Minister Adimulapu Suresh: విద్యా వ్యవస్థకే 15 శాతం బడ్జెట్
నెల్లూరు(బారకాసు): విద్యా వ్యవస్థకు 15 శాతం బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. నగరంలోని బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.2.09 కోట్లతో నిర్మించిన షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, బాస్కెట్‌బాల్ కోర్టు ప్రారంభంతో పాటు రూ.6.27 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనను గురువారం చేపట్టారు. కార్యక్రమానికి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. పట్టణీకరణ రోజురోజుకూ పెరుగుతోందని.. పట్టణాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, తదితరాలను కల్పించేలా ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. నెల్లూరు నగరాభివృద్ధికి ఎమ్మెల్యే అనిల్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.
చదవండి: National Medical Commission: 10 లక్షల జనాభాకు ఇన్ని ఎంబీబీఎస్ సీట్లు
మారిన బీవీఎస్ పాఠశాల రూపురేఖలు
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బీవీఎస్ పాఠశాలలో షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, బాస్కెట్‌బాల్ కోర్టును రూ.2.09 కోట్లతో ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. ఆరెస్సార్ హైస్కూల్లో ఫుట్‌బాల్ కోర్టును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.2.5 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టారని, అయితే తమ ప్రభుత్వ హయాంలో బీవీఎస్ పాఠశాలలోనే రూ.ఐదు కోట్లతో పనులను చేపట్టామని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదవడం అదృష్టం
ప్రభుత్వ పాఠశాలలో చదవడాన్ని విద్యార్థులు అదృష్టంగా భావించాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. తొలుత మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వాలీబాల్, షటిల్, టేబుల్ టెన్నిస్‌ను క్రీడాకారులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆడారు. కమిషనర్ వికాస్ మర్మత్, ఆఫ్కాఫ్ చైర్మన్ అనిల్‌బాబు, డీఈఓ గంగాభవానీ, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Padmavati Women's University: స్మార్ట్ స్కిల్స్‌పై శిక్షణా శిబిరం