Skip to main content

Telangana Job Calendar 2024:అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad Chief Minister Revanth Reddy speaking about job recruitment  Hyderabad CM Revanth Reddy addressing the delay in job recruitment examinations  CM Revanth Reddy announcing planned job appointments  State legislature budget meeting announcement by Hyderabad CM Telangana Job Calendar 2024 అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana Job Calendar 2024:అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: గత పదేళ్లలో ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో జాప్యంతో నిరుద్యోగు­లు తీవ్రంగా నష్టపోయారని  సీఎం రేవంత్‌రెడ్డి అన్నా­రు. ఇకపై అలా జరగకుండా యూపీఎస్సీ తరహాలో ఏటా ప్రణాళికాబద్ధంగా కేలండర్‌ తేదీల ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుపుతామని చెప్పారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లోనే జాబ్‌ కేలండర్‌ను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల నుంచి ప్రతి ఖాళీని మార్చి 31లోగా తెప్పించుకుని జూన్‌ 2లోగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని అన్నారు. ఎన్ని ఖాళీలున్నా డిసెంబర్‌ 9 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 

శనివారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి ఏటా సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు ఎంపికయ్యే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల్లో అర్హులకు సింగరేణి సంస్థ రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుంది. అభ్యర్థులు సింగరేణి సంస్థ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రారంభ కార్యక్రమంలో 2023 సివిల్స్‌ విజేతలు, 2024లో మెయిన్స్‌ రాసే అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఇదీ చదవండి:  Union Budget 2024: ఆర్థిక సర్వే, బడ్జెట్‌ మధ్య తేడా ఏమిటంటే..

నిరుద్యోగుల బాధ నా కళ్లతో చూశా.
‘రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల సమస్యలను పరిష్కరించడమే మా ప్రభుత్వ తొలి పాధాన్యత. మా ప్రభుత్వం బాధ్యతలను స్వీకరించిన తర్వాత 90 రోజుల్లోగా 30 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. దీనిని బట్టి మా ప్రభుత్వ ప్రాధాన్యతను నిరుద్యోగ యువత అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో ఏ నోటిఫికేషన్‌ పరీక్షలు కూడా నిర్దేశిత సమయానికి జరగలేదు. 

ఉజ్వల భవిష్యత్తు ఆలోచనలతో యువత అమీర్‌పేట్, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లలోని కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటే సంవత్సరాల తరబడి పరీక్షలు వాయిదా పడ్డాయి. తీరా పరీక్షలు జరిగి ఫలితాలు వచ్చేసరికి ప్రశ్నపత్రాల లీకు వ్యవహారంతో నిరుద్యోగులు పడిన బాధ, భావోద్యేగాన్ని నా కళ్లతో చూశా. దీంతో యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి దాని తరహాలో టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించాం. 

యూపీఎస్సీ తరహాలో వెనువెంటనే నోటిఫికేషన్లు ఇచ్చాం. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను విజయవంతంగా నిర్వహించాం. గ్రూప్‌–2 పరీక్షలు గ్రూప్‌–3తో కలిపి నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయాన్ని పాటిస్తాం. మా ప్రభుత్వ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఏ సంస్థపైనా ఎలాంటి ఆరోపణలూ రాలేదు. నిరుద్యోగ అభ్యర్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తే ప్రభుత్వం వారిని వ్యక్తిగతంగా కలుస్తుందని, వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందనే సందేశం ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించాం. నిరుద్యోగ యువతలో నమ్మకం, విశ్వాసం కల్పించడం మా బాధ్యత..’అని సీఎం పేర్కొన్నారు. 

కేంద్ర కొలువులపైనా దృష్టి పెట్టాలి 
‘నిరుద్యోగ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, సివిల్స్, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ వంటి వాటిపై సైతం దృష్టి సారించాలి. సివిల్స్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించి తెలంగాణ కేడర్‌ను తీసుకుని రాష్ట్ర ప్రజలకు సేవలు చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి అఖిల భారత సర్వీసు పోస్టుల్లో తెలంగాణ యువత ఎక్కువగా అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రాష్ట్రానికి నిధులు, ఇతర ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపేటప్పుడు అక్కడ తెలంగాణ అధికారులు ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది..’అని రేవంత్‌ చెప్పారు.  

అభ్యర్థులకు ఆర్థిక తోడ్పాటే లక్ష్యం: భట్టి  
సివిల్స్‌ తరహా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం వ్యయ ప్రయాసలతో కూడిన అంశమని, సీఎం రేవంత్‌ చొరవతో.. అలాంటి పరీక్షలు రాసే అభ్యర్థులకు ఆర్థిక తోడ్పాటును అందించడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి తరఫున దీనిని చేపట్టడం అభినందనీయమన్నారు. 

2023లో రాష్ట్రం నుండి సివిల్స్‌కు ఎంపికైన 35 మంది అభ్యర్థులను, ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన ఆరుగురిని ఈ సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్‌ రావు, సీఎస్‌ శాంతికుమారి, సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

Published date : 22 Jul 2024 12:48PM

Photo Stories