TSPSC Paper Leak : మా అమ్మ 'పూసలతాడు' అమ్మేసి.. కొచింగ్ తీసుకున్నా.. ఇప్పుడు నా పరిస్థితి..
ఎన్నాళ్లగానో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు.. షడ్రుచుల ఉగాది ఒట్టి చేదునే పంచుతోంది. వేలాది మంది తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడటం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్‌తో తమ ఏళ్ల తరబడి కష్టం వృథా అయిందంటూ కుమిలిపోతున్నారు.
మా అమ్మా.. నాకు నౌకరొస్తుందని..
‘అమ్మా.. నాకు నౌకరొస్తుంది. మన కష్టాలు తొలగిపోతాయమ్మా’.. భువనగిరికి చెందిన శ్రీశైలం కొద్దికాలం క్రితం తన తల్లికి చెప్పిన మాటలివి. శ్రీశైలం ఎల్‌ఎల్‌బీ చదివాడు. టెట్ అర్హతా పొందాడు. అతని తండ్రి సన్నకారు రైతు. అయినా కొడుకు గ్రూప్–1 కోచింగ్ కోసం అప్పు చేసి మరీ డబ్బులు పంపాడు. తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందనే నమ్మకం వారిలో ఉండేది. టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసిన శ్రీశైలంలోనూ ఆ ధైర్యం నెలకొంది. కానీ ఇప్పుడు అతనిలో భయం, ఆందోళన కన్పిస్తున్నాయి. ‘పర్లేదులేయ్యా.. ఇంకేదైనా ఉద్యోగం చూసుకోవచ్చు..’ అని తండ్రి బుజ్జగిస్తుంటే తట్టుకోలేకపోతున్నానంటూ బావురుమన్నాడు.
నా తల్లికి వచ్చిన కూలీ డబ్బుతో.. కొచింగ్ తీసుకున్నా..
వరంగల్ జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన సంజయ్‌కుమార్‌ది దయనీయ స్థితి. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి కూలీ పని చేస్తోంది. ఆమె కూడా దీర్ఘకాల వ్యాధికి గురైంది. ఆ విషయాన్ని కొడుకు దగ్గర దాచి పెట్టింది. పీజీ చేసిన కొడుకుకు మంచి ఉద్యోగం వస్తుందనేది ఆమె ఆశ. మందులకు వాడాల్సిన సొమ్మును కొడుకు కోచింగ్ కోసం పంపేది. సంజయ్ కూడా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ మరీ గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యాడు. మెయిన్స్ దాకా వచ్చాడు. ప్రిలిమ్స్ పరీక్ష రద్దవ్వడంతో దిగాలుపడ్డాడు. ‘నాకు ఉద్యోగం కాదు.. అమ్మ కష్టం గుర్తుకొస్తోంది’ అంటూ గుండె పగిలేలా ఏడ్చాడు.
ముఖ్యంగా గ్రూప్–1 కోచింగ్ కోసం చేసిన అప్పులు, కుదవబెట్టిన ఆస్తులు గుర్తుకొచ్చి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అమ్మానాన్నల కలలు చెదిరిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయంటూ తల్లడిల్లిపోతున్నారు. చిన్నా చితక ఉద్యోగాలొదిలిపెట్టి, ఉన్న ఉపాధిని కోల్పోయి.. సర్కారీ కొలువే లక్ష్యంగా కఠోర దీక్ష బూనిన నిరుపేద నిరుద్యోగుల బరువెక్కిన గుండెల్లోంచి ఆవేదన ఉప్పొంగుతోంది. దిగాలు పడ్డ పిల్లలను ఓదార్చేందుకు తమ వద్ద మాటల్లేవంటున్న తల్లిదండ్రుల వ్యథ వర్ణనాతీతంగా ఉంది.
అమ్మ పుస్తెను అమ్మేసి.. కొచింగ్ తీసుకున్నా..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నీలేశ్ మాటలు గుండెను పిండేసేలా ఉన్నాయి. ‘30 ఏళ్ల క్రితం మీ అమ్మకు కట్టిన పుస్తె కొడుకా.. అమ్మేసి ఇస్తున్నా. ఉద్యోగం తెచ్చుకో బిడ్డా..’ అంటూ కోచింగ్‌కు డబ్బులిచ్చేప్పుడు తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గుక్క తిప్పుకోకుండా ఏడ్చాడు. ఇప్పుడేం చేయాలి? అంటూ నిస్సహాయంగా ప్రశ్నించాడు.
☛➤ KTR : ఈ టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు.. మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. అలాగే అన్ని..
ఉద్యోగం పోయింది.. భరోసా కరువయింది..
ఎమ్మెస్సీ చేసిన ప్రశాంతి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో మేథ్స్ లెక్చరర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 50 వేలకు పైనే సంపాదించేది. ప్రభుత్వ నోటిఫికేషన్ల తర్వాత ఉన్న ఉద్యోగం వదిలేసింది. ఏడాదిగా గ్రూప్స్‌పైనే దృష్టి పెట్టింది. మెయిన్స్‌కు అర్హత సాధించింది. పరీక్ష రద్దవ్వడంతో ఏమీ పాలుపోని స్థితిలో ఉంది. ఇప్పుడామె గర్భిణి కూడా. ‘పుట్టబోయే బిడ్డ కోసం దుఃఖాన్ని దిగమింగుతున్నా. మళ్లీ సన్నద్ధమవ్వడం కష్టమే..’ అంటూ కన్నీటి పర్యంతమైంది.
☛ TSPSC Paper Leak 2023 : టీఎస్‌పీఎస్సీ 26 నోటిఫికేషన్లు.. 20 పరీక్షలకు పైగా రద్దు..?
చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బుతో..
పీజీ తర్వాత భద్రాచలానికి దగ్గర్లోని ఓ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగం తెచ్చుకున్నాడు వీరబోయిన నరేంద్ర. తండ్రి చనిపోవడంతో ఇంటికి పెద్ద దిక్కడయ్యాడు. కానీ గ్రూప్స్ కోసం ఉద్యోగం మానేసి హైదరాబాద్‌లో కోచింగ్ కోసం వచ్చాడు. చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బు ఖర్చు చేశాడు. ‘ఇప్పుడు ప్రభుత్వ కొలువు ఎండమావిగా మారింది. ఉన్న ఇంటిని అమ్మేయడమే దిక్కు’ అంటూ వాపోయాడు.
ఎవరిని కదిపినా..ఉప్పొంగే ఆవేదనతోనే..
టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లతో లక్షలాది మంది నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇళ్ళను వదిలేసి, వ్యక్తిగత బాధలన్నీ పక్కన బెట్టి కొలువు కొట్టే లక్ష్యంతో లక్షల మంది కోచింగ్ కేంద్రాల బాట పట్టారు. ఇంకొందరు ఇళ్లల్లోనే ఉండి చదువుతూ బయటి ప్రపంచాన్ని మరిచిపోయారు. నిద్రాహారాలు మానుకుని పరీక్షల కోసం సన్నద్ధమయ్యారు.
అయోమయ జీవితంలో..
ఈ దశలో బాంబులా పేలింది..రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్. తీగలాగితే డొంక కదిలినట్టు ఒక పరీక్షతో ఆగిపోలేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్ సహా ఏకంగా నాలుగు పరీక్షలు రద్దు అయ్యాయి. మరో రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. నిరుద్యోగ యువతలో అయోమయాన్ని నింపాయి.
ఉన్న భూమిని అమ్మి..
మెడలోని పుస్తెనో, ఇంట్లోని గొర్రెనో.. బర్రెనో.. ఉన్న కుంట భూమినో.. తాతల నుంచి వచ్చిన ఇంటినో అమ్మేసి కన్న బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరై పోయాయి. మళ్లీ గ్రూప్–1కు సన్నద్ధమవడమనే ఊహే వారిని తీవ్రంగా బాధిస్తోంది. ఊహించని ఈ పరిణామంపై ‘సాక్షి’ వారి ప్రతిస్పందన కోరినప్పుడు.. ఎంతో ఆందోళన..ఆవేదన, మరెంతో నిరాశా నిస్పృహలు వారిలో స్పష్టంగా కన్పించాయి.
అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తాననే నమ్మకం పోయింది..
నా పేరు కాదిరాబంద్ పాండు. మాది సంగారెడ్డి జిల్లా ఆందోల్. నాన్న చనిపోతే అమ్మే కూలి పనిచేసి పెంచింది. ఎంఏ చేసినా ఇంకా అమ్మకు భారంగానే ఉన్నా. టీఎస్‌పీఎస్సీ పరీక్షల ద్వారా ఉద్యోగం వస్తుందని, అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తాననే నమ్మకం తగ్గిపోతోంది. పరీక్షల పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా?
పరీక్ష రద్దుతో మనసు కకావికలం అయిపోయింది.. మళ్లీ ఎలా..?
నా పేరు దుర్గం శ్రావణి. మాది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కష్టపడి బీఎస్సీ, బీఈడీ చేశా. గ్రూప్స్ కోసం మూడేళ్లు కష్టపడ్డా. నేను, నా స్నేహితులు నిద్రహారాలు మానేసి చదివాం. పరీక్ష రద్దు మనసు కకావికలం అయిపోయింది. మళ్లీ ఎలా సన్నద్ధమవ్వాలో అర్ధం కావడం లేదు.
లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి..
మాది మహబూబ్‌నగర్ జిల్లా. నా పేరు సంధ్య. గ్రూప్–1 అభ్యర్థి. కొంతకాలంగా ఇంటివద్ద పిల్లల్ని సైతం వదిలేసి.. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ పరీక్షకు సిద్ధమవుతున్నా. ఈ సమయంలో పరీక్ష రద్దు చేయడం బాధించింది. లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి. మాలాంటి వారిని ఆదుకోవాలి. ఈసారైనా పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయాలి.
నష్టపోయిన వారికి చేయూతనివ్వాలి..
నా పేరు చెన్నగాని దయాకర్ గౌడ్. పీహెచ్‌డీ విద్యార్థి. మాది నల్లగొండ జిల్లా నకిరేకల్. కోచింగ్ కోసం ఉన్నవన్నీ అమ్ముకుని వచ్చిన వాళ్ళున్నారు. తప్పు ప్రభుత్వానిదైతే శిక్ష పరీక్ష రాసిన వాళ్లెందుకు అనుభవించాలి? దరఖాస్తు చేసిన వారికి ప్రభుత్వం ఆర్థిక పరమైన చేయూతనివ్వాలి.