UPSC Exam: యూపీఎస్సీలో వైద్య కొలువులు... అర్హతలు, పరీక్ష వివరాలు ఇవే..
- నవంబర్ 21న ఆన్‌లైన్‌లో సీఎంఎస్‌ఈ పరీక్ష
- కేంద్రంలో 838 మెడికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షలకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సివిల్స్‌తోపాటు పలు కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ ప్రతి ఏటా నియామక ప్రక్రియ చేపడుతుంది. వీటిల్లో ముఖ్యమైంది.. కంబైన్డ్æ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్(సీఎంఎస్‌ఈ). ఈ ఏడాది వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 838 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. జూలైలో వెలువడిన సీఎంఎస్‌ఈ 2021 నోటిఫికేషన్‌కు దాదాపు మూడు లక్షల మంది మెడికల్ గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకున్నారు. వీరికి నవంబర్ 21న పరీక్ష నిర్వహించన్నునట్టు కమిషన్ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. సీఎంఎస్‌ఈ–2021 పరీక్షా విధానం, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం..
యూపీఎస్సీ– సీఎంఎస్‌ఈలో ప్రతిభ చూపిన అభ్యర్థులను వివిధ కేంద్ర విభాగాల్లో మెడికల్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా కేంద్ర హెల్త్ సర్వీసెస్‌లో 349 జూనియర్ స్కేల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు; రైల్వేలో 300 అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు; న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో 05 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు; ఈస్ట్, నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 184 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్–2 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు
కంబైన్డ్ మెడికల్ సర్వీస్ పరీక్ష రాసేందుకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు అర్హులు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు రాసినవారు సైతం దరఖాస్తు చేసుకొని ఉంటే సీఎంఎస్ పరీక్షకు హాజరుకావచ్చు. వయసు 32ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
500 మార్కులకు పరీక్ష
సీఎంఎస్‌ఈ పరీక్ష రెండు దశల్లో నిర్వహిస్తారు. ఇందులో మొదటి దశ.. ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 250 మార్కుల చొప్పున ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం 2గంటలు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి రెండో దశలో పర్సనల్ ఇంటర్వ్యూ 100 మార్కులకు నిర్వహిస్తారు. అంటే రెండు దశలు కలిపి మొత్తం 600 మార్కులకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
నెగెటివ్ మార్కులు
ఆబ్జెక్టివ్ తరహా పేపర్లలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/3 మార్కు కోత విధిస్తారు. అభ్యర్థులు అటెంప్ట్ చేయని ప్రశ్నకు ఎలాంటి మార్కులు తగ్గించరు. ఒకవేళ ఒక ప్రశ్నకు రెండు జవాబులు గుర్తిస్తే.. అందులో సరైన జవాబు ఉన్నప్పటికీ.. తప్పుగా గుర్తించిన సమాధానాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని..నెగిటివ్ మార్కులు వేస్తారు. కాబట్టి అభ్యర్థులు కచ్చితంగా సరైన సమాధానం తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబు గుర్తించడం ద్వారా మంచి మార్కులు స్కోరు చేయవచ్చు.
సీఎంఎస్‌ఈ పేపర్–1
మొదటి పేపర్‌లో జనరల్ మెడిసిన్ నుంచి 96 ప్రశ్నలు, పీడియాట్రిక్స్ నుంచి 24 ప్రశ్నలు.. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 250 మార్కులు కేటాయించారు. పరీక్ష రెండు గంటల్లో పూర్తి చేయాలి.
సీఎంఎస్‌ఈ పేపర్–2
ఇది కూడా పేపర్–1 తరహాలోనే 120 ప్రశ్నలు– 250 మార్కులకు ఉంటుంది, అయితే సిలబస్ కాస్త ఎక్కువ. ఇందులో సర్జరీ విభాగం నుంచి 40 ప్రశ్నలు, గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెస్ట్రిక్స్ నుంచి 40, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు.
పర్సనల్ ఇంటర్వ్యూ
మొదటి దశలో రెండు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థి జనరల్ నాలెడ్జ్, మెడికల్ సబ్జెక్టులు, నాయకత్వ లక్షణాలు, చొరవ, అప్రమత్తత, సామాజిక సమన్వయ సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే తీరు తదితర అంశాలను పరీక్షిస్తారు. ఆబ్జెక్టివ్ తరహా పేపర్లు, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in
చదవండి: NTSE Exam: ఎన్‌టీఎస్‌ఈ... ఆర్థిక తోడ్పాటునందించే స్కాలర్‌షిప్ పరీక్ష!