Skip to main content

విద్యారంగ సమస్యలపై సమరానికి సన్నద్ధం

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఆజాద్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి సంధ్య అన్నారు.
pdsu
pdsu

ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ చేరలేదన్నారు. అంతేకాక పాఠశాలల్లో తరగతి గదులు, టాయిలెట్ల కొరత, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై పట్టించుకోలేదని ఆరోపించారు. ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. మన ఊరు – మన బడి పథకానికి నిధుల కేటాయింపు సక్రమంగా జరగక ఆశించిన స్థాయిలో పాఠశాలల్లో సౌకర్యాలు సమకూరలేదని తెలిపారు. మరోపక్క ప్రైవేట్‌ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు దండుకుంటున్నా.. ప్రభుత్వం, విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, నాయకులు కిరణ్‌, దీపిక, నవీన్‌, వినయ్‌, శశి, కరుణ్‌, కార్తీక్‌, రాజేష్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 12 Jun 2023 04:29PM

Photo Stories