Sri Padmavati University: శ్రీపద్మావతి యూనివర్సిటీలో ప్రాంతీయ సదస్సు
తిరుపతి అర్బన్: పారదర్శకంగా శాసీ్త్రయ పద్ధతిలో కులగణన నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలోని ప్రియదర్శిని ఆడిటోరియంలో కులగణన ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన కుల సంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి చెన్నయ్య, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు చేపట్టారు. సభాధ్యక్షుడిగా కలెక్టర్ వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగితోపాటు వలంటీర్లు కులగణనలో పాల్గొంటారని వెల్లడించారు. ఇంటి సభ్యుల బయోమెట్రిక్‌తోపాటు, సచివాలయ బయో మెట్రిక్ ఉంటేనే యాప్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. వంద శాతం పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తొమ్మిది దశాబ్దాల తర్వాత కుల గణన చేపడుతున్నట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కులాలు మినహా మిగిలిన వారిని జనరల్ కేటగిరీ కింద లెక్కించనున్నట్లు వివరించారు. కులాల వారీగా జనాభా లెక్కించడం వల్ల ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఉపయోగపడతుందని వివరించారు. కుల సంఘాలతోపాటు రాజకీయపార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంఘాల నేతలు సంపూర్ణంగా సహకరించాలని ఆయన కోరారు.
చదవండి: IOCL: నిరుద్యోగులకు ఐఓసీఎల్ సంస్థ ద్వారా శిక్షణ
చారిత్రాత్మకం
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ తొమ్మిది దశాద్దాల తర్వాత కులగణన చేపట్టడం చారిత్రాత్మకమైన అంశమన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి సరైన న్యాయం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులగణన నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా రాష్ట్రంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, రాజకీయ ఆర్థిక సమానత్వం కల్పించిన ఘనత ము ఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ సమాజంలో అంతరాలు తొలగాలంటే తప్పనిసరిగా కులగణన అవసరమన్నారు. చిత్తూరు మేయర్ అముద మాట్లాడుతూ బడుగుల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తున్నారని తెలిపారు. సదస్సులో తిరుపతి డెప్యూటీ మేయర్ ముద్రనారాయణ, వివిధ జిల్లా ల కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు లక్ష్మయ్య, పుల్లయ్య, సురేంద్రనాథ్, కుమార్‌రాజా, శాంతి, బాబు, షేక్ సిరాజ్‌బాషా, శ్రీరాములు, వేమ నారాయణ, అక్కులప్పనాయక్ తదితరులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. మరికొందరు తమ అభిప్రాయాలను వినతిపత్రం రూపంలో కలెక్టర్‌కు అందించారు. ఈ సదస్సులో తిరుపతి కుల గణన అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే.బాలాజీ, శ్రీపద్మావతి యూనివర్సిటీ వీసీ డీ. భారతి, కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషగిరి, ఎండీ కృష్ణమూర్తి, చిత్తూరు డీఆర్వో రాజశేఖర్, చిత్తూరు జిల్లా కుల గణన అధికారి జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు శాంతి, వనిత, వరలక్ష్మి, సుమతి, తిలక్‌బాబు, వెంకటనారాయణ, భూపేష్ గోపీనాథ్, పురుషోత్తం, ఎల్లప్ప, రమణ, ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి, డీఎల్‌డీఓ ఆదిశేషారెడ్డి పాల్గొన్నారు.