Skip to main content

కర్నూలు మెడికల్‌ కాలేజీలో పీజీ సీట్ల పెంపు

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కాలేజీలో పీజీ సీట్ల మరింత పెరిగాయి. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఉత్తర్వులు జారీ చేసింది.
Kurnool Medical College
Kurnool Medical College

పాథాలజీ విభాగంలో పీజీ సీట్ల సంఖ్య నాలుగు నుంచి 8కి, పీడియాట్రిక్‌(చిన్నపిల్లల విభాగం)లో పీజీ సీట్ల సంఖ్య 11 నుంచి 15కు పెంచుతూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీజీ సీట్ల పెరుగుదల పట్ల ఆయా విభాగాల వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేడు ‘స్పందన’

కర్నూలు(సెంట్రల్‌): స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల, డివిజన్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లో కూడా స్పందన కార్యక్రమం జరుగుతుందన్నారు.

ప్రశాంతంగా

‘మోడల్‌’ ప్రవేశ పరీక్ష

కర్నూలు సిటీ: ఏపీ మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆదివారం పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 16 మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాల కోసం 2,435 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరు ఏ స్కూల్‌లో దరఖాస్తు చేసుకున్నారో ఆ స్కూల్‌లోనే పరీక్ష నిర్వహించారు. పరీక్షలకు 2,435 మందికిగాను 2,189 మంది హాజరుకాగా 246 మంది గైర్హాజరయ్యారు. ఏపీ మోడల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్యామ్యూల్‌ పాల్‌ పెద్దపాడు దగ్గర ఉన్న మోడల్‌ స్కూల్‌లో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.

వజ్రం లభ్యం

తుగ్గలికర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన ఓ వ్యక్తికి ఆదివారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.30వేలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో ఏటా వజ్రాలు లభ్యమవు తుండడం తెలిసిందే. దీంతో వజ్రాన్వేషణకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జనం ఇక్కడికి వస్తుంటారు. పొద్దున్నే పొలాల్లో వాలిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఎర్ర నేలల్లో అణువణువు శోధిస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.3.03లక్షలకు ఒకటి, మరొకటి రూ.30వేల విలువ చేసే వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం.

నేడు డీసెట్‌

కర్నూలు సిటీ: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన డీసెట్‌ను నేడు(సోమవారం)నిర్వహించనున్నారు. కర్నూలు సనత్‌నగర్‌లోని ఆయాన్‌ డిజిటల్‌ జోన్‌ ఐడీ జెడ్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న పరీక్షకు 357 మంది విద్యార్థులు హాజరుకానునున్నారు. పరీక్షకు సంబంధించిన ఏమైనా ఫిర్యాదులు ఉంటే 9849932289 నంబరుకు ఫోన్‌ చేయవచ్చు.

Published date : 12 Jun 2023 04:16PM

Photo Stories