Skip to main content

Education Secretary Praveen Prakash: ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం జీఈఆర్ పెరిగింది

State Government's Education Statement  Education Secretary Praveen Prakash   Digital Education in Hyderabad Schools

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ పౌరులుగా రాష్ట్ర విద్యార్థులను సంసిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలను రూపొందించిందని పేర్కొన్నారు.

‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్ పర్ట్’ అంశంలో శిక్షణ
రాష్ట్రంలో చేపడుతున్న ప్రతిష్ఠాత్మక విద్యాభివృద్ది కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు, పాఠశాల విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకునేలా సుమారు 2000 మంది ఇంజినీరింగ్ కళాశాలల 4వ సంత్సరం విద్యార్థులకు ఇంటర్న్ షిప్ ప్రవేశపెట్టి ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్ పర్ట్’ అంశంలో శిక్షణ అందిస్తున్నామన్నారు.

తద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 80 మంది చొప్పున 6,500  ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు స్కిల్స్ నేర్పించేందుకు అనుగుణంగా ఒక్కొక్కరు మూడు పాఠశాలల్లో సేవలు అందించనున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయా ఇంజినీరింగ్ విద్యార్థులతో జిల్లాల్లో సంయుక్తంగా వర్చువల్  సదస్సు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ రంగంలోకి అడుగుపెట్టిన విద్యార్థుల్లో పటిష్టమైన విశ్వాసాన్ని పెంపొందించేందుకు, వారి విధి నిర్వహణలో ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. ప్రభుత్వం అందించే సౌకర్యాల ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకునేలా ప్రోత్సహించాలని ఫ్యూచర్ స్కిల్ నిపుణులను కోరారు.

జీఈఆర్‌ శాతం 100% పెరిగింది
గతంలో ప్రాథమిక విద్య, సెకండరీ విద్యలో 76.69 శాతంగా ఉన్న జీఈఆర్ 100 శాతానికి, హయ్యర్ సెకండరీ విద్యలో 46.68 శాతంగా ఉన్న జీఈఆర్ 74.87  శాతానికి పెరగడంలో ఉపాధ్యాయులు, అధికారుల కృషి ప్రశంసనీయమన్నారు.

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మిషన్ జీఈఆర్ 100 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇప్పటిదాకా 85,88,029 మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారని పేర్కొన్నారు. బడి మానేసే ప్రమాదమున్న 1,47,779 మంది విద్యార్థులు తిరిగి పాఠశాలల్లో చేరినట్లు గణాంకాలు నమోదయ్యాయన్నారు.

ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థులంతా వార్షిక పరీక్షలకు హాజరు అయితేనే తాము అనుకున్న లక్ష్యం సాధించినట్లు అని,  లేదంటే తమ మిషన్ అసంపూర్తిగా ఉన్నట్లు భావించాలని  కలెక్టర్లు, డీఈవోలు, డీవీఈవోలకు తెలిపారు. 

 ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్:  

 క్లాస్ 11వ మరియు 12వ రెగ్యులర్ స్ట్రీమ్: మార్చి 1 నుండి మార్చి 20 వరకు, క్లాస్ 11వ మరియు 12వ ఓపెన్ స్కూల్ స్ట్రీమ్: మార్చి 18 నుండి ఏప్రిల్ 4 వరకు,  క్లాస్ 10వ రెగ్యులర్ స్ట్రీమ్: మార్చి 18 నుండి మార్చి 30 వరకు, క్లాస్ 10వ ఓపెన్ స్కూల్ స్ట్రీమ్: మార్చి 18 నుండి ఏప్రిల్ 4 వరకు,  క్లాసులు 1 నుండి 9 వరకు: ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 22 వరకు,  పాలిటెక్నిక్: మే 24, IIIT – జూన్ 24, ITI: ఆగస్టు 24 ఉంటాయని ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

ఆయా తుది మూల్యాంకన పరీక్షలకు  విద్యార్థులందరూ హాజరయ్యేలా చూసుకోవాలని కలెక్టర్లు, డీఈవోలు, డీవీఈవోలకు సూచించారు. ప్రతి విద్యార్థిని దగ్గరగా పర్యవేక్షించి, పరిశీలించాలన్నారు. దీనికి పాఠశాల నుండి గ్రామ, వార్డ్ కార్యదర్శుల వరకు అందరి నుండి వివరమైన ప్రణాళిక అవసరమని ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించడంలో ప్రోత్సహించడం, నిర్వహించడంలో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు.

10వ తరగతి పరీక్షలు.. కొత్త మూల్యంకన కేంద్రం
గత ఏడాది గుంటూరు జిల్లా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు, 10వ తరగతి బోర్డు పరీక్షలకు ఉపాధ్యాయులు 10 రోజులు ఉపయోగించే అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించి ప్రవీణ్ ప్రకాష్  సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు సంబంధించి  వేర్వేరు కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడేలా, నెగ్గేలా తీర్చిదిద్దేందుకు  ఇటీవలే ప్రభుత్వం ఎస్ఈఆర్ టీలో అంతర్జాతీయ విద్యాబోర్డు ఐబీ(ఇంటర్నేషనల్ బకలారియేట్) ని భాగస్వామ్యం చేసిందని ఉపాధ్యాయును ఉద్దేశించిన ప్రసంగంలో పేర్కొన్నారు.

క్రమ పద్ధతిలో ఐబీ బోధనవైపు ప్రభుత్వం అడుగులేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, పాజిటివ్ థింకింగ్, ప్రతిభను వెలికితీయడమే ప్రధాన లక్ష్యంగా ఐబీ విధానం కొనసాగనుందన్నారు. ఐబీ విద్యాబోధనలో చదువుకున్న మన విద్యార్థులకు  ప్రపంచవ్యాప్తంగా ప్రయోజనం చేకూరేలా ఎస్ఈఆర్టీ, ఐబీల జాయింట్ సర్టిఫికేషన్ అందించనున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయడం, సీబీఎస్ఈ నుండి ఐబీ దాకా అడుగులు వేయడం తదితర అంశాలపై  ప్రవీణ్ ప్రకాష్ చేసిన ప్రసంగం  మనసుకు హత్తుకుందని ఉపాధ్యాయులు తెలిపారు.

Published date : 12 Feb 2024 03:15PM

Photo Stories