AP Government Schools: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలపై ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ పాఠశాల మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. విద్యపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ, సంస్కరణలు మారిన పరిస్థితులు, సాధించిన ఫలితాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వరకు చేరగా..తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో మనబడి నాడు–నేడుపై చర్చ జరిగింది. ఈనెల 13న యునెస్కో ఆధ్వర్యంలో ప్యారిస్‌లోని ప్రధాన కార్యాలయంలో ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు ప్రారంభమైంది.
ప్రత్యేక ఆకర్షణగా ఏపీ విద్యా సంస్కరణలు
90కి పైగా దేశాల నుంచి 400 మంది విద్యా శాఖ ముఖ్య అధికారులు, స్పెషలిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ ఏపీ ప్రతినిధిగా గురువారం పాల్గొని రాష్ట్రంలో అమలు చేస్తోన్న మనబడి నాడు–నేడుపై వివరించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అసమానతలు లేని అన్ని సదుపాయాలతో సమగ్ర విద్య అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏపీ విద్యా సంస్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నాడు-నేడుపై ప్రశంసలు
పేదింటి పిల్లలు చదువుకునే బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, విభిన్న భాషలు మాతృభాషగా ఉన్న విద్యార్థులు కూడా సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు, విద్యార్థులకు ట్యాబ్స్ వంటి అంశాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకున్నాయని షకిన్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
సమగ్ర విద్య మూలస్తంభాల్లో ‘మనబడి నాడు–నేడు’తో వచ్చిన మార్పు ఒకటి అని యునెస్కో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ వివిఎన్ గైరిస్, ఎడ్యుకేషన్ ఫర్ ఇంక్లూజన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ చీఫ్ జస్టీన్ సాస్ అభివర్ణించినట్లు షకిన్ తెలిపారు.