Skip to main content

UPSC Civils 18th Ranker Wardah Khan Sucess Story: 23 ఏళ్ల వయసులోనే సివిల్స్‌కు ఎంపిక.. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలివే

UPSC Civils 18th Ranker Wardah Khan Sucess Story

యు.పి.ఎస్‌.సి. 2023 ఫలితాల్లో టాప్‌ 25 ర్యాంకుల్లో 10 మంది మహిళా అభ్యర్థులున్నారు. భిన్న జీవనస్థాయుల నుంచి వీరంతా మొక్కవోని పట్టుదలతో పోరాడి ఇండియన్‌ సివిల్‌ సర్వీసుల్లో సేవలు అందించేందుకు ఎంపికయ్యారు. 18వ ర్యాంకు సాధించిన 23 ఏళ్ల వార్దా ఖాన్‌ సివిల్స్‌ కల కోసం కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. సొంతగా ఇంట్లో ప్రిపేర్‌ అవుతూ గతంలో ర్యాంక్‌ సాధించిన విజేతలతో స్ఫూర్తిపొందింది. నోయిడాలోని ఆమె ఇలాకా ఇప్పుడు సంతోషంతో మిఠాయిలు పంచుతోంది.

సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతుండగా వార్దా ఖాన్‌ను ‘మాక్‌ ఇంటర్వ్యూ’లో ఒక ప్రశ్న అడిగారు– ‘నువ్వు సోషియాలజీ చదివావు కదా. సమాజంలో మూడు మార్పులు తేవాలనుకుంటే ఏమేమి తెస్తావు’ అని. దానికి వార్దా ఖాన్‌ సమాధానం 1.స్త్రీల పట్ల సమాజానికి ఉన్న మూస అభి్రపాయం మారాలి. వారికి అన్ని విధాల ముందుకెళ్లడానికి సమానమైన అవకాశాలు కల్పించగల దృష్టి అలవడాలి. 2. దేశ అభివృద్ధిలో గిరిజనులకు అన్యాయం జరిగింది. వారి సంస్కృతిని గౌరవిస్తూనే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. 3. దేశానికి ప్రమాదకరంగా మారగల మత వైషమ్యాలను నివారించాలి. ‘నా మెయిన్‌ ఇంటర్వ్యూ కూడా ఇంతే ఆసక్తికరంగా సాగింది’ అంటుంది వార్దా. నోయిడాకు చెందిన వార్దా ఖాన్‌ రెండో అటెంప్ట్‌లోనే సివిల్స్‌ను సాధించింది. 18వ ర్యాంక్‌ సాధించి సగర్వంగా నిలుచుంది.

ఇంటి నుంచి చదువుకుని..
వార్దాఖాన్‌ది నోయిడాలోని వివేక్‌ విహార్‌. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభ చూపిన వార్దా వక్తృత్వ పోటీల్లో మంచి ప్రతిభ చూపేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఆ వెంటనే కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగానికి చేరినా ఆమెకు అది సంతృప్తి ఇవ్వలేదు. ప్రజారంగంలో పని చేసి వారికి సేవలు అందించడంలో ఒక తృప్తి ఉంటుందని భావించి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవసాగింది. అయితే అందుకు నేరుగా కోచింగ్‌ తీసుకోలేదు.

Top 10 Female Candidates In UPSC Civil Services: సివిల్స్‌లో సత్తా చాటిన శివంగులు.. టాప్‌-10లో ఆరుగురు అమ్మాయిలు

 

కొన్ని ఆన్‌లైన్‌ క్లాసులు, ఆ తర్వాత సొంత తర్ఫీదు మీద ఆధారపడింది. అన్నింటికంటే ముఖ్యం గతంలో ర్యాంకులు సాధించిన విజేతల వీడియోలు, వారి సూచనలు వింటూ ప్రిపేర్‌ అయ్యింది. ‘సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యేటప్పుడు ఆందోళన, అపనమ్మకం ఉంటాయి. విజేతల మాటలు వింటే వారిని కూడా అవి వేధించాయని, వారూ మనలాంటి వారేనని తెలుస్తుంది. కనుక ధైర్యం వస్తుంది’ అని తెలిపింది వార్దాఖాన్‌.

ఏకాంతంలో ఉంటూ ‘సివిల్స్‌కి ప్రిపేర్‌ అవ్వాలంటే మనం లోకంతో మన సంబంధాలు కట్‌ చేసుకోవాలి. నాకు నలుగురితో కలవడం, మాట్లాడటం ఇష్టం. కాని దానివల్ల సమయం వృథా అవుతుంది. సివిల్స్‌కు ప్రిపేర్‌ అయినన్నాళ్లు ఇతరులతో కలవడం, సోషల్‌ మీడియాలో ఉండటం అన్నీ మానేశాను. అయితే మరీ బోర్‌ కొట్టినప్పుడు ఈ సిలబస్‌ ఇన్నిగంటల్లో పూర్తి చేయగలిగితే అరగంట సేపు ఎవరైనా ఫ్రెండ్‌ని కలవొచ్చు అని నాకు నేనే లంచం ఇచ్చుకునేదాన్ని. అలా చదివాను’ అని తెలిపిందామె.

పది లక్షల మందిలో..
2023 యు.పి.ఎస్‌.సి పరీక్షల కోసం 10,16,850 మంది అభ్యర్థులు అప్లై చేస్తే వారిలో 5,92,141 మంది ప్రిలిమ్స్‌ రాశారు. 14,624 మంది మెయిన్స్‌లో క్వాలిఫై అయ్యారు. 2,855 మంది ఇంటర్వ్యూ వరకూ వచ్చారు. 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పురుషులు 352 మంది స్త్రీలు. ఇంత పోటీని దాటుకుని వార్దా ఖాన్‌ 18 వ ర్యాంకును సాధించిందంటే ఆమె మీద ఆమెకున్న ఆత్మవిశ్వాసమే కారణం. ‘మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా కష్టపడితే కచ్చితంగా సివిల్స్‌ సాధించవచ్చు’ అని తెలుపుతోందామె. ఆమె ఐ.ఎఫ్‌.ఎస్‌ (ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌)ను తన మొదటి ్రపాధాన్యంగా ఎంపిక చేసుకుంది. ‘గ్లోబల్‌ వేదిక మీద భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచేసి దౌత్య సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించడమే నా లక్ష్యం’ అంటోంది వార్దా.
 

Published date : 18 Apr 2024 11:58AM

Photo Stories