Skip to main content

కేంద్ర ప్రభుత్వం - ఉపరాష్ర్టపతి

భారత రాజ్యాంగ రచనా సంఘం.. మొదట ఉప రాష్ర్టపతి పదవిని పేర్కొనలేదు. అయితే రాష్ర్టపతి మరణించినప్పుడు లేదా సెలవులో ఉన్నప్పుడు లేదా విధులు నిర్వర్తించే పరిస్థితి లేనప్పుడు కొత్త రాష్ర్టపతి ఎన్నికయ్యే వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంటులోని సభాధ్యక్షులు ఒక కమిషన్‌గా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగించాలని రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారైన బి.ఎన్.రావు సూచించారు. ఆ తర్వాత జరిగిన చర్చల్లో హెచ్.పి.కామత్ తదితరులు ఉప రాష్ర్టపతి పదవిని ఏర్పాటు చేయడానికి కృషి చేశారు.
ఉప రాష్ర్టపతి - రాజ్యాంగ స్థానం
భారత రాజ్యాంగంలో 5వ భాగంలో, ప్రకరణ 63 నుంచి 69 వరకు ఉప రాష్ర్టపతికి సంబంధించి సమగ్ర వివరణ ఉంది. ఈ పదవిని అమెరికా ఉపాధ్యక్ష పదవితో పోల్చవచ్చు.ప్రకరణ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ర్టపతి ఉంటారు.

ఉప రాష్ట్రపతి ఎన్నిక
ప్రకరణ 66(1) ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సభ్యులు (నామినేట్ సభ్యులతో సహా) నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదలాయింపు పద్ధతిలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. మౌలిక రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఉపరాష్ర్టపతిని ఎన్నుకునే ఏర్పాటు ఉండేది. 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను మార్చారు. ఉభయ సభలు వేర్వేరుగా ఓటేస్తాయి.

అయితే రాష్ర్టపతి ఎన్నిక మాదిరిగా ఓటు విలువను లెక్కించరు. ప్రతి ఓటరు విలువ ఒకటికి సమానం. మొత్తం ఓట్ల విలువ 790 (లోక్‌సభ సభ్యులు 545 మంది + రాజ్యసభ సభ్యులు 245 మంది).

ప్రత్యేక వివరణ: ఉప రాష్ర్టపతి ఎన్నికలో రాష్ర్ట విధానసభ సభ్యులు పాల్గొనరు. దీనికి కారణం.. ఉప రాష్ర్టపతి అధికార బాధ్యతలు ప్రధానంగా రాజ్యసభకు అధ్యక్షత వహించడం వరకే పరిమితం.

రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి ఎన్నిక ప్రక్రియలో పోలికలు
రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి ఎన్నిక ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. ఎన్నుకొనే నియోజక గణంలో మాత్రమే తేడా ఉంటుంది. పార్లమెంటులో ఎన్నికైన సభ్యులు, రాష్ర్ట విధాన సభలకు ఎన్నికైన సభ్యులు రాష్ర్టపతి ఎన్నికలో ఓటర్లుగా ఉంటారు. కానీ, ఉపరాష్ర్టపతి ఎన్నికలో పార్లమెంటు సభ్యులు మాత్రమే పాల్గొంటారు.

ఉప రాష్ర్టపతి ఎన్నిక వివాదాలు: ప్రకరణ 71లో ఈ అంశాలను ప్రస్తావించారు. రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతికి ఈ నిబంధనలు సమానంగా వర్తిస్తాయి.

ఉప రాష్ర్టపతి - అర్హతలు: ప్రకరణ 66(3)లో ఉపరాష్ర్టపతి అర్హతలు పేర్కొన్నారు.
భారతీయ పౌరుడై ఉండాలి.
35 ఏళ్లు నిండి ఉండాలి.
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన ఇతర అర్హతలుండాలి.
షరతులు: ఉప రాష్ర్టపతి పదవికి పోటీచేస్తున్న అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని, ఉప రాష్ర్టపతిని ఎన్నుకొనే నియోజకగణంలోని 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి. మరో 20 మంది బలపర్చాలి. అలాగే రూ.15,000 ధరావతు చెల్లించాలి.
పదవీ కాలం: ప్రకరణ 67 ప్రకారం, ఉప రాష్ర్టపతి పదవిలోకి ప్రవేశించిన రోజు నుంచి 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఎన్ని పర్యాయాలైనా పోటీ చేయొచ్చు.
పదవీ ప్రమాణ స్వీకారం: ప్రకరణ 69 ప్రకారం పదవిని చేపట్టే ముందు ఉపరాష్ర్టపతి ప్రమాణం చేయాలి. దీన్ని రాష్ర్టపతి నిర్వహిస్తారు. ఒకవేళ రాష్ర్టపతి లేకపోతే వారు సూచించిన వ్యక్తి జరిపిస్తారు.

ఉప రాష్ర్టపతి పదవి - ఖాళీ ఏర్పడే పద్ధతి
కింది సమయాల్లో ఉపరాష్ర్టపతి పదవి ఖాళీ అవుతుంది.
పదవీకాలంపూర్తయినప్పుడు.
రాజీనామా చేసినప్పుడు. (ఉపరాష్ర్టపతి రాజీనామా పత్రాన్ని రాష్ర్టపతికి అందిస్తారు).
ఉప రాష్ర్టపతిని తొలగించినప్పుడు, మరణించినప్పుడు.
సుప్రీంకోర్టు ఉప రాష్ర్టపతి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పినప్పుడు.

తొలగించే పద్ధతి: ప్రకరణ 67(బి)లో పేర్కొన్న పద్ధతి ప్రకారం ఉప రాష్ర్టపతిని తొలగిస్తారు. ఈ పద్ధతికి, మహాభియోగ తీర్మాన ప్రక్రియకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఓ సాధారణ తొలగింపు ప్రక్రియ మాత్రమే. ఉప రాష్ర్టపతి తొలగింపునకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రత్యేక కారణాలను ప్రస్తావించలేదు. కానీ, ‘రాజ్యాంగ ఉల్లంఘన’ అనే కారణం మీద ఉప రాష్ర్టపతిని తొలగించవచ్చు. తొలగించేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని మొదట.. రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇందులో భాగంగా 14 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఈ తీర్మానానికి రాజ్యసభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపి, తర్వాత దాన్ని లోక్‌సభ కూడా ఆమోదిస్తే ఉపరాష్ర్టపతి పదవీచ్యితుడు అవుతాడు.
గమనిక: ఇంత వరకు ఈ పద్ధతిలో ఒక్క ఉపరాష్ర్టపతిని కూడా తొలగించలేదు.

జీతభత్యాలు: ఉప రాష్ర్టపతికి ప్రత్యేక జీతభత్యాలు ఉండవు. ప్రకరణ 97 ప్రకారం రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతభత్యాలను అందుకుంటాడు. వీటిని పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఉప రాష్ర్టపతి.. నెలకు రూ.1,25,000 వేతనంతోపాటు ఇతర సౌకర్యాలు కూడా పొందుతున్నారు.పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం కూడా ఉంది.

ఉప రాష్ర్టపతి అధికారాలు
ఉప రాష్ర్టపతికి రెండు ముఖ్యమైన అధికారాలు ఉంటాయి.
రాజ్యసభకు హోదా రీత్యా అధ్యక్షుడిగా వ్యవహరించడం (ప్రకరణ 64 ప్రకారం).
తాత్కాలిక రాష్ర్టపతిగా వ్యవహరించడం (ప్రకరణ 65).

ఉప రాష్ర్టపతి హోదా రీత్యా రాజ్యసభకు అధ్యక్షుడు. ఈ హోదాలోనే రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. పార్లమెంట్ సంస్థలతో రాజ్యసభ జరిపే ఉత్తర-ప్రత్యుత్తరాలన్నీ ఉప రాష్ర్టపతి పేరు మీదేజరుగుతాయి. ఉప రాష్ర్టపతి రాజ్యసభలో సభ్యుడు కాదు. అందువల్ల ఆయనకు సాధారణ ఓటుహక్కు ఉండదు. కానీ, బిల్లుకు అనుకూల, వ్యతిరేక ఓట్లు సమానంగా వచ్చినప్పుడు.. నిర్ణాయిక ఓటుహక్కును వినియోగిస్తాడు.

ప్రకరణ 65 ప్రకారం కొన్ని సందర్భాల్లో ఉపరాష్ర్టపతి.. రాష్ర్టపతిగా వ్యవహరిస్తాడు. అవి.. రాష్ర్టపతి పదవి ఖాళీ అయినప్పుడు (మరణం, తొలగింపు, రాజీనామా) గరిష్టంగా 6 నెలలకు మించకుండా లేదా కొత్త రాష్ర్టపతి ఎన్నికయ్యేవరకు రాష్ర్టపతిగా కొనసాగుతాడు.

ప్రకరణ 65(2) ప్రకారం రాష్ర్టపతి అనివార్య కారణాల వల్ల తన విధులను నిర్వర్తించలేకపోతే.. ఉప రాష్ర్టపతి ఆ విధులను నిర్వర్తిస్తాడు. దీనికి నిర్ణీత గడువు ఉండదు.

ఉదా: జ్ఞానీ జైల్‌సింగ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉప రాష్ర్టపతిగా ఉన్న హిదాయతుల్లా 25 రోజుల పాటు రాష్ర్టపతి విధులను నిర్వహించారు. ఉప రాష్ర్టపతి.. రాష్ర్టపతిగా వ్యవహరిస్తున్నప్పుడు లేదా ఆ విధులను నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు రాష్ర్టపతికి ఉన్న అన్ని అధికారాలు, జీతభత్యాలు, సౌకర్యాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఉప రాష్ర్టపతి.. రాజ్యసభ చైర్మన్‌గా కొనసాగ కూడదు.

ఉప రాష్ర్టపతి పైన పేర్కొన్న విధులనే కాకుండా కొన్ని రాజ్యాంగేతర విధులను కూడా నిర్వర్తిస్తారు. భారతరత్న, పద్మ అవార్డుల కమిటీకి అధ్యక్షుడిగా, దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు. రాజ్యాంగ పరంగా ఉప రాష్ర్టపతి.. రాష్ర్టపతి తర్వాత స్థానాన్ని (ద్వితీయ) కలిగుంటాడు.

ఉప రాష్ర్టపతి స్థానం
రాజ్యాంగ పరంగా ఉపరాష్ర్టపతికి ఎక్కువ అధికారాలు, విధులు సంక్రమించలేదు. అమెరికా ఉపాధ్యక్షునితో పోలిస్తే భారత ఉపరాష్ర్టపతి పదవి చాలా అప్రధానమైంది. అమెరికాలో అనుకోకుండా అధ్యక్ష పదవి ఖాళీ అయితే మిగిలిన పాలనా కాలానికి అమెరికా ఉపాధ్యక్షుడే.. అధ్యక్షునిగా వ్యవహరిస్తాడు. కానీ, భారతదేశంలో ఉపరాష్ర్టపతి గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే రాష్ర్టపతిగా వ్యవహరించగలడు.

టి.కె.తోపే అనే రచయిత ఉపరాష్ర్టపతిని వేల్స్ యువరాజుతో పోల్చాడు. రచయిత మాటల్లో ప్రధానమంత్రి, రాష్ర్టపతి ఎన్నో సమస్యల పరిష్కార విషయంలో ఉపరాష్ర్టపతిని సంప్రదిస్తారు. ఆయన పరిపక్వత, దూరదృష్టి వారికి లాభదాయకంగా ఉంటాయి. రాజ్యాంగం రాష్ర్టపతికిచ్చినంత గొప్ప గౌరవం ఇవ్వకపోయినా.. ఉపరాష్ర్టపతి పదవి ప్రతిష్టాత్మకమైనదేనని ఎం.వి.పైలీ అనే రాజ్యాంగ నిపుణుడు పేర్కొన్నాడు.
Published date : 06 Feb 2017 01:55PM

Photo Stories