Skip to main content

Triple IT students: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు

భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇందుకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం క్యాంపస్‌లో విలేకరులతో మాట్లాడారు.
Special training for Triple IT students   Special training provided to Basara Triple IT students, says VC Professor Venkataramana

బాసర ట్రిపుల్‌ఐటీకి రూ.103 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం రూ.33 కోట్లు ఇచ్చిందని తెలిపారు. వేతనాలతోపాటు ఇతర అవసరాలకు వీటిని వినియోగిస్తామన్నారు. ఇటీవలే సిగరెట్‌ కాలుస్తూ పట్టుబడ్డ విద్యార్థులను ఒక సెమిస్టర్‌ సస్పెండ్‌ చేశామని తెలిపారు. మెస్‌లో పనిచేసే వ్యక్తి సిగరెట్లు తీసుకువచ్చి విద్యార్థులకు ఇచ్చినట్లు తేలడంతో అతడిపైనా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. నార్కోటిక్‌ స్టేట్‌బ్యూరో ఈ విషయంపై సుమోటోగా కేసు నమోదుచేసి విచారణ చేస్తోందన్నారు. మార్చి 31వ తేదీ వరకు బాసర ట్రిపుల్‌ఐటీ ఆస్తుల విలువ చూపించాలని మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశించిందని వెల్లడించారు. క్యాంపస్‌ ఆఫ్‌ కార్పొరేట్‌లో భాగంగా 850 మంది విద్యార్థులకుగాను 350 మందికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 55 నుంచి 60 కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ నిర్వహించాయని తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు రూ.5లక్షల నుంచి రూ.17 లక్షల ప్యాకేజీ చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఎడ్యుకేషన్‌ కేటగిరిలో ట్రిపుల్‌ఐటీకి హరితహారం, మెగాప్లాంటేషన్‌లో మొదటి బహుమతి వచ్చిందని తెలిపారు. బాసర ట్రిపుల్‌ఐటీకి అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీలో మెంబర్‌షిప్‌ దక్కిందని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ముంబై ఆధ్వర్యంలో ఫిమెన్స్‌ అనే సంస్థ 24 మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించనున్నట్లు తెలిపారు. ఇక్కడ చదివే నిరుపేద విద్యార్థులపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు మానసిక ఒత్తిడిని తగ్గించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. క్రీడల్లోనూ విద్యార్థులను ప్రొత్సహిస్తున్నామని చెప్పారు. ట్రిపుల్‌ఐటీని అగ్రగామిగా నిలిపేందుకు ఇక్కడి ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది అంతా పనిచేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో బాసర ట్రిపుల్‌ఐటీ అన్ని రంగాల్లోనూ మేటిగా నిలుస్తుందని వివరించారు.

Published date : 04 Mar 2024 11:39AM

Photo Stories