Scout and Guide in School: అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్
రాయచోటి అర్బన్ : ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఏపీ మోడల్‌స్కూల్‌లతోపాటు ప్రైవేటు, ఎయిడెడ్, కస్తూరిబా, ట్రైబల్‌వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ఏర్పాటు చేయాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ జిల్లా కార్యదర్శి ఎం.నరసింహారెడ్డి అన్నారు. నవంబర్ 17 శుక్రవారం ఉదయం స్థానిక డైట్ విద్యా కేంద్రంలో ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉన్నత పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్‌ను తప్పనిసరి చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డీఈఓలకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్లలో చేరిన విద్యార్థులకు రెండేళ్లు శిక్షణ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి గవర్నర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ సర్టిఫికెట్లు గల విద్యార్థులకు విద్యా, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అబ్జర్వర్ డేవిడ్, ట్రైనింగ్ ఇన్‌చార్జి రెడ్డెయ్య, ఎంఈఓలు బాలాజి, ఆంజనేయులు నాయుడు, రిసోర్స్‌పర్సన్‌లు మధుర వాణి, ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మికర్, మాస్టర్ ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
చదవండి: AP University Jobs: 3,220 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ప్రిపరేషన్ ఇలా