Groups Syllabus: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ రద్దు.. సిలబస్‌లో కీలక మార్పులు..?
నిర్దేశించిన పోస్టులకు ఇప్పటివరకు ఇంటర్వ్యూలతో కలిపి అర్హతల నిర్ధారణ జరిగేది. కానీ ప్రస్తుతం మౌఖిక పరీక్షల భాగాన్ని ప్రభుత్వం తొలగించడంతో పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు తర్జనభర్జన పడుతున్నాయి. ఇంటర్వ్యూల రద్దుతో ఆ భాగానికి (పార్ట్) నిర్దేశించిన మార్కులు తొలగించాలా? లేక ఆ మార్కులను రాత పరీక్షలో కలపాలా? అనే అంశంపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు ఇంటర్వ్యూ తొలగింపుపై విద్యారంగ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం.
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
రెండు కేటగిరీల్లోనే కాదు.. ఇంకా..
ఇంటర్వ్యూల నిర్వహణ కేవలం గ్రూప్ ఉద్యోగాలకే పరిమితం కాలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలతో పాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టే వైద్యుల నియామకాలు, తెలంగాణ గురుకుల నియామకాల బోర్డు ద్వారా ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి, తదితరాలకు కూడా ఇంటర్వ్యూలు ఉన్నాయి. మరోవైపు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డెమో పరీక్షలు (తరగతి గదిలో పాఠాలు చెప్పడం) నిర్వహిస్తున్నారు. ఈ డెమో పరీక్షలు కూడా ఇంటర్వ్యూ విధానంలోకే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియలో పలు రకాల మార్పులు అనివార్యం కానున్నట్లు స్పష్టమవుతోంది.
Groups: గ్రూప్–1&2లో ఉద్యోగం సాధించడం ఎలా ?
ఈ పరీక్ష తప్పనిసరి..
తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు, వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహించే వైద్యుల నియామకాల్లో కొన్నింటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అర్హతలు నిర్ధారించుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ రద్దు చేస్తే ఈ నియామకాలకు అర్హత పరీక్ష తప్పనిసరి కానుంది. దీంతో వారికి ప్రత్యేకంగా సిలబస్‌ను రూపొందించి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు తెలంగాణ గురుకుల నియామకాల బోర్డు ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ప్రిన్స్‌పల్, జేఎల్, డీఎల్ నియామకాల ప్రక్రియలోనూ మార్పులు తప్పవని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంటర్వ్యూ, డెమోకు బదులుగా ఇతర కేటగిరీల్లో వారి సామర్థ్యాలను పరిశీలించాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం.
నియామకాల్లో వేగం పెంచడంతో పాటు..
వివిధ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూలకు సగటున అరగంట సమయం పడుతున్నట్లు బోర్డుల వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గ్రూప్–1 కేటగిరీలో 503 పైగా ఉద్యోగాలున్నాయి. మెయిన్ పరీక్షల అనంతరం 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిస్తే 1,509 మందిని ఇంటర్వ్యూ చేయాలి. ఒక్కో అభ్యర్థిని అరగంట చొప్పున రోజుకు కనీసం 25 మందిని ఇంటర్వ్యూ చేసినా ఈ ప్రక్రియ పూర్తికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఇక గ్రూప్–2 కేటగిరీలో పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వేలల్లో అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటర్వ్యూల నిర్వహణ నియామక సంస్థలకు భారంగా మారుతోంది. ఈ పరిస్థితిని నివారించడం ద్వారా నియామకాల్లో వేగం పెంచడంతో పాటు అవకతకవకలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?
రాత పరీక్షలో..
గ్రూప్–1 ఉద్యోగ నియామకాల్లో ప్రస్తుతం మూడు అంచెల్లో నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు 900 మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కులున్నాయి. ఇంటర్వ్యూ రద్దుతో 100 మార్కులు తొలగించినప్పటికీ.. ఇంటర్వ్యూకు నిర్దేశించిన సిలబస్‌ను రాత పరీక్షలో కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాత పరీక్ష సిలబస్‌లో మార్పులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతమున్న సిలబస్‌ను 2015లో విషయ పరిజ్ఞానం ఉన్న నిష్ణాతులతో కూడిన కమిటీ నిర్ణయించింది. ఇక గ్రూప్–2 నియామకాలకు పార్ట్–ఏ కింద ఆబ్జెక్టివ్ విధానంలో నాలుగు పేపర్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు 600 మార్కులు ఉన్నాయి. పార్ట్–బీలో ఇంటర్వ్యూకు 75 మార్కులున్నాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూకు మినహాయింపు ఇవ్వనుండడంతో అందుకు సంబంధించిన మార్కులు తొలగించి నాలుగు పేపర్లకు నిర్దేశించిన సిలబస్‌కు మరిన్ని అంశాలు అదనంగా జోడించే అవకాశం ఉంది.
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
ఈ అపోహలు..
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయడం మంచి పరిణామమే. ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యవహారశైలి, కమ్యూనికేషన్ సామర్ధ్యంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని నేరుగా పరిశీలిస్తారు. కానీ చాలా మందిలో ఇంటర్వ్యూలపై అక్రమాలు జరుగుతాయని, పైరవీలకు ఆస్కారం ఉంటుందనే అపోహలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అపోహలు తొలగిపోతాయి. కేవలం మెరిట్ ఆధారంగా పూర్తి పారదర్శకంగా నియామకాలు జరుగుతాయనే నమ్మకం పెరుగుతుంది. అయితే అర్హత సాధించిన అభ్యర్థికి నియామక పత్రం ఇచ్చే ముందు జరిగే వైద్య పరీక్ష పక్కాగా నిర్వహిస్తే బాగుంటుంది.
– ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, ప్రిన్స్‌పాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ
అన్ని కేటగిరీల్లో ..
రాష్ట్రస్థాయిలో ఉన్నత ఉద్యోగం అంటే గ్రూప్–1. ఈ నియామకాల్లో మౌఖిక పరీక్షలు ఉండడమే మంచిది. గ్రూప్–1 అధికారిపైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, శాఖాపరమైన కార్యక్రమాల నిర్వహణలో అతని పనితనం తెలియాలంటే అన్ని కేటగిరీల్లో అతని సామర్థ్యాలు పరిశీలించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా అన్ని పరీక్షల్లో సామర్థ్యాలను చూడాలి. పైరవీల పేరిట సామర్థ్యాల పరిశీలనను కుదించడంతో సరైన అభ్యర్థుల ఎంపిక సాధ్యమవుతుందా అనేది ఆలోచించాలి. సివిల్స్‌లో ఇంటర్వ్యూ తప్పనిసరనే విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి.
– ప్రొఫెసర్ ఎన్.కిషన్, హెచ్‌ఓడీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఓయూ
వయోపరిమితి ఇలా..
☛ ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
☛ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
☛ దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
☛ ఎక్స్ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
☛ హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు
Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!
ఈ ఏడాది (2022) తెలంగాణలో భర్తీ చేయనున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..:
➤ గ్రూప్-1 పోస్టులు: 503
➤ గ్రూప్-2 పోస్టులు : 582
➤ గ్రూప్-3 పోస్టులు: 1,373
➤ గ్రూప్-4 పోస్టులు : 9,168
Telangana: భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్కడి నుంచి చదవాల్సిందే..