Gurukul Students Illness : ఆహారం కారణంగా గురుకుల విద్యార్థులకు అస్వస్థత.. ఆందోళనలో తల్లిదండ్రులు..
నాయుడుపేట టౌన్: నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆదివారం అర్ధరాత్రి 139 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. వీరిని నాయుడుపేట గురుకులం, సామాజిక వైద్య కేంద్రం, సూళ్లూరుపేట సామాజిక వైద్య కేంద్రంలో, గూడూరు ఏరియా వైద్యశాలకి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్సల కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కలుషిత ఆహారం వల్లే..
కలుషిత ఆహారం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. శనివారం వండిన పూరీలతో పాటు బంగాళాదుంపల కుర్మా ఆదివారం ఉదయం విద్యార్థులకు వడ్డించారు. అదేవిధంగా నిల్వచేసిన కోడి మాంసం ఆదివారం ఉదయం వండి మధ్యాహ్నం, మిగిలినది రాత్రి కూడా వడ్డించారు. దీనితోనే ఆదివారం మధ్యాహ్నం నుంచే విద్యార్థులకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయని చెప్పారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రిన్సిపాల్ దాదాపీర్, వార్డెన్ విజయభాస్కర్ గోప్యంగా ఉంచారు. రాత్రి పరిస్థితి విషమించి విద్యార్థులకు వాంతులు, విరోచనాలు తీవ్రస్థాయిలో మొదలవడంతో సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.
ఆదివారం అర్ధరాత్రి నుంచే అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ రాజేంద్ర తదితర అధికారులు గురుకులం వద్దే ఉండి విద్యార్థులకు వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. కలెక్టర్ సోమవారం ఉదయం నాయుడుపేటకు చేరుకుని విద్యార్థులకు సత్వరం వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంఅండ్ హెచ్‌ఓ శ్రీహరి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పద్మజ, సూళ్లూరుపేట ఆర్డీవో చంద్రముని, నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వైద్య సేవలను పర్యవేక్షించారు.
ప్రిన్సిపాల్, వార్డెన్‌తో పాటు మరో ఇద్దరిపై చర్యలు
విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ దాదాపీర్‌తో పాటు వార్డెన్ విజయభాస్కర్‌రెడ్డి, శానిటేషన్ అధికారి, స్టాఫ్‌నర్సులపై చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయమై జేసీతో కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ చంద్రకళ బాధ్యతారాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో గురుకులంలోని విద్యార్ధుల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం తదితరులు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు.
GATE Exam 2025 : ఫిబ్రవరి 2025లో గేట్.. దీని స్కోర్‌తోనే ఎంటెక్, పీహెచ్‌డీతోపాటు పీఎస్‌యూ జాబ్స్!
తల్లిదండ్రుల్లో ఆందోళన
నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుని తమ పిల్లలను చూసి ఆందోళన చెందారు. గురుకుల అధికారులు తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు కూడా నాయుడుపేట సీహెచ్‌సీ వైద్యులతో పాటు అర్బన్ వైద్యశాలల వైద్యులు, దొరవారిసత్రం ప్రభుత్వ వైద్యులు విద్యార్థులకు చికిత్సలు అందించారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున పడుకోబెట్టి వైద్య సేవలను అందించారు.
బాధ్యులపై కఠిన చర్యలు
విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. నాయుడుపేటలోని గురుకులంలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోమవారం గురుకులాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీతో కలిసి పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు సీఎంకు నివేదించారని తెలిపారు. మూడురోజులు గురుకులానికి సెలవులు ప్రకటించామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో మెరుగైన వసతుల కల్పనకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అలాగే గూడూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 41 మంది విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఆహారం కలుషితమైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు.