Skip to main content

Students Suicides: హాస్టళ్లు... జైళ్లలాగా మారిపోతున్నాయి..పేరేంట్స్‌గా మీరు త‌ప్పులు చేయ‌కండి

ఉజ్వల భవిష్యత్తులకు దారితీయాల్సిన చదువులు... చావుకు కారణమవుతున్నాయని, తల్లిదండ్రుల ఆలోచన ధోరణిలో మార్పువస్తేనే విద్యార్థుల బలవన్మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రముఖ సైకాలజిస్ట్‌ విశేష్‌ తెలిపారు. ఒక నెల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు హాస్టళ్లలో ఉరి వేసుకుని తనువుచాలించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
Students Suicide

ఈ సందర్భంగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు చెబుతూ.. వాటికి అడ్డుకట్ట వేయడానికి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
భవిష్యత్తుపై బెంగ ఎందుకు..?
విద్యార్థుల ఆత్మహత్యలకు కార్పొరేట్‌ కళాశాలలే కారణం. కేవలం మార్కులు, ర్యాంకులు, సీట్ల మీదే కాలేజీలు ఫోకస్‌ పెడుతున్నాయి. ఐఐటీ జేఈఈ, నీట్, ఎంసెట్‌.. ఇలా వీటిల్లో ర్యాంకులు వస్తేనే వారిని విద్యార్థులుగా చూసే కోణం మారాలి. చదువుపై శ్రద్ధలేనప్పుడు ఎంత ఒత్తిడి చేసినా ప్రయోజనం ఉండదు. నలుగురితో ఆడుతూ, పాడుతూ చదువుకునే వయసులో.. వారిని తీసుకెళ్లి నాలుగు గోడల మధ్య బంధిస్తున్నారు. చాలీచాలని హాస్టల్‌ గదులల్లో వారు మగ్గిపోతున్నారు.

ఇవీ చ‌ద‌వండి: పిల్లలపై మీ కోరికలు రుద్దకండి... చేతులారా ఎందుకు చంపుకుంటారు

కేవలం పరీక్షల్లో మార్కులు రానంత మాత్రాన భవిష్యత్‌ అధ్వానంగా ఉంటుందన్న భ్రమ విద్యార్థుల తల్లిదండ్రుల మెదళ్లనుంచి తొలగించాలి. మార్కులు తక్కువగా వచ్చిన వెంటనే విద్యార్థులు డీలా పడుతున్నారు. తాము చదవలేమోనన్న నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. అంతిమంగా తమ భవిష్యత్‌ నాశనం అవుతోందని బాధపడుతూ తనువు చాలిస్తున్నారు. 
బాధలు అర్థం చేసుకునే మనసులేకే...
పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చిన వెంటనే లెక్చరర్స్‌ వారిని తక్కువ చేసి చూస్తున్నారు. తోటి విద్యార్థులతో పోల్చుతూ హేళన చేసి మాట్లాడుతున్నారు. ఇలా మా సార్లు చేస్తున్నారు.. అని వారి బాధ తల్లిదండ్రులతో చెప్పుకుంటే వారు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. లక్షల లక్షలు పెట్టి చదివిస్తున్నాం.. మార్కులు తక్కువ వస్తే సారోళ్లు తిట్టకుండా ఎలా ఉంటారని .. తల్లిదండ్రులే అంటుండడంతో విద్యార్థులు మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. తమ బాధను అర్థం చేసుకునే వారే లేరు అని వారిలో వారే బాధ పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు.

ఇవీ చ‌ద‌వండి: దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలు.. మరణమే శరణ్యమా..?
ఎవరూ ఓదార్చేవారు లేక....
మనసుకు బాధగా ఉన్నప్పుడు ఎవరైనా కాస్త ఓదార్పును కోరుకుంటారు. విద్యార్థులు ఇంట్లో ఉంటే దాన్ని అర్థం చేసుకుని తల్లిదండ్రులు అడిగే అవకాశం ఉంది. కానీ, వీరు హాస్టళ్లలో ఉండడంతో మూడ్‌ ఆఫ్‌ అయినా తోటి విద్యార్థులు పట్టించుకోరు. పైగా ర్యాగింగ్‌ చేస్తారు. ఇలాంటి సంఘటనలు మనసులో బలంగా నాటుకుపోవడంతో.. ఒకానొక సమయంలో ఈ జీవితం ఇక చాలు అని విద్యార్థులు ఫిక్స్‌అవుతున్నారు. ఆ తొందరపాటు నిర్ణయంతో జీవితాన్ని చాలిస్తున్నారు.

vishesh


తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలి
చిన్ననాటి నుంచి మీ పిల్లలు ఎలా చదువుతారో మీకు ఓ ఐడియా ఉంటుంది. ఇంటి పక్కన ఉన్న వాళ్ల పిల్లలతో పోల్చి తక్కువ చేయడం పూర్తిగా మానుకోవాలి. మార్కులు తక్కువ వస్తే దండించడం బదులు.. ఎందుకు తక్కువగా వచ్చాయో వారిని అడిగి కారణం తెలుసుకోండి. ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి ఎలా చదవాలో కూర్చొబెట్టుకుని చెప్పండి. అంతేగానీ, ఎప్పుడూ కంపేర్‌ చేయకండి.
భరోసా ఇవ్వండి చాలు....
విద్యార్థులకు మార్కులు ముఖ్యమే. అంతేకానీ, మార్కులే ముఖ్యం కాదు. నాలెడ్జ్‌ను షేర్‌ చేయండి. తెలివితేటలు ఇంప్రూవ్‌ ఐతే చాలు. వారి గమ్యానికి ఎప్పుడైనా చేరుకుంటారు. మీరు ఇవ్వాల్సిందల్లా కాస్త భరోసానే. మీకు మేమున్నాం రా.. అన్న ఒక్క మాట ఇస్తే చాలు... మీ పిల్లలు మిమ్మల్ని విడిచిపోవడానికి అస్సలు ఇష్టపడరు. విద్యార్థులను భయపెట్టేబదులు.. ప్రేమించండి. ప్రశాంతంగా చదువుకోనిస్తే మార్కులు అవే వస్తాయి. 
కాలేజీల యాజమాన్యాల్లోనూ మార్పు రావాలి
కేవలం ర్యాంకులు, మార్కులు... ఇవే కార్పొరేట్‌ కాలేజీలకు కావాల్సింది. ఈ మార్కులు, ర్యాంకులను డప్పుకొట్టుకుని.. ఇంకో వంద అడ్మిషన్లు ఎక్కువ తెచ్చుకుందామనే వారికి ఆశ. మార్కులు తక్కువ రాగానే, వారిని విభజించకండి. టాపర్స్‌తోనే ఉండనివ్వండి. కేవలం మార్కుల ఆధారంగా ఒక సెక్షన్‌ నుంచి వేరే సెక్షన్‌కు మార్చకండి. అలానే ప్రతీ కాలేజీలో ఒక సైకాలజిస్ట్‌ ఉండాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ, అది ఎక్కడా ఇంప్లిమెంట్‌ కావట్లేదు. విద్యార్థులపై ఒత్తిడి పెంచి వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించకండి.

Published date : 13 Feb 2023 06:51PM

Photo Stories