జరుగుతోంది. స్కూళ్లల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవలే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను ప్రభుత్వ కోరింది. అన్ని జిల్లాల్లోనూ ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టుల పోస్టుల్లో ఉన్న ఖాళీల వివరాలు, రోస్టర్ వివరాలను ఈనెల 20లోగా పంపాలంటూ ఆర్జేడీలు, డీఈఓలకు విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు అందాయి.
మూడు రోజులుగా కుస్తీ
జిల్లాలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లలో ఖాళీలపై మూడు రోజులుగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. డీఈఓ నాగరాజు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం కుస్తీ చేస్తోంది. ఎస్జీటీల ఖాళీలను మండలాల విద్యాశాఖ అధికారులు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను డెప్యూటీ డీఈఓలతో తెప్పించుకుంటున్నారు. ఈనెల 16 తేదీ గడువుగా పెట్టుకుని ఖాళీలను గుర్తిస్తున్నారు. ఖాళీల వివరాల కోసం డెప్యూటీ డీఈఓలు, ఎంఈఓలతో డీఈఓ వెబెక్స్ ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఖాళీల వివరాలు పంపాలని సూచించారు. ఇప్పటికే ఖాళీలపై ఒక అంచనాకు వచ్చారు. ఇంగ్లీష్, హిందీ, పీడీ, తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నట్లు తెలిసింది.
కసరత్తు చేస్తున్నాం
ఎస్జీటీ కేడర్‌తో పాటు స్కూల్ అసిస్టెంట్లు అన్ని సబ్జెక్టుల్లోనూ ఖాళీలను గుర్తిస్తున్నాం. ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. కసరత్తు జరుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి పూర్తిచేసి రాష్ట్ర అధికారులకు పంపుతాం.