Staff Nurse: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకాలు.. మూడు నెలలైనా అందని మొదటి జీతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటగా చేపట్టిన నియామకం నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీ. ఎల్బీ స్టేడియంలో జనవరి 31వ తేదీన అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు. తర్వాత వారంతా తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో విధుల్లో చేరిపోయారు. మూడు నెలలుగా ఆస్పత్రుల్లో రేయింబవళ్లు డ్యూటీలు చేస్తున్నారు. కానీ వారికి ఇప్పటివరకు ఒక్కపైసా వేతనం అందలేదు.
తొలి జీతం అందుకుని సంతోషంతో కుటుంబ సభ్యులకు స్వీట్లు పంచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ పోస్టులకు ఎంపికైవారిలో చాలా మంది వారి స్వస్థలాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో నియామకం అయ్యారు. అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వారికి మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో.. అద్దె కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్లే తమకు వేతనాలు అందడం లేదని.. నర్సింగ్ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లు..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 డిసెంబర్ 30వ తేదీన 5,204 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు 2న పరీక్ష నిర్వహించింది. 40,936 మంది దరఖాస్తు చేయగా.. 38,674 మంది పరీక్షలు రాశారు. ఫలితాలు వెల్లడించి, నియామకాలు చేపట్టాల్సి ఉన్నా.. ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియ ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 15న ఆ నోటిఫికేషన్‌కు మరో 1,890 పోస్టులను కలిపింది. మొత్తంగా డీఎంఈ పరిధిలో 5,650 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 757, ఎంఎన్‌జే, గురుకులాల్లో మిగతా పోస్టులను సిద్ధం చేశారు.
Diploma in Pharmacy Courses: డీఫార్మసీ కోర్సులో ప్రవేశాలు
ఫలితాల తర్వాత 6,956 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలు, ఇతర స్పెషాలిటీ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వారికి పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో బీసీలు 45.97 శాతం, ఎస్సీలు 30.64 శాతం, ఎస్టీలు 12.81 శాతం మంది ఉన్నారు. ఆర్థోపెడికల్లీ చాలెంజ్డ్ కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదు. కొత్తగా ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు రూ.36,750– రూ.1,06,990గా పేస్కేల్ ఖరారు చేశారు. దీంతోపాటు టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు ఉంటాయి. కొత్తగా ఎంపికై వారందరికీ కలిపి నెలకు దాదాపు రూ.35 కోట్లు ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
దొరికిందే చాన్స్‌గా ‘ముడుపుల’ వ్యవహారం
వాస్తవానికి డ్యూటీలో చేరిన 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తికావాలి. కానీ మూడు నెలల తర్వాత కూడా కొన్నిచోట్ల క్లర్కుల స్థాయిలోనే ఫైళ్లు ఆగిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో నర్సింగ్ ఆఫీసర్లకు ఎంప్లాయి ఐడీలు కూడా ఇవ్వలేదు. ట్రెజరీలకు వివరాలు పంపలేదు. మూడు నెలలుగా వేతనాలు రాక నర్సింగ్ ఆఫీసర్లు ఇబ్బంది పడుతుంటే.. కిందిస్థాయి సిబ్బంది ‘ముడుపులు’ అందితేనే ఫైల్ కదులుతుందని డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్ని జిల్లాల్లో ఐడీ, ప్రాన్ కార్డుల కోసం హెచ్‌ఓడీ, డీఎంహెచ్‌ఓ ఆఫీసు స్టాఫ్ డబ్బులు అడుగుతున్నారని ఓ నర్సింగ్ ఆఫీసర్ వాపోయారు. ముడుపులు ఇచ్చినోళ్ల వివరాలను మాత్రమే ట్రెజరీకి పంపుతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి.. తమకు వెంటనే వేతనాలు అందేలా చూడాలని నర్సింగ్ ఆఫీసర్లు కోరుతున్నారు.
వేతనాలు వెంటనే ఇవ్వాలి..
కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు వేతనాలు ఇవ్వలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వేతనాలు మంజూరు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చాం. శాశ్వత పద్ధతిలో నియమితులైన వారందరికీ వేతనాలు, గుర్తింపు కార్డులు త్వరగా ఇవ్వాలి..
– వి.మరియమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నర్సెస్ అసోసియేషన్
ప్రభుత్వం నుంచి ఆమోదం రావాలి
మొదటిసారి శాలరీలు డ్రా చేయాలంటే అందరూ చేరేంతవరకు ఆగాల్సి ఉంటుంది. నర్సింగ్ ఆఫీసర్లు అంతా చేరడానికి ఫిబ్రవరి వరకు పట్టింది. తర్వాత వాళ్ల నుంచి 27 కాలమ్స్ డేటా సేకరించాలి. కానీ ఆ డేటాను అందరూ ఇవ్వడం లేదు. కొందరు పాన్‌కార్డు లేదంటారు. అంతేకాదు ప్రతీ దానికి ఒక డాక్యుమెంట్ కావాలి. వివరాలన్నీ ఒకేసారి పట్టుకొని రావాలని ట్రెజరీ అధికారులు అంటున్నారు.
Job Opportunity: యువతకు ఉద్యోగ అవకాశాలు
ఇవన్నీ అందజేస్తే అప్పుడు నర్సింగ్ ఆఫీసర్లకు ఎంప్లాయీ ఐడీ ఇస్తారు. ఐడీ వచ్చాక ముంబై నుంచి ప్రాన్ నంబర్ తెప్పించాలి. చాలా మంది వివరాలు సరిగా ఇవ్వలేదు. దాంతో ఆలస్యం అవుతోంది. సప్లిమెంటరీ బిల్లులు తొందరగా పాస్ కావు. రెగ్యులర్ బిల్లు అయితే ప్రభుత్వం వెంటనే జీతాలు వేస్తుంది. ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్లది సప్లిమెంటరీ బిల్లు కావడం వల్లే ఈ సమస్య.
– డాక్టర్ వాణి, డీఎంఈ
3 నెలలైనా ప్రక్రియ పూర్తి చేయక..
నర్సింగ్ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం పర్యవేక్షించాలి. అభ్యర్థులు తమ నియామక పత్రాలను సంబంధిత ఆస్పత్రి సూపరింటెండెంట్, డీ ఎంహెచ్‌వోకు అందజేస్తే.. వారికి సర్వీస్ నిబంధనల ప్రకారం.. ఎంప్లాయ్ ఐడీ, బ్యాంక్ ఖాతా కేటాయిస్తారు. ఆ వివరాలను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి, అక్కడి నుంచి నర్సింగ్ విభాగానికి పంపి అప్‌డేట్ చేస్తారు. అప్పటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు లభిస్తుంది. అయితే 3 నెలలైనా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, కిందిస్థాయి అధికారుల అవినీతితోనే జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.