IIT Madras Distributed Books To School Students: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, ఇప్పటివరకు 3లక్షలకు పైగానే..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) మద్రాస్, సైన్స్ పాపులరైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా 2026 నాటికి 50,000 ప్రభుత్వ పాఠశాలలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మ్యాథమెటిక్స్)లో కెరీర్‌ని ఏర్పరుచుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా 9,193 గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు 3,20,702 పుస్తకాలను పంపిణీ చేశారు. బయోటెక్నాలజీకి చెందిన ప్రొ. వి.శ్రీనివాస్ చక్రవర్తి, బయోసైన్సెస్‌కు చెందిన ప్రొ. భూపత్, జ్యోతి మెహతాలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంలో ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రొ. శ్రీనివాస్ చక్రవర్తి దాదాపు 70 సైన్స్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ మద్రాస్, పూర్వ విద్యార్థులు మరియు దాతలందరికీ ప్రత్యేకంగా దన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం, వారికి మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే మా ఉద్దేశమని పేర్కొన్నారు.