National Medical Commission : ఈ ‘ఎగ్జిట్’ దాటితేనే ఎంట్రీ..కొత్త నిబంధనలు ఇవే..
విదేశాల్లో నాణ్యమైన ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికే మన దేశంలో శాశ్వత మెడికల్ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఏ దేశంలోనైనా గుర్తింపు పొందిన వైద్య కాలేజీల్లోనే చదవాలని విద్యార్థులకు సూచించింది. మన దేశంలో మాదిరిగా వైద్య విద్య కోర్సు (నాలుగున్నరేళ్లు), ఇంటర్న్‌షిప్ (ఏడాది) రెండూ కలిపి ఐదున్నరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
అప్పుడే మనదేశంలో..
దీని ప్రకారం.. విద్యార్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయాలి. కోర్సు పూర్తయి వచ్చాక, స్వదేశంలో మరో 12 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఎగ్జిట్ పరీక్షలో పాసై తీరాలి. పదేళ్లలోపే ఎంబీబీఎస్ కోర్సు, ఇంటర్న్‌షిప్ మొత్తం పూర్తిచేయాలి. అప్పుడే మనదేశంలో రిజి స్ట్రేషన్‌కు, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి లేదా ఏదైనా ఆసుపత్రిలో పనిచేయడానికి వీలుపడుతుందని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.
సీటు రాక..
ఈ ఏడాది 15.44 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, దాదాపు 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కానీ, మన దేశంలో కేవలం 85 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే చాలామంది విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం 5,200 బీబీఎస్ సీట్లున్నాయి. కానీ 20 వేల మందికిపైగా నీట్ అర్హత సాధించి ఉంటా రని అంచనా. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి.
ఫీజులు ఇలా..
బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.50 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ సీటు ఫీజు రూ.23 లక్షల వరకు ఉంటోంది. విదేశాల్లో చదివితే రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షలవుతోంది. ఈ కారణంగానే చాలా మంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా, పాకిస్తాన్‌ల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు.
ఎఫ్‌ఎంజీఈ ఉత్తీర్ణత శాతం..
విదేశాల్లో ఎంబీబీఎస్ అంత నాణ్యతతో ఉండటం లేదన్న అభిప్రాయం ఉంది. పలు దేశాల్లో చదివి వచ్చినవారు అనేకమంది ఇక్కడ రిజిస్ట్రేషన్‌కు ముందు రాసే పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోవడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మనదేశంలో ప్రాక్టీస్ చేసేలా లైసెన్స్ పొందడానికి మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్‌ఎంజీఈ పరీక్షలకు 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, కేవలం 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది.
అంటే 14.22 శాతమే ఉత్తీర్ణులయ్యారన్నమాట. చైనా, రష్యా, ఆయా దేశాల్లో చదివినవారు చాలా తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారని కేంద్రం తెలిపింది. ప్రతి విద్యార్థికీ ఈఎఫ్‌ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు అవకాశముంటుంది. కొత్త నిబంధనల మేర కు విదేశాల్లో వైద్యవిద్య ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కొత్త నిబంధనలతో..
ఎన్‌ఎంసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు విదేశాల్లో నాణ్యమైన వైద్య విద్యను అభ్యసించడానికి తోడ్పడతాయి. తద్వారా ఇక్కడ ఎఫ్‌ఎంజీఈ పరీక్ష పాసవడానికి, ప్రాక్టీస్ చేయడానికి వీలుకలుగుతుంది. మన దేశంలో మాదిరి కోర్సు కాలవ్యవధి, ఇలాంటి సిలబస్ ఉన్న వియత్నాంలో చదివేం దుకు అడ్మిషన్ తీసుకున్నా. – నర్మద
ఇలాంటి చదువుకు చెక్..
కొన్ని విదేశీ మెడికల్ కాలేజీలు తూతూమంత్రంగా చదువుచెప్పి మన విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి. వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ఎన్‌ఎంసీ ఈ నిబంధనలు తీసుకొచ్చింది.
– డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ