Skip to main content

భారత రాష్ట్రపతులు - ప్రత్యేకతలు

ప్రభుత్వాలు తమ విధి నిర్వహణను మూడు వ్యవస్థల ద్వారా కొనసాగిస్తాయి. వీటిలో రెండోది కార్యనిర్వాహక శాఖ. మన రాజ్యాంగం కేంద్ర, రాష్ర్ట స్థాయిల్లో ప్రత్యేక కార్యనిర్వాహక వ్యవస్థలను ఏర్పాటు చేసింది.
రాజ్యాంగంలోని ఐదో భాగంలో 52 నుంచి 78 వరకు గల అధికరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తాయి. ఇందులోకి రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, అటార్నీ జనరల్ వస్తారు.

రాష్ర్టపతి
రాష్ర్టపతి రాజ్యాంగాధినేత, ప్రధాన కార్యనిర్వాహణాధికారి. ప్రథమ పౌరుడు. సర్వసైన్యాధ్యక్షుడు. అధికరణ 52 ప్రకారం భారతదేశానికి రాష్ర్టపతి ఉంటాడు. ఈయనే అత్యున్నత వ్యక్తి. అధికరణ 53 ప్రకారం దేశ పరిపాలనను రాష్ర్టపతి ప్రత్యక్షంగా నిర్వహించవచ్చు (లేదా) తన కింది అధికారుల ద్వారా నిర్వహించవచ్చు. రాష్ట్రపతికి సాయపడేందుకు అధికరణ 74(1) ప్రకారం ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది.

రాష్ర్టపతి పదవీ కాలం:
అధికరణ 56 ప్రకారం రాష్ర్టపతి పదవీకాలం ఐదేళ్లు. ఏదైనా కారణం వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఆరు నెలల లోపు కొత్త రాష్ర్టపతిని ఎన్నుకోవాలి. అధికరణ 57 ప్రకారం ఒక వ్యక్తి రాష్ర్టపతిగా ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. రాజ్యాంగం ప్రకారం పరిమితులు లేవు. కానీ మొదటి రాష్ర్టపతి రాజేంద్రప్రసాద్ ద్వారా రెండు సార్లు అనే సంప్రదాయం ఏర్పడింది. రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ర్టపతికి/సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి/సీనియర్ న్యాయమూర్తికి సమర్పించవచ్చు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు కూడా తెలియజేయాలి.

రాష్ర్టపతి వేతనం, భత్యాలు:
ఆర్టికల్ 59 ప్రకారం రాష్ర్టపతి వేతన, భత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. వేతన, భత్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే అవకాశంలేదు. ప్రస్తుతం రాష్ర్టపతి వేతనం రూ.1,50,000. దీన్ని రూ.5,00,000కు పెంచాలని ప్రతిపాదించారు. ఉచిత నివాసం, ఇతర సౌకర్యాలు ఉంటాయి.
రాష్ర్టపతి భవన్ రూపశిల్పి ఎడ్విన్ లుటెయన్‌‌స. ఇది ఢిల్లీలో ఉంది. రాష్ట్రపతికి హైదరాబాద్‌లో శీతాకాల, సిమ్లాలో వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. ఆయన పదవీకాలంలోని చర్యలపై ఏ న్యాయస్థానంలోనూ దావా వేయరాదు.

రాష్ర్టపతి తొలగింపు-మహాభియోగ తీర్మానం
రాష్ర్టపతి తొలగింపు పద్ధతిని అమెరికా నుంచి స్వీకరించారు. రాష్ర్టపతి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రమే ఆయన్ను తొలగించవచ్చు. ఇతర కారణాల ద్వారా తొలగించే అవకాశం లేదు. మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఇందుకు ఆ సభ సభ్యుల్లో 1/4వ వంతు మంది మద్దతుతో 14 రోజుల ముందు నోటీసు జారీ చేయాలి. అనంతరం ఈ తీర్మానంపై చర్చ జరుగుతుంది. తర్వాత జరిపిన ఓటింగ్‌లో 2/3 మెజారిటీతో ఆమోదిస్తే రెండో సభకు పంపిస్తారు. రెండో సభ కూడా 2/3 మెజార్టీతో తీర్మానిస్తే రాష్ర్టపతి.. పదవి కోల్పోతాడు.
మహాభియోగ తీర్మాన ప్రక్రియ కొనసాగుతున్నపుడు రాష్ర్టపతి పదవిలో కొనసాగవచ్చు. రాష్ర్టపతి చేత పార్లమెంటుకు నియమితులైనసభ్యులకు ఈ ప్రక్రియలో ఓటు హక్కు ఉంటుంది. విధాన సభ సభ్యులకు ఓటు హక్కు లేదు.

భారత రాష్ర్టపతులు
1. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్(1950 జనవరి 26 నుంచి 1962 మే 13 వరకు): ఈయన స్వరాష్ర్టం బిహార్. రాష్ట్రపతి పదవికి ఈయనతో పోటీ పడి ఓడిపోయినవారు ప్రొఫెసర్ కె.టి.షా (1952), ఎస్.ఎస్.దాస్(1957). రెండు సార్లు రాష్ర్టపతి అయిన ఏకైక వ్యక్తి. అత్యధిక మెజార్టీతో ఎన్నికైన రాష్ట్రపతి. ఈ పదవిలో అత్యధిక కాలం కొనసాగారు. ఎక్కువ సార్లు సుప్రీంకోర్టు సలహా కోరిన రాష్ర్టపతి. ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన మొదటి వ్యక్తి. ఈయన రాసిన ప్రధాన గ్రంథం ‘ఇండియా డివెడైడ్’.

2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962 మే 13 నుంచి 1967 మే 13 వరకు): తమిళనాడుకు చెందినవారు. ఈయన చేతిలో ఓడిపోయిన వ్యక్తి సి.హెచ్.హరిరామ్. ఉపరాష్ర్టపతిగా చేసి రాష్ర్టపతి అయిన మొదటి వ్యక్తి. రాయబారిగా చేసి రాష్ర్టపతి అయ్యారు. 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో రాష్ర్టపతిగా కొనసాగారు. ఈయన రాసిన ప్రధాన గ్రంథాలు.. ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్.

3. జాకీర్ హుస్సేన్(1967 మే 13 నుంచి 1969 మే 3 వరకు): ఉత్తరప్రదేశ్ వాసి. పదవిలో కొనసాగుతూ మరణించిన మొదటి రాష్ర్టపతి. ఈ పదవిలో అతి తక్కువ కాలం ఉన్నారు. ఉపరాష్ర్టపతిగా చేసి రాష్ర్టపతి అయిన రెండో వ్యక్తి. ఈయన చేతిలో ఓడిపోయినవారు జస్టిస్ కోకా సుబ్బారావు.
  • వీవీ గిరి(1969 మే 3 నుంచి 1969 జూలై 20 వరకు): ఒడిశా వాసి. తొలి తాత్కాలిక రాష్ర్టపతి. ఉపరాష్ర్టపతిగా ఉంటూ తాత్కాలిక రాష్ర్టపతి అయిన మొదటి వ్యక్తి.
  • జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా(1969 జూలై 20 నుంచి 1969 ఆగస్టు 24): తాత్కాలిక రాష్ర్టపతిగా చేసిన ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ర్టపతి అయిన రెండో వ్యక్తి. తాత్కాలిక రాష్ర్టపతిగా తక్కువ కాలం పని చేశారు.

4. వీవీ గిరి(1969 ఆగస్టు 24 నుంచి 1974 ఆగస్టు 24 వరకు): అతి తక్కువ మెజార్టీ ద్వారా, ఓటు బదలాయింపు ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రాష్ర్టపతి అయిన ఏకైక వ్యక్తి. ఎన్నికల వివాదంలో సుప్రీంకోర్టుకు ప్రత్యక్షంగా హాజరైన రాష్ర్టపతి. కార్మిక నేతగా చేసి రాష్ర్టపతి అయ్యారు. ఉపరాష్ర్టపతిగా చేసి రాష్ర్టపతి అయిన మూడో వ్యక్తి. ఈయన చేతిలో ఓడిపోయినవారు నీలం సంజీవరెడ్డి.

5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్(1974 ఆగస్టు 24 నుంచి 1977 ఫిబ్రవరి 11 వరకు): స్వరాష్ర్టం అసోం. రెండో ముస్లిం రాష్ర్టపతి. ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన, ఈ పదవిలో ఉండగా చనిపోయిన రెండో వ్యక్తి. ఎమర్జెన్సీ సమయంలో రాష్ర్టపతిగా కొనసాగారు. ఈయన చేతిలో ఓడిపోయినవారు టి. చతుర్వేది.
  • బి.డి.జెట్టి(1977 ఫిబ్రవరి 11 నుంచి 1977 జూలై 25 వరకు): కర్ణాటక వాసి. ఎక్కువ కాలం తాత్కాలిక రాష్ర్టపతిగా పనిచేశారు. ఉపరాష్ర్టపతిగా ఉండి తాత్కాలిక రాష్ర్టపతి అయిన రెండో వ్యక్తి.

6. నీలం సంజీవరెడ్డి(1977 జూలై 25 నుంచి 1982 జూలై 25 వరకు):
ఆంధ్రప్రదేశ్ వాసి. ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ర్టపతి. స్పీకర్‌గా చేసి రాష్ర్టపతి అయిన ఏకైక వ్యక్తి. ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన మూడో వ్యక్తి. జనతా ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు రాజ్యాంగ ప్రక్రియను పాటించలేదనే విమర్శ ఉంది.

7. జ్ఞానీ జైల్ సింగ్(1982 ఏప్రిల్ 25 నుంచి 1987 జూలై 25 వరకు):
పంజాబ్ వాసి. ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన నాలుగో వ్యక్తి. మొదటి బీసీ రాష్ర్టపతి. ప్యాకెట్ విటో అధికారం ఉపయోగించుకున్న ఏకైక రాష్ర్టపతి (పోస్టల్ బిల్లు విషయంలో). 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీని ప్రధానమంత్రి చేసే విషయంలో రాజ్యాంగ ప్రక్రియను పాటించలేదనే విమర్శ ఉంది.

8. ఆర్.వెంకట్రామన్(1987 జూలై 25 నుంచి1992 జూలై 25 వరకు):
తమిళనాడు వాసి. ఉపరాష్ర్టపతి నుంచి రాష్ర్టపతి అయిన నాలుగో వ్యక్తి. ఎక్కువ మంది ప్రధానులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 1989లో జరిగిన 9వ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీ నాయకుణ్ని ప్రధానిగా నియమించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఇతని ప్రధాన గ్రంథం ‘మై ప్రెసిడెన్సియల్ ఇయర్‌‌స’.

9. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ(1992 జూలై 25 నుంచి 1997 జూలై 25 వరకు):
స్వరాష్ర్టం మధ్యప్రదేశ్. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా చేసి రాష్ర్టపతి అయ్యారు. ఉపరాష్ర్టపతి పదవి నుంచి రాష్ర్టపతిగా పదోన్నతి పొందిన ఐదో వ్యక్తి. వివాదాస్పద దళిత క్రైస్తవ రిజర్వేషన్ల బిల్లుపై విటో చేసిన రాష్ర్టపతి. ఈయన చేతిలో ఓడిపోయినవారు జార్‌‌జస్వెల్.

10. కె.ఆర్‌నారాయణన్ (1997 జూలై 25 నుంచి 2002 జూలై 25 వరకు):
కేరళ వాసి. ఉపరాష్ర్టపతి నుంచి రాష్ర్టపతి అయిన ఆరో వ్యక్తి. ఓట్ల సంఖ్య పరంగా అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యారు. తొలి దళిత రాష్ర్టపతి. విదేశీ రాయబారిగా చేసి రాష్ర్టపతి అయిన రెండో వ్యక్తి. సాధారణ పౌరునిగా లోక్‌సభ ఎన్నికలో ఓటేసిన రాష్ర్టపతి. మైనార్టీల పట్ల జరిగిన దాడులపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వ సిఫారసులను పునఃపరిశీలనకు పంపారు. అమెరికా ప్రభుత్వం నుంచి బెస్ట్ స్టేట్స్‌మెన్ అవార్డు పొందారు. ఈయన చేతిలో ఓడిపోయినవారు టీఎన్ శేషన్.

11. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం(2002 జూలై 25 నుంచి 2007 జూలై 25 వరకు):
స్వరాష్ర్టం తమిళనాడు. ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన ఐదో వ్యక్తి. రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ర్టపతిగా ఎన్నికైన మొట్టమొదటివారు. రాష్ర్టపతిభవన్‌ను ప్రజాదర్బార్‌గా మార్చిన రాష్ర్టపతి. భారతదేశ క్షిపణుల పితామహునిగా పేరుగాంచారు. రాష్ర్ట శాసన ఎన్నికల్లో ఓటుహక్కు ఉపయోగించుకున్న ఏకైక రాష్ర్టపతి. జోడు పదవుల బిల్లును పునఃపరిశీలనకు పంపిన రాష్ర్టపతి. ఈయన జన్మదినమైన అక్టోబర్ 15ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. తమిళనాడు ప్రభుత్వం యువతను మేల్కొలిపే దినోత్సవంగా ప్రకటించింది. ఈయన రాసిన ప్రధాన గ్రంథం ‘వింగ్‌‌స ఆఫ్ ఫైర్’. కలాం చేతిలో ఓడిపోయినవారు కెప్టెన్ లక్ష్మీ సెహగల్.

12. ప్రతిభా పాటిల్(2007 జూలై 25 నుంచి 2012 జూలై 25 వరకు):
మహారాష్ర్టకు చెందినవారు. ఏకైక మహిళా రాష్ర్టపతి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా, గవర్నర్‌గా చేసి రాష్ర్టపతి అయ్యారు. ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన ఆరో వ్యక్తి. రాష్ర్టపతిగా అత్యధిక విదేశీ పర్యటనలు చేశారు. ప్రజాధనాన్ని అధికంగా ఖర్చు పెట్టారు. గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన కోకా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు తిరస్కరించారు. ఈమె చేతిలో ఓడిపోయినవారు భైరాన్‌సింగ్ షెకావత్.

13. ప్రణబ్ ముఖర్జీ(2012 జూలై 25 నుంచి 2017 జూలై 25 వరకు):
పశ్చిమ బంగా వాసి. ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన ఏడో వ్యక్తి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేశారు. కేంద్ర ఆర్థిక, వాణిజ్య, సమాచార శాఖల మంత్రిగా; రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేసి రాష్ర్టపతి అయ్యారు. 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. ఉగ్రవాదులు అఫ్జల్‌గురు, కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌లను తిరస్కరించారు.

14. రామ్‌నాథ్ కోవింద్(2017 జూలై నుంచి..):

స్వరాష్ర్టం ఉత్తరప్రదేశ్. రాష్ర్టపతిగా ఎన్నికైన రెండో దళితుడు. రాజ్యసభ సభ్యునిగా, బిహార్ గవర్నర్‌గా చేసి రాష్ర్టపతి అయ్యారు. ఈయన 15వ రాష్ట్రపతి ఎన్నికలద్వారా ఎన్నికైన 14వ రాష్ర్టపతి. ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన 8వ వ్యక్తి. ఈయన చేతిలో ఓడిపోయినవారు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్.
Published date : 10 Aug 2017 05:07PM

Photo Stories