Skip to main content

Inspirational Story: ఆపత్కాలంలో వీరి జీవితాల్లో అక్ష‌ర‌కిరణం ఈమె ..

పిల్లలలోకం గురించి మహాకవి శ్రీశ్రీ మురిపెంగా ఇలా అంటారు... ‘దిక్కు దిక్కులా దివ్యగీతాలు మీ కోసం వినిపిస్తాయి’ ‘ఎప్పటిలాగే గాలులు వీచును. పువ్వులు పూచును’..
భగవతి
భగవతి

దిక్కు దిక్కులా దివ్యగీతాలు ఏమిటోగానీ ‘భయగీతాలు’ వినిపించే కాలం ఒకటి వచ్చేసింది. గాలులు భయపెట్టే గడ్డుకాలం ఒకటి వచ్చేసింది. అన్ని రంగాలలాగే కోవిడ్‌ ప్రభావం విద్యారంగంపై పడింది. కోవిడ్‌ వివిధ రూపాల్లో విజృంభించినప్పుడల్లా బడులు మూతపడుతున్నాయి.

ఎన్నో గ్రామాల్లో..ఆన్‌లైన్‌ విద్య గాలిలోనే..
‘అయితే ఏమిటీ, ఆన్‌లైన్‌ క్లాసులు ఉన్నాయి కదా, అవే బెస్ట్‌ కదా!’ అనే ప్రత్యామ్నాయ ఆలోచన ఎన్నో గ్రామాల్లో వినిపించడం లేదు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో పరాజగూడ అనే గిరిజన గ్రామం ఉంది. కోవిడ్‌ మొదటి దశలో ఆ గ్రామంలో ఉన్న ఒకే ఒక ప్రైమరీస్కూల్‌ మూతపడింది. ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. అయితే ఆ ఊళ్లో స్మార్ట్‌ఫోన్‌ల సంగతి సరే, మామూలు ఫోన్లు కూడా లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఆన్‌లైన్‌ విద్య గాలిలోనే ఆగిపోయింది.

తేనెల తేటల మాటలతో..
మామూలు పరిస్థితులు నెలకొన్నాక బడి మళ్లీ తెరుచుకుంది. సగం మంది పిల్లలు మాత్రమే వచ్చారు. రెండో వేవ్‌తో ఆ ఏకైక బడి మళ్లీ మూత పడింది. ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. అప్పుడూ అంతే...ఆన్‌లైన్‌ చదువును అందుకునే సౌకర్యాలు లేక  పిల్లలు బడికి దూరం అయ్యారు. చాలామంది పిల్లలు ఇంటిపనులలో సహాయం చేయడంలోనో, గొర్రెలు మేపే పనుల్లోనో సెటిలయ్యారు. ఇలా అయితే వారు శాశ్వతంగా చదువుకు దూరం అవుతారని గ్రహించి రంగంలోకి దిగింది జమున పోడైమి. ఇంటింటికి వెళ్లి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడింది. కొందరు అంగీకరించి సంతోషించారు. కొందరు రకరకాల కారణాలతో ససేమిరా అన్నారు. తన మాటలతో అలాంటి వారిలో మార్పు తీసుకువచ్చింది. జమున ఇల్లు బడిగా మారింది. ఒకటి నుంచి ఆరోతరగతి పిల్లలకు రోజూ పాఠాలు చెప్పడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు కూడా చెప్పడం మొదలుపెట్టింది.

తన ఊళ్లోనే కాదు చుట్టుపక్కల ఊళ్లకు కూడా..

Education


జమునను చూసి దుమెర్‌బహల్‌ గ్రామానికి చెందిన నుర్యా పటేల్‌ ప్రభావితమైంది. జమున గ్రామంలో ఉన్న పరిస్థితులే తమ గ్రామంలోనూ ఉన్నాయి. పిల్లలను సమీకరించి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది నుర్యా పటేల్‌. ఆమెకు గ్రామంలోని ‘నాగరిక్‌ వికాస్‌ సంఘటన్‌’ పూర్తి సహకారం అందించింది. చదువు చెప్పడం మాత్రమే కాకుండా ‘నాగరిక్‌ వికాస్‌’తో కలిసి ఊళ్లో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది నుర్యా పటేల్‌. మారుమూల గ్రామం కలియగూడలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించాలనుకుంటున్నప్పటికీ అక్కడ చదివించే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో పద్దెనిమిది సంవత్సరాల భగవతి వారికి ఆశాకిరణంగా కనిపించింది. సమాజసేవ అంటే ఇష్టపడే భగవతి తన ఊళ్లోనే కాదు చుట్టుపక్కల ఊళ్లకు కూడా వెళ్లి చదువు చెబుతోంది.

నేను పడ్డ కష్టాలు పిల్లలు పడవద్దని..
‘చదువుకోవడానికి నేను చాలా ఇబ్బందులు పడ్డాను. కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. నేను పడ్డ కష్టాలు పిల్లలు పడవద్దని నిర్ణయించుకున్నాను. వారికి పాఠాలు చెప్పడం నాకు ఇష్టమైన పని’ అంటున్న భగవతి బాటలో నడిచి, పిల్లలకు చదువు చెప్పడానికి చాలామంది యువతీ, యువకులు ముందుకు వస్తున్నారు. 

ఆ పుణ్యం ఈమెదే..
‘చదువు చెప్పడం అంటే చదువు మరోసారి నేర్చుకోవడం కూడా!’ అనేది వారి భావన. ‘భగవతిలాంటి వాళ్లు ఊరికి ఇద్దరు ఉన్నా ఊరు ఎంతో బాగుపడుతుంది. చదువు మానేసిన పిల్లలు మళ్లీ బాగా చదువుకుంటున్నారంటే ఆ పుణ్యం భగవతిదే’ అంటుంది కలియగూడకు చెందిన సుమిత్ర అనే గృహిణి.

Published date : 20 Jan 2022 03:49PM

Photo Stories