Skip to main content

SV University: ఎస్వీయూ అభివృద్ధే అజెండా

sv university development

తిరుపతి సిటీ : ఎస్వీ యూనివర్సిటీ అభివృద్ధే అజెండాగా నూతనంగా ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) తొలి అడుగు వేయనుంది. వేతనాల సవరణ, పరీక్ష విధానంలో మార్పులు, ఫలితాల వెల్లడిలో జాప్యాన్ని అధిగమించడంతోపాటు పరీక్ష కేంద్రాలు, మూల్యాంకన కేంద్రాల పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు వర్సిటీలో సమూల మార్పులపై దృష్టి సారించింది. అందులో భాగంగా త్వరలో నిర్వహించనున్న సమావేశంలో పలు అంశాలపై వర్సిటీ అధికారులతో చర్చించనుంది. ఈసీ అంటే కేవలం నామమాత్రపు కమిటీ కాదని నిరూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈసీ సభ్యులుగా నియమించిన 9 మంది విద్యారంగంలో సుమారు 30 నుంచి 40ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉండటంతో వర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించారని పలువురు సిబ్బంది చర్చించుకుంటున్నారు.

ప్రధాన అంశాలు ఇవే..

  • డిసెంబర్‌ రెండో వారంలో నిర్వహించనున్న డిగ్రీ ఒకటి, మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలను ఒకే దశలో చేపట్టడం.
  • మదనపల్లె, పీలేరు, తిరుపతి, పలమనేరులో పరీక్ష కేంద్రాల ఏర్పాటు.
  • విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులే పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ప్రామాణికంగా తీసుకోవడం.
  • పరీక్ష కేంద్రాల నిరంతర పర్యవేక్షణకు హైపవర్‌ కమిటీ.
  • ప్రశ్నపత్రాల తయారీ విధానంలో మోడరేషన్‌ పద్ధతిని నిలిపివేయడం.
  • సిలబస్‌, మోడల్‌ ప్రశ్నపత్రాలను అనుసరించి నిపుణులైన అధ్యాపకులతో సెమిస్టర్‌ ప్రశ్న పత్రాల తయారీ.
  • పరీక్ష ఫలితాల జాప్యాన్ని నివారించేందుకు మూల్యాంకన కేంద్రాలు పెంచడం.
  • మూల్యాంకనం ముగిసిన 20రోజుల్లోపు ఫలితాల విడుదలకు చర్యలు. ఇందుకోసం ప్రత్యేక కమిటీకి సిఫార్సు.
  • బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ను నియమించి బీబీఏ, బీసీఏ, బీకామ్‌ (కంప్యూటర్స్‌), బీఎస్సీ (కంప్యూటర్స్‌) సిలబస్‌ తయారు చేసేందుకు చర్యలు.
  • వర్సిటీ అకడమిక్‌ కన్సల్టెంట్లతో సమానంగా గెస్ట్‌ ఫ్యాకల్టీలకు వేతనాల మంజూరుకు సూచన.
  • ఎన్‌ఎమ్‌ఆర్‌ ఉద్యోగుల అర్హతే ప్రామాణికంగా టైమ్‌స్కేల్‌ మంజూరుకు చర్యలు.

చదవండి: JNTU Anantapur: జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ ప్రశాంతి పరిశోధనకు పేటెంట్‌

ఈ మేరకు ఎస్వీయూలో త్వరలో నిర్వహించనున్న సమావేశంలో వర్సిటీ అధికారులతో ఈసీ సభ్యులు సీకామ్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ సురేంద్రనాథ్‌రెడ్డి, మాజీ రిజిస్ట్రార్‌ భూమన సుగుణారెడ్డి, వేద వ్యాస విద్యా సంస్థల అధినేత సి.నారాయణ బాబు, ప్రొఫెసర్‌ కె.సుమ కిరణ్‌, సామాజిక వేత్త వి.జ్యోతి, ప్రొఫెసర్‌ జి.పద్మనాభం, డాక్టర్‌ ఏ.మోహిద్దీన్‌బాషా, ప్రొఫెసర్‌ కె.మంజుల, అధ్యాపకులు ఎం.సంధ్యారాణి చర్చించనున్నారు.

Published date : 15 Nov 2023 05:10PM

Photo Stories