Skip to main content

Youth Declaration: యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: డా ఆంజనేయ గౌడ్‌

మారుమూల గ్రామాల నుంచి కలల మూటలు మోసుకొనొచ్చి, సర్కార్‌ కొలువుల కోసం పుస్తకాలతో పెనుగులాడే యువలోకానికి ఎన్నో బాసలు చేసింది హస్తం పార్టీ. ఆర్ట్స్‌ కాలేజీ ముందు రేవంత్‌ రెడ్డి నుంచి మొదలుకొని, అశోక్‌ నగర్‌లో రాహుల్‌ గాంధీ వరకూ కాంగ్రెస్‌ నాయకులందరూ ఉద్యోగాల ఉట్టి కొడతామని నమ్మబలికారు. చివరికి సరూర్‌ నగర్‌ స్టేడియంలో ప్రియాంక గాంధీతో ‘యూత్‌ డిక్లరేషన్‌’ పేరిట తెలంగాణ రాష్ట్ర యువతకు నిర్దిష్టమైన హామీలిచ్చారు.
promises given to the youth should be fulfilled

ఆనాటి యువ సంఘర్షణ సభలో యూత్‌ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ యువతకు వ్రాసిస్తున్న బాండ్‌ పేపర్‌గా రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. కాకమ్మ కథలు కాదనీ, కమిట్‌మెంట్‌కు నిదర్శనంగా యూత్‌ డిక్లరేషన్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేసి చూపిస్తామనీ ప్రియాంక గాంధీని సాక్షిగా పెట్టి నమ్మబలికారు. ఆ సభ ఉపన్యాసాలను నేడు నిరుద్యోగులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ, కాంగ్రెస్‌ వైఖరిని నిలదీస్తున్నారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు కొత్తగా ఏవీ కోరడం లేదు. విపక్ష పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన ఉద్యోగాలనే భర్తీ చేయమని కోరుతున్నారు. ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ కొలువులను భర్తీ చేస్తామనీ, గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో 1:100 విధానంలో క్వాలిఫై చేస్తామనీ, 4 వేల నిరుద్యోగ భృతి ప్రతి నెలా అందజేస్తామనీ హస్తం పార్టీ అధిష్టానమే హామీ ఇచ్చింది కదా? వాటితో పాటు మెగా డీఎస్సీ, నిరుద్యోగులకు రూ. 10 లక్షల వడ్డీలేని రుణాలు, ఉద్యమ అమరుల కుటుంబాలకు నెలనెలా 25 వేల పింఛన్లు, బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీ... ఇలా ఎన్నో హామీలను రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది.

చదవండి: 1180 AEE Jobs: ఏఈఈ (సివిల్‌) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా ప్రకటించండి

వాటి కోసమే ఏడు నెలలు ఎదురుచూసిన తర్వాత, నేడు యువలోకం నిలదీస్తున్నది. గురుకులాల ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ ప్రక్రియలో మళ్ళీ బ్యాక్‌ లాగ్‌లు మిగలకుండా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

వీటి కోసం అడిగీ, అడిగీ, ఏడు నెలలుగా హస్తం పార్టీ ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి, ప్రయోజనం లేకనే నిరుద్యోగులు ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమిస్తున్నారు. మోతీలాల్‌ నాయక్‌ వంటి వారు నిరాహార దీక్షకు దిగుతున్నారు.

వినతిపత్రాలు చెత్త బుట్టల పాలై, కోదండరాం కానరాక, మల్లన్న మర్లి చూడక, ధర్నా చౌక్‌లో దినా రాత్రులు నినదించినా కనీసం పట్టించుకునే నాథుడే లేకపోవడంతో, పోరు దారి తప్ప మరో దారి లేక నవతరం నడిరోడ్డుపై నిలబడి నినదిస్తున్నది.

నమ్మిన నిరుద్యోగులను కనీసం పిలిపించుకొని చర్చించే తీరిక కూడా కాంగ్రెస్‌ సర్కార్‌కు లేకపోడాన్ని ఏమనాలి? పరాయి పార్టీ ఎంఎల్‌ఏ లపై చూపుతున్న ప్రేమలో, పదోవంతు కూడా ప్రభుత్వం అప్పగించిన యువతరంపై ప్రదర్శించడం లేదు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ నిజరూప దర్శనం యువలోకానికి కనువిప్పు కలిగించింది.

ఊరించిన నోరే వెక్కిరించినట్లుగా మెగా డీఎస్సీ పేరుతో ఆర్భాటం చేసి, తీరా కేవలం 11వేల ఖాళీలు చూపెట్టడం మోసం కాదా? గ్రూప్‌–2 నోటిఫికేషన్‌కు అదనంగా 2 వేలు, గ్రూప్‌–3 నోటిఫికేషన్‌కు మరో 3 వేల ఉద్యోగ ఖాళీలను కలిపి భర్తీ చేపట్టాలని లక్షలాది నిరుద్యోగులు కోరుతున్నారు.

లక్షలాది మంది నిరుద్యోగుల నినాదాలుగా మారిన వీటిని అన్యాయమైన డిమాండ్‌లు అని సర్కార్‌ భావిస్తున్నట్లున్నది.

రాజకీయ అంశాలపై తప్ప, రాష్ట్ర వర్తమాన అంశాలపై లోతైన దృష్టి కోణమే కనుమరుగైపోయింది. మాసాలు గడుస్తున్నా వీసీల నియామకం లేక, ఇంఛార్జీల ఏలుబడిలో విశ్వవిద్యాలయాలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. గురుకులాల నుంచి వర్సిటీల వరకూ అన్ని విద్యాసంస్థలూ సమస్యల వలయంలోకి జారుకుంటున్నాయి. అవగాహన లేమితోనో లేక నిర్లక్ష్యంతోనో గానీ కాంగ్రెస్‌ సర్కార్‌ విద్యార్థి, యువజనులతో చెలగాటమాడుతున్నది. ఇది సరికాదు. ఇప్పటికైనా వారికిచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో కార్యాచరణ చేపట్టాలి.
– డా. ఆంజనేయ గౌడ్‌, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ మాజీ ఛైర్మన్‌, 9885352242

Published date : 05 Jul 2024 09:53AM

Photo Stories