Skip to main content

Ramaa Pathmanaban: దివ్యాంగులకు పరీక్షలు రాసి పెడుతుంది..కోయంబత్తూరులో ఆమె తెలియని వారుండరు

Ramaa Pathmanaban  Rama Padmanabhan providing exam support to students with disabilities in Coimbatore

పరీక్షల సీజన్‌ వస్తే రమా పద్మనాభన్‌ ఇంటి వ్యవహారాలను పెద్దగా పట్టించుకోదు. పెళ్లిళ్లు, ప్రయాణాలు అసలే ఉండవు. ఆమె తనకు వచ్చే కాల్స్‌ను అటెండ్‌ చేసే పనిలో ఉంటుంది. ‘అక్కా.. ఈ ఎగ్జామ్‌ రాయాలి’ ‘ఆంటీ... ఈ డేట్‌న ఎంట్రన్స్‌ ఉంది’ ఇలా దివ్యాంగులు ఆమెకు కాల్స్‌ చేస్తుంటారు. వారి కోసం ఆమె పరీక్ష హాల్‌కు వెళ్లి వారి ఆన్సర్స్‌ను రాసి పెడుతుంటుంది. ‘ఇది గొప్ప తృప్తినిచ్చే సేవ’ అంటోందామె.

చదువుకునే రోజుల్లో ఎవరైనా పరీక్షలు రాయవచ్చు. చదువు అయిపోయాక ఏవైనా కోర్సులు సరదాగా చదివితే పరీక్షలు రాయవచ్చు. కాని రమా పద్మనాభన్‌ అలా కాదు. ఆమె ప్రతి ఆరు నెలలకు విద్యార్థులకు సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌ జరిగినప్పుడల్లా 50 పరీక్షలు రాస్తుంది. అంటే రాసి పెడుతుంది. గత పదకొండేళ్లుగా ఆమె అలా చేస్తూనే ఉంది. దివ్యాంగులకు పరీక్షలు రాసి పెట్టే స్క్రయిబ్‌గా ఆమెకు కోయంబత్తూరులో ఉండే పేరు అలాంటిది.

గృహిణిగా ఉంటూ...
కోయంబత్తూరుకు చెందిన రమా పద్మనాభన్‌ సైకాలజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ‘గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌’లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కూడా చదివింది. భర్త ఫైనాన్షియల్‌ సెక్టార్‌లో పని చేస్తాడు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు.  గృహిణిగా పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతున్న రమా పద్మనాభన్‌ జీవితం 2013లో మారింది. ‘ఆ రోజు నేను యోగా క్లాసుకు బయలుదేరాను. నా స్నేహితురాలి నుంచి ‘ఒక అంధ విద్యార్థికి పరీక్ష రాసి పెడతావా?’ అనే విన్నపం వచ్చింది. అలా రాయగలనా అనుకున్నాను. పరీక్ష కేంద్రం దగ్గరే కనుక ట్రై చేద్దామనిపించింది. వెళ్లి రాసి పెట్టాను.

పరీక్ష ముగిశాక ఆ అంధ విద్యార్థి ముఖంలో కనిపించిన కృతజ్ఞత నాకు ఎంతో మనశ్శాంతిని ఇచ్చింది. ఆ తర్వాత నాకు కాల్స్‌ రావడం మొదలైంది. కోయంబత్తూరులో లూయిస్‌ బ్రెయిలీ అకాడెమీ ఉంది. వాళ్లు కాల్‌ చేస్తూనే ఉంటారు. వీరు కాకుండా దివ్యాంగులు, ఆటిజమ్‌ విద్యార్థులు... వీరు పెన్‌ పట్టి పరీక్ష రాయడం కష్టం. వారికి పరీక్షలు రాసి పెడుతుంటాను’ అని తెలిపింది రమా పద్మనాభన్‌.

అంతా ఉచితమే
దివ్యాంగులకు, అంధులకు పరీక్షలు రాసేందుకు రమ ఎటువంటి రుసుమూ తీసుకోదు. పరీక్షా కేంద్రానికి కూడా సొంత ఖర్చులతోనే వెళ్లి వస్తుంది. ‘అయితే అందుకు నా భర్తను అభినందించాలి. నీ డబ్బులు ఖర్చు పెట్టి వేరొకరి పరీక్షలు ఎందుకు రాస్తున్నావు అని ఎప్పుడూ అడగలేదు’ అంటుంది రమ. ‘అంధ విద్యార్థులు తమకు పరీక్షలు రాసి పెట్టే వారు లేరని తెలిస్తే చాలా టెన్షన్‌ పడతారు. ఆబ్సెంట్‌ అయితే పరీక్ష పోతుంది. అందుకే వారికి స్క్రయిబ్‌లు కావాలి. వారు చెబుతుంటే జవాబులు సరిగ్గా రాయగలగాలి. 

నేను ఆటిజమ్‌ విద్యార్థులకు రాసి పెట్టేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటాను. వారు సమాధానాలు కంటిన్యూస్‌గా చెప్పడంలో ఇబ్బంది పడతారు. ప్రోత్సహిస్తూ రాబట్టాలి. అదే కాదు హైస్కూల్‌ పాఠాల దగ్గరి నుంచి ఇంజినీరింగ్‌ పాఠాల వరకూ అవగాహన ఉండాలి. అందుకే ఆ పాఠాలు కూడా తెలుసుకుంటూ ఉంటాను. స్క్రయిబ్‌గా నేను మారేటప్పటికి నా పిల్లలు చిన్నవాళ్లు. నా చిన్నకొడుకుకైతే ఐదారేళ్లవాడు. ఇంటిదగ్గర వాణ్ణి ఒక్కణ్ణే వదిలి తాళం వేసుకుని పరీక్ష రాసి పెట్టిన సందర్భాలున్నాయి’ అని తెలిపిందామె.

కొనసాగే అనుబంధం
‘నేను రాసిన పరీక్షలతో కోర్సులు పాసై ఉద్యోగాలు పొందిన దివ్యాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా నా కాంటాక్ట్‌లో ఉంటారు. తమ జీవితంలో సాధిస్తున్న ప్రగతిని తెలియజేస్తుంటారు. అదంతా వింటుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. జీవితానికి ఒక అర్థం దొరికినట్టు ఉంటుంది. నా పెద్దకొడుకు  సీనియర్‌ ఇంటర్‌కు వచ్చాడు. వాణ్ణి వీలున్నప్పుడల్లా స్క్రయిబ్‌గా పని చేయడానికి పంపుతున్నా. వాడు ఆ పని చేస్తున్నందుకు ఎంత సంతోష పడుతున్నాడో చెప్పలేను’ అని ముగించింది రమా పద్మనాభన్‌.
 

Published date : 09 May 2024 02:55PM

Photo Stories