Skip to main content

TS Inter Supplementary Exam 2024: నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

TS Inter Supplementary Exam 2024   Intermediate Advanced Supplementary Examinations

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,989 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, ఫ్యాన్లు ఇతర సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అధికారులను ఆదేశించారు. కొన్నేళ్లుగా ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధిస్తుండగా.. ఇటీవల విడుదలైన ఫలితాలు మాత్రం కొంత నిరాశ పరిచాయి. మొదటి సంవత్సరంలో 4,570 మంది హాజరు కాగా.. 2,813 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెకండియర్‌ పరీక్షలకు 4,095 మంది హాజరు కాగా 2,951 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు
ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, తెలంగాణ మోడల్‌ స్కూ ల్‌తోపాటు కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియ ర్‌ కళాశాల, వసుంధర జూనియర్‌ కళాశాల, జైనూర్‌, కౌటాల, తిర్యాణి, రెబ్బెన మండలాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Staff Nurse: సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామకాలు.. మూడు నెలలైనా అందని మొదటి జీతం

జిల్లాలోని 48 జూనియర్‌ కళాశాలలకు చెందిన 2,989 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారు. ఇందులో ఫస్టియర్‌ విద్యార్థులు 1,938, సెకండియర్‌ 1,051 మంది ఉన్నారు. జనరల్‌ విభాగంలో 2,680 మంది, ఒకేషనల్‌ విభాగంలో 309 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

ఈనెల 24 నుంచి జూన్‌ 3 వరకు..
ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు జూన్‌ 3 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో కేవలం ఎనిమిది కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడంతో విద్యార్థులు దూరభారంతో ఇబ్బంది పడనున్నారు.

కెరమెరి, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌ మండలాల విద్యార్థులు జైనూర్‌కు వెళ్లాల్సి ఉండగా.. వాంకిడి మండలం వారు ఆసిఫాబాద్‌కు.. బెజ్జూర్‌, సిర్పూర్‌(టి), చింతలమానెపల్లి మండలాల నుంచి కౌటాలకు.. దహెగాం మండలం విద్యార్థులు కాగజ్‌నగర్‌ పట్టణానికి వెళ్లి పరీక్షలు రాయాలి.

May 27th Holiday : మే 27వ తేదీన‌ సెల‌వు.. ఎందుకంటే..?

పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతోనే 30 కిలో మీటర్ల పరిధిలో ఒక సెంటర్‌ ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం 1, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందం 1, ఇన్విజిలేటర్లు 40 మందిని నియమించారు. http s://tsbie.cgg.gov.in నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

విద్యార్థులు గంట ముందే చేరుకోవాలి
ఇంటర్‌ పరీక్షలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాం. సొంత మండలాల్లో కేంద్రాలు లేని వారు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోనేలా ప్లాన్‌ చేసుకోవాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం, కొన్నిచోట్ల సౌకర్యాలు లేకపోవడంతో పరీక్ష కేంద్రాలు 30 కిలోమీటర్ల పరిధిలో ఉండేలా ఏర్పాటు చేశాం. హాల్‌టికెట్లు, పెన్నులు, ప్యాడ్లు మినహా ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
– శంకర్‌, డీఐఈవో

Published date : 24 May 2024 12:10PM

Photo Stories