UPSC-CGSE – 2022: గనుల్లో ఘనమైన కొలువు
- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2022కు నోటిఫికేషన్
- కేంద్ర గనులు, జల వనరుల శాఖల్లో ఉన్నత స్థాయి కొలువులు
- ఎంపిక ప్రక్రియలో మూడు దశలు (ప్రిలిమ్స్,మెయిన్, ఇంటర్వూ)
- తుది విజేతలుగా నిలిస్తే.. గ్రూప్–ఏ స్థాయి కొలువు
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్.. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ, జల వనరుల మంత్రిత్వ శాఖల్లో ఉన్న స్పెషలైజ్డ్ పోస్ట్‌ల భర్తీకి యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్ష. మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తుంది. అవి.. ప్రిలిమినరీ(స్టేజ్–1) ఎగ్జామినేషన్, మెయిన్(స్టేజ్–2) పరీక్ష, స్టేజ్–3 పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ).
మొత్తం పోస్టుల సంఖ్య 192
- కేటగిరీ–1: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో మొత్తం 170 పోస్టులు భర్తీ చేయనున్నారు. అవి.. జియాలజిస్ట్–పోస్ట్‌ల సంఖ్య: 100; జియో ఫిజిసిస్ట్–పోస్ట్‌ల సంఖ్య: 50; కెమిస్ట్–పోస్ట్‌ల సంఖ్య: 20.
- కేటగిరీ–2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, జల్‌శక్తి శాఖ, జల వనరుల శాఖ, నదీ అభివృద్ధి–గంగా పునరుద్ధరణ విభాగాల్లో మొత్తం 22 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు.. సైంటిస్ట్–బీ(హైడ్రాలజీ)–పోస్ట్‌ల సంఖ్య: 20; సైంటిస్ట్–బీ(కెమికల్)– పోస్ట్‌ల సంఖ్య: 1; సైంటిస్ట్–బీ(జియో ఫిజిక్స్)–పోస్ట్‌ల సంఖ్య: 1.
అర్హతలు
- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
- జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జియాలజిస్ట్ పోస్టులకు: జియోలాజికల్ సైన్స్ /జియాలజీ/అప్లయిడ్ జియాలజీ/జియో ఎక్స్‌ప్లొరేషన్/మినరల్ ఎక్స్‌ప్లొరేషన్/ ఇంజనీరింగ్ జియాలజీ/మెరైన్ జియాలజీ/ఎర్త్ సైన్సెస్ అండ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ఓషనోగ్రఫీ అండ్ కోస్టల్ ఏరియా స్టడీస్/పెట్రోలియం జియో సైన్సెస్/జియో కెమిస్ట్రీ స్పెషలైజేషన్లలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
- కేటగిరీ–1లోని జియో ఫిజిసిస్ట్, కేటగిరీ–2లోని జియోఫిజిక్స్ సైంటిస్ట్–బీ పోస్ట్‌లకు: ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/జియో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ లేదా ఎక్స్‌ప్లొరేషన్ జియో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ/ఎమ్మెస్సీ అప్లయిడ్ జియో ఫిజిక్స్/ఎమ్మెస్సీ మెరైన్ జియో ఫిజిక్స్/ఎమ్మెస్సీ టెక్(అప్లయిడ్ జియో ఫిజిక్స్)ల్లో ఉత్తీర్ణత సాధించాలి.
- కేటగిరీ–1లోని కెమిస్ట్, కేటగిరీ–2లోని సైంటిస్ట్–బీ(కెమికల్) పోస్ట్‌లకు: కెమిస్ట్రీ లేదా అప్లయిడ్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
- కేటగిరీ–2లోని హైడ్రాలజీ సైంటిస్ట్ పోస్ట్‌లకు: జియాలజీ/అప్లయిడ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ/హైడ్రో జియాలజీల్లో పీజీ పూర్తి చేయాలి.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి అభ్యర్థులు మెయిన్ పరీక్షల దరఖాస్తు సమయానికి కోర్సు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
- అర్హతలుంటే.. అభ్యర్థులు రెండు కేటగిరీల పోస్ట్‌లకు కూడా పోటీ పడొచ్చు. సదరు అభ్యర్థులు మెయిన్ పరీక్ష సమయంలో డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్‌లో పోస్ట్‌ల ప్రాథమ్యాల్ని పేర్కొనాల్సి ఉంటుంది.
మూడంచెల ఎంపిక ప్రక్రియ
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడంచెలుగా ఉంటుంది. స్టేజ్–1లో ప్రిలిమినరీ, స్టేజ్–2లో మెయిన్ నిర్వహిస్తారు. ఈ రెండింటిలోనూ విజయం సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు చివరగా పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా ఖరారు చేస్తారు.
ప్రిలిమినరీ ఇలా
- ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఆయా పోస్ట్‌ల అభ్యర్థులకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు.
- పేపర్–1కు 100 మార్కులు, పేపర్–2కు 300 మార్కులు కేటాయించారు.
- పేపర్–1 జనరల్ స్టడీస్ కాగా, పేపర్–2 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు సంబంధించిన సబ్జెక్ట్ పేపర్.
- పరీక్ష సమయం ప్రతి పేపర్‌కు రెండు గంటలు.
- నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 1/3 వంతు మార్కు తగ్గిస్తారు.
మెయిన్ పరీక్ష
- ప్రిలిమినరీలో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీల్లోని పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి.. ఒక్కో పోస్ట్‌కు ఆరు లేదా ఏడుగురిని మెయిన్‌కు ఎంపిక చేస్తారు.
- మెయిన్ పరీక్షను పూర్తిగా సంబంధిత సబ్జెక్ట్ పేపర్లతో డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
- ఒక్కో సబ్జెక్ట్‌కు సంబంధించి మూడు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం ప్రతి పేపర్‌కు మూడు గంటలు.
- జియాలజిస్ట్ పోస్ట్‌లకు జియాలజీ నుంచి మూడు పేపర్లు ఉంటాయి.
- జియో ఫిజిసిస్ట్, జియోఫిజిక్స్(సైంటిస్ట్–బీ) పోస్ట్‌లకు జియో ఫిజిక్స్‌పై మూడు పేపర్లు ఉంటాయి.
- కెమిస్ట్, సైంటిస్ట్–బీ(కెమికల్) పోస్ట్‌లకు కెమిస్ట్రీ నుంచి మూడు పేపర్ల్లలో పరీక్ష నిర్వహిస్తారు.
- సైంటిస్ట్–బీ హైడ్రాలజీ పోస్ట్‌లకు జియాలజీ నుంచి రెండు పేపర్లు(పేపర్–1,పేపర్–2), హైడ్రాలజీ నుంచి ఒక పేపర్(పేపర్–3)ఉంటాయి.
పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ
మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఆయా విభాగాల్లోని ఖాళీల సంఖ్యను అనుసరించి.. ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు చొప్పున(1:2 నిష్పత్తి) పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ దశలో.. అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నైపుణ్యాలతోపాటు వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన, దృక్పథం తదితర అంశాలను పరిశీలిస్తారు.
గెలుపు వ్యూహాలు
- మూడు దశలుగా జరిగే..కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు ప్రిలిమినరీæనుంచే నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేయాలి.
- ప్రిలిమినరీ పరీక్షలోని జనరల్ స్టడీస్ పేపర్ కోసం జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సమకాలీన అంశాలు, భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, పాలిటీ, పరిపాలన, ఎకానమీ, సామాజిక అభివృద్ధి, పర్యావరణం, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు, జనరల్ సైన్స్‌లో ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలి.
- సబ్జెక్ట్ పేపర్ అయిన పేపర్–2 కోసం.. అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్‌కు సంబంధించి.. పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్, వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ.. చదివితే మెరుగైన ఫలితం పొందొచ్చు.
మెయిన్‌తో అనుసంధానం
అభ్యర్థులు ప్రిలిమినరీలోని పేపర్–2ని, మెయిన్ పరీక్షతో అనుసంధానం చేసుకుంటూ.. ప్రిపరేషన్ సాగించాలి. మెయిన్‌లోని మూడు పేపర్లు కూడా అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించినవే ఉంటాయి. దీంతో ప్రిలిమినరీ దశ నుంచే సబ్జెక్ట్ పేపర్‌ను మెయిన్ కోణంలో విశ్లేషణాత్మకంగా, డిస్క్రిప్టివ్ విధానంలో చదవాలి. తద్వారా ఒకే సమయంలో ప్రిలిమ్స్ పేపర్–2(సబ్జెక్ట్ పేపర్)తో పాటు, మెయిన్‌కు కూడా సన్నద్ధత లభిస్తుంది. ప్రిలిమినరీ తర్వాత మెయిన్‌కు నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో సిలబస్‌కు అనుగుణంగా వెయిటేజీని గుర్తిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. గత ప్రశ్న పత్రాల పరిశీలనతోపాటు, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా మెయిన్‌లో మంచి స్కోర్ సొంతం చేసుకోవచ్చు.
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్– 2022 సమాచారం
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 21–32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 12, 2021
దరఖాస్తు ఉపసంహరణ: అక్టోబర్ 20 నుంచి 26 వరకు.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 20 ఫిబ్రవరి, 2022
మెయిన్ పరీక్ష తేదీలు: 2022 జూన్ 25, 26
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.upsc.gov.in
ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://upsconline.nic.in
కంబైన్డ్ జియో సైంటిస్ట్ పరీక్ష
ప్రిలిమినరీ పరీక్ష
పేపర్ | మార్కులు | సమయం |
పేపర్–1(జనరల్ స్టడీస్) | 100 | 2 గం |
పేపర్–2(సబ్జెక్ట్ పేపర్) | 300 | 2 గం |
మొత్తం మార్కులు | 400 |
మెయిన్ (సంబంధిత సబ్జెక్ట్)
పేపర్ | మార్కులు | సమయం |
పేపర్–1 | 200 | 3 గంటలు |
పేపర్–2 | 200 | 3 గంటలు |
పేపర్–3 | 200 | 3 గంటలు |
మొత్తం మార్కులు | 600 |
పర్సనాలిటీ టెస్ట్: 200 మార్కులు
- మొత్తం 1200 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది(స్టేజ్1+స్టేజ్2 +స్టేజ్3)
- జనరల్ కేటగిరీ అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్‌లో 40 నుంచి 45శాతం మార్కులు సాధించేలా కృషి చేస్తే పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
- మొత్తం 1200 మార్కులకుగాను 60 శాతం మార్కులు సొంతం చేసుకునేలా సన్నద్ధత పొందాలి.
- గత రెండు, మూడేళ్ల ఫైనల్ కటాఫ్‌లను పరిశీలిస్తే.. జనరల్ కేటగిరీలో 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులకు నియామకాలు ఖరారైనట్లు స్పష్టమవుతోంది.