Skip to main content

PhD Fellowships‌: ఈ కమిటీ సిఫార్సులు అమలైతే.. ఫెలోషిప్స్ అందని ద్రాక్షే!

Gautam Barua Panel proposes replacing Non-NET fellowship with NET-II
Gautam Barua Panel proposes replacing Non-NET fellowship with NET-II

పరిశోధనల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. దేశంలో పరిశోధనలు, పీహెచ్‌డీకి మార్గం.. యూజీసీ నెట్‌! అందుకే ప్రతి ఏటా లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు. నెట్‌లో అర్హత సాధించకుంటే.. యూనివర్సిటీలు నిర్వహించే పీహెచ్‌డీ ఎంట్రన్స్‌లపై ఆధారపడాల్సిందే!! వర్సిటీల ప్రవేశ పరీక్షతో పీహెచ్‌డీలో చేరి.. నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌ అందుకోవచ్చని ఎంతోమంది ఆశిస్తుంటారు. ఇలాంటి వారి ఆశలపై నీళ్లు చల్లేలా నిపుణల కమిటీ తాజాగా సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులు అమలైతే ఫెలోషిప్స్‌ అందని ద్రాక్షగా మారుతాయనే ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఫెలోషిప్‌లు, నిపుణుల కమిటీ సిఫార్సులపై విశ్లేషణాత్మక కథనం...

  • యూనివర్సిటీల్లో నాన్‌–నెట్‌ ఫెలోషిప్స్‌కు స్వస్తి?
  • యూజీసీ నెట్‌లో అర్హత సాధిస్తేనే ఆర్థిక ప్రోత్సాహకం
  • ఎంఫిల్‌ అభ్యర్థులకూ నో ఫెలోషిప్‌ 
  • బారువా కమిటీ తాజా సిఫార్సులు
  • అమలు చేస్తే ఇబ్బందే అంటున్న నిపుణులు


పీహెచ్‌డీలో చేరి పరిశోధనలు చేస్తూ.. ఆర్థిక ప్రోత్సాహకాలు పొందాలంటే.. యూజీసీ నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌–జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించాలి. దీనిద్వారా దేశవ్యాప్తంగా ప్రయోజనం పొందుతున్న వారి సంఖ్య ఏటా  పదివేల వరకూ ఉంటోంది. దీంతో.. పరిశోధన అభ్యర్థులు పీహెచ్‌డీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా.. ఆయా యానివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లను ఎంచుకుంటున్నారు. వీటిలో ఉత్తీర్ణత సాధించి పీహెచ్‌డీలో ప్రవేశం పొందితే..నాన్‌–నెట్‌ ఫెలోషిప్‌ పేరిట ఆర్థిక ప్రోత్సాహకం అందుతుంది.  కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సులను పరిశీలిస్తే.. నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌లకు స్వస్తి పలుకుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. 


బారువా కమిటీ
దేశంలో అమలవుతున్న రీసెర్చ్‌ ఫ్రేమ్‌ వర్క్, అవకాశాలు, ఫలితాలు.. ముఖ్యంగా రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌పై సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం..2015లో అప్పటి ఐఐటీ–గువహటి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గౌతమ్‌ బారువా నేతృత్వంలో అయిదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ  ఇటీవల పలు సిఫార్సులతో యూజీసీకి నివేదిక అందించింది.
 

ముఖ్య సిఫార్సులు ఇవే!

  • నాన్‌–నెట్‌ ఫెలోషిప్స్‌కు స్వస్తి పలకాలని బారువా కమిటీ సిఫార్సు చేసింది.
  • రీసెర్చ్‌ కోసం ఆర్థిక ప్రోత్సాహకాలు పొందాలంటే.. తప్పనిసరిగా యూజీసీ నెట్‌ ఒక్కటే మార్గంగా ఉండాలని పేర్కొంది. 
  • యూనివర్సిటీలు సొంతంగా నిర్వహిస్తున్న ఎంట్రన్స్‌ల ద్వారా కాకుండా.. యూజీసీ నెట్‌–2 పేరుతో కొత్త విధానాన్ని అమలు చేసి.. దానిఆధారంగా పీహెచ్‌డీ అభ్యర్థులకు ఫెలోషిప్‌ అందించాలని సూచించింది.
  • ఎంఫిల్‌లో చేరిన వారికి ఇస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలకు పూర్తిగా స్వస్తి పలకాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. 


నాన్‌–నెట్‌ ఫెలోషిప్స్‌

  • దేశంలో పీహెచ్‌డీ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించే ప్రధాన మార్గం.. యూజీసీ–నెట్‌ జేఆర్‌ఎఫ్‌. వీరికి నెలకు రూ.31వేల నుంచి రూ.35వేల వరకూ ఫెలోషిప్‌  అందుతుంది. కాని జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించే వారి సంఖ్య చాలా తక్కువ. దాంతో ఎక్కువ మంది అభ్యర్థులు పీహెచ్‌డీ, పరిశోధనల కోసం యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లపై ఆధారపడుతున్నారు. వీటిల్లో అర్హత సాధించి.. నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌ను పొందుతున్నారు. 
  • యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లు లేదా ఇతర టెస్ట్‌ల(సెట్, గేట్, పీజీసెట్‌ తదితర) ద్వారా పీహెచ్‌డీలో చేరిన పరిశోధన అభ్యర్థులకు నెలకు రూ.8వేలు చొప్పున యూజీసీ ఫెలోషిప్‌ అందుతుంది. దీంతోపాటు సైన్స్‌ సబ్జెక్ట్‌లలో పీహెచ్‌డీ చేసే వారికి ఏటా రూ.పదివేలు, హ్యుమానిటీస్‌ వారికి ఏటా రూ.8వేల కాంటింజెన్సీ గ్రాంట్‌ కూడా అందిస్తున్నారు. ఇది మూడు నుంచి ఆరేళ్ల వరకు లభిస్తుంది.   
  • అదేవిధంగా యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్‌ల ద్వారా ఎంఫిల్‌లో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.5వేల చొప్పున నాన్‌–నెట్‌ ఫెలోషిప్‌ అందుతోంది. దీనికి అదనంగా.. సైన్స్‌ సబ్జెక్ట్‌ల విద్యార్థులకు ఏడాదికి రూ.పది వేలు, ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ అభ్యర్థులకు ఏడాదికి రూ.8వేలు కాంటింజెన్సీ గ్రాంట్‌ను అందిస్తున్నారు. ఇలా గరిష్టంగా రెండేళ్ల పాటు ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది.
  • నిపుణుల కమిటీ ఈ నాన్‌–నెట్‌ ఫెలోషిప్స్‌ను తొలగించాలని సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


యూజీసీ నెట్‌–2 విధానం

  • నాన్‌–నెట్‌ ఫెలోషిప్స్‌కు స్వస్తి పలికి.. యూజీసీ–నెట్‌ జేఆర్‌ఎఫ్‌కు అర్హత పొందని పీహెచ్‌డీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా నెట్‌–2 పేరిట కొత్త విధానాన్ని అమలు చేయాలని కమిటీ సూచించింది. 
  • యూజీసీ–నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన విద్యార్థులను మినహాయించి.. మిగతా వారి కోసం మరో కటాఫ్‌ మార్కును నిర్ణయించాలి. సదరు కటాఫ్‌లోపు మార్కులు పొందిన వారిని నెట్‌–2 ఫెలోషిప్‌లకు అర్హులుగా పేర్కొనాలని సిఫార్సు చేసింది. 
  • ఇలా కొత్తగా ప్రతిపాదించిన నెట్‌–2 విధానం ద్వారా ఎంపిక చేసే పరిశోధన అభ్యర్థుల సంఖ్య.. నెట్‌ జేఆర్‌ఎఫ్‌ అర్హుల సంఖ్యలో సగం(50 శాతం) మాత్రమే ఉండాలని కూడా సూచించినట్లు సమాచారం. ఈ అభ్యర్థులకే నెట్‌–2 ఫెలోషిప్స్‌ ఇవ్వాలని ప్రతిపాదించింది. 
  • ఎంఫిల్‌కు సంబంధించి నాన్‌–నెట్‌ ఫెలోషిప్స్‌ను పూర్తిగా తొలగించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది.
  • మొత్తంగా చూస్తే.. యూనివర్సిటీలు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా పీహెచ్‌డీ, ఎంఫిల్‌లో చేరిన అభ్యర్థులకు ఇకపై నాన్‌–నెట్‌ ఫెలోషిప్స్‌ అందించాల్సిన అవసరం లేదని నిపుణల కమిటీ పేర్కొనట్లు తెలుస్తోంది.


వేల మంది అభ్యర్థులకు నిరాశ

  • నిపుణుల కమిటీ సిఫార్సుల కారణంగా దేశవ్యాప్తంగా వేల మంది పరిశోధన అభ్యర్థులు నిరాశకు గురయ్యే పరిస్థితి ఏర్పడనుంది. 
  • ప్రస్తుతం యూజీసీ–నెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నారు. జేఆర్‌ఎఫ్‌కు అర్హులను ఎంపిక చేసే క్రమంలో అనుసరిస్తున్న కటాఫ్‌ నిబంధనల ప్రకారం– జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించే వారి సంఖ్య మొత్తం అభ్యర్థుల్లో 2శాతం మించట్లేదు. 
  • యూజీసీ–నెట్‌ జూన్‌–2020కు 3,88,226 మంది హాజరుకాగా.. జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించిన వారి సంఖ్య 6,171 మాత్రమే.
  • అదే విధంగా.. యూజీసీ–నెట్‌ డిసెంబర్‌–2019లోనూ దాదాపు నాలుగు లక్షల మంది హాజరవగా.. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారికి సంఖ్య 5,090 మాత్రమే.
  • ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. కమిటీ సిఫార్సుల ప్రకారం–ఏటా పది నుంచి 11వేల మందికి జేఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌లు.. మరో ఆరేడు వేల మందికి నెట్‌–2 ఫెలోషిప్స్‌ లభించే అవకాశం ఉంది. 


వర్సిటీ టెస్టుల ద్వారా 70 వేల మంది
పీహెచ్‌డీ, ఎంఫిల్‌ ప్రవేశాల కోసం యూనివర్సిటీలు సొంతంగా నిర్వహించే ప్రవేశ ప్రక్రియ ద్వారా.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 60 వేల నుంచి 70 వేల మంది వరకు యూజీసీ నాన్‌–నెట్‌ ఫెలోషిప్స్‌ పొందుతున్నారు. నెట్‌–2 విధానంలో అర్హత సాధించిన వారికే వీటిని అందించాలనే కొత్త సిఫార్సుతో కేవలం ఆరేడు వేల మందికి మాత్రమే ఫెలోషిప్స్‌ లభించే ఆస్కారం ఉంది. 


పరిశోధనలకు దూరం

  • ప్రొఫెసర్‌ గౌతమ్‌ బారువా కమిటీ సిఫార్సులను అమలు చేస్తే.. రానున్న రోజుల్లో వేల మంది పరిశోధనలకు దూరమవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం యూజీసీ నెట్‌లో జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించకపోయినా.. నాన్‌–నెట్‌ ఫెలోషిప్‌ ద్వారా అందుతున్న ప్రోత్సాహకాలు.. అభ్యర్థుల రీసెర్చ్‌ యాక్టివిటీస్‌కు ఎంతో తోడ్పాటునిస్తున్నాయి. నాన్‌–నెట్‌ ఫెలోషిప్స్‌ను పూర్తిగా తొలగిస్తే.. ఏళ్ల తరబడి సాగించాల్సిన పీహెచ్‌డీ, అందుకయ్యే ఖర్చుల కారణంగా విద్యార్థులు వెనుకంజ వేస్తారనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా అల్పాదాయ వర్గాలు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు పీహెచ్‌డీ, పరిశోధనలకు దూరమయ్యే ఆస్కారముందంటున్నారు. 
  • నిపుణుల కమిటీ సిఫార్సులను అమలు చేస్తే పీహెచ్‌డీ చేసే వారి సంఖ్య తగ్గి.. భవిష్యత్తులో ఉన్నత విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ కొరతకు దారితీస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 


అయిదేళ్ల క్రితమే ప్రతిపాదన.. వెనుకంజ
నాన్‌–నెట్‌ ఫెలోషిప్స్‌ను తొలగించాలని అయిదేళ్ల క్రితమే తొలిసారి ప్రతిపాదించారు. జాతీయ స్థాయిలో దీనిపై రీసెర్చ్‌ అభ్యర్థుల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆ ప్రతిపాదనను విరమించుకొని.. నాన్‌–నెట్‌ ఫెలోషిప్‌లను కొనసాగిస్తున్నారు. తాజాగా బారువా కమిటీ మళ్లీ అలాంటి సిఫార్సులనే చేసింది. యూజీసీ, కేంద్ర విద్యాశాఖ కమిటీ సిఫార్సులను సమీక్షించే అవకాశముందని.. యూనివర్సిటీలు, విద్యావేత్తల నుంచి మరోమారు అభిప్రాయాలు స్వీకరిస్తారనే వాదన వినిపిస్తోంది.


బారువా కమిటీ సిఫార్సులు.. ముఖ్యాంశాలు

  • 2006 నుంచి అమలవుతున్న నాన్‌–నెట్‌ ఫెలోషిప్‌ స్కీమ్‌.
  • నాన్‌–నెట్‌ ఫెలోషిప్‌ కింద నెలకు రూ.8వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం.
  • దీనికి అదనంగా సైన్స్, ఆర్ట్స్‌ హ్యుమానిటీస్‌ అభ్యర్థులకు వేర్వేరు మొత్తాల్లో కాంటింజెన్సీ గ్రాంట్‌.
  • నాన్‌ నెట్‌ ఫెలోషిప్స్‌కు స్వస్తి పలకాలని కమిటీ సిఫార్సులు.
  • జాతీయ స్థాయిలో ఏటా 60 నుంచి 70 వేల మందిపై ప్రభావం.
  • వేల మంది అభ్యర్థులు పీహెచ్‌డీకి దూరమయ్యే ఆస్కారం. 
  • భవిష్యత్తులో పరిశోధనలు, ఫ్యాకల్టీ కొరత తలెత్తే ప్రమాదం.


అమలు చేస్తే ఇబ్బంది
కమిటీ సిఫార్సులను యూజీసీ అమలు చేస్తుందని ఇప్పుడే చెప్పలేం. ఈ సిఫార్సులకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో..నెట్‌ కటాఫ్‌ను పెంచడం, ఇతర పథకాల ద్వారా రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌ అందించేందుకు అవకాశం ఉంది. కానీ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేస్తే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.
– ప్రొ‘‘ డి.ఎన్‌.రెడ్డి, యూజీసీ మాజీ సభ్యులు

చ‌ద‌వండి: Internships: సమ్మర్‌ ప్లేస్‌మెంట్స్‌ ప్రక్రియ ప్రారంభం.. భారీగా స్టయిపండ్‌ అందిస్తున్న కంపెనీలు

Published date : 18 Nov 2021 06:57PM

Photo Stories