Skip to main content

TSBIE: ఇంటర్‌ లెక్కలో.. కాలేజీల మాయ!.. ఇప్పటివరకు ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రవేశాల వ్యవహారం గందరగోళంగా మారింది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిలో దాదాపు సగం మంది విద్యార్థులే ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో చేరారు.
TSBIE
ఇంటర్‌ లెక్కలో.. కాలేజీల మాయ!.. ఇప్పటివరకు ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు ఇలా..

 అడ్మిషన్ల గడువు ముగింపు దగ్గరపడుతున్నా మరో రెండు లక్షల మందికిపైగా ఏమయ్యారనేదానిపై అధికారిక ‘లెక్క’ లేకుండా పోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 4,19,460 మంది ఉత్తీర్ణులయ్యారు. జూన్‌లో జరిగిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో మరో 53,777 మంది పాసయ్యారు. గతంలో ఫెయిలై, ఈ ఏడాది కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైన వారు ఇంకో 3,335 మంది ఉన్నారు. మొత్తంగా ఈ ఏడాది టెన్త్‌ ఉత్తీర్ణుల సంఖ్య 4,76,572. కానీ జూలై రెండో వారం పూర్తయినా ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థుల సంఖ్య 2,30,141 మాత్రమే.

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 31 వేల వరకు సీట్లు ఉంటాయి, మిగతా కోర్సుల్లోనూ రెండు, మూడు వేల మందికి మించి చేరే అవకాశం లేదు. మరి మిగతా రెండు లక్షల మంది వరకు విద్యార్థులు ఏమైనట్టు అనే ప్రశ్న తలెత్తుతోంది. 2022లో పదో తరగతిలో 5,09,307 మంది ఉత్తీర్ణులుకాగా.. 4,74,313 మంది ఇంటర్మీడియట్‌లో చేరారు. అంటే డ్రాపౌట్లు సుమారు 40 వేల మందికూడా లేరు. ఈసారి భారీగా తేడా కనిపిస్తోంది.

చదవండి: NCET 2023: ఇంటర్‌తోనే.. బీఈడీలో ప్రవేశాలు.. బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలివే

ప్రైవేటులో ప్రవేశాల లెక్కలో తేడా?

ఇంటర్‌ బోర్డు గుర్తింపు పొందిన కాలేజీలు రాష్ట్రవ్యాప్తంగా 3,216 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 408కాగా.. వాటిలో చేరిన విద్యార్థుల సంఖ్య 57,340. ఇవి కాకుండా ప్రభుత్వ పరిధిలోని రెసిడెన్షియల్, గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలలో కలిపి 32,142 మంది ఇంటర్మీడియట్‌ స్థాయి కోర్సుల్లో చేరారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 1,571 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఉండగా.. ఇప్పటివరకు 1,40,659 మంది చేరినట్టు అవి బోర్డుకు వివరాలు పంపాయి.

నిజానికి ఏటా సుమారు 2.75 లక్షల మంది వరకు విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీల్లో చేరుతున్నారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో చేరి ఉంటారని అంచనా. కానీ అవి అడ్మిషన్లను పూర్తిస్థాయిలో చూపకపోవడంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా కనిపిస్తోందని అధికారులు భావిస్తున్నారు.

చదవండి: Career After Inter BiPC: బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలకు ఇండియన్‌ ఆర్మీ నోటిఫికేషన్‌ విడుదల.. కెరీర్‌ అవకాశాలు ఇవే..

తరగతుల అవకతవకలతోనే..

కార్పొరేట్, ప్రైవేటు ఇంటర్‌ కాలేజీ లు అడ్మిషన్లలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అడ్మిషన్లు జరుగుతున్నట్టు చూపుతున్న కాలేజీలు ఒకచోట ఉంటే.. విద్యార్థులకు తరగతులు వేరొక చోట జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా యథేచ్ఛగా సాగుతూ వస్తున్న ఈ వ్యవహారం.. గత ఏడాది ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల సందర్భంగా వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థి ఎక్కడ అడ్మిషన్‌ తీసుకుంటే అదే కాలేజీలో తరగతులు నిర్వహించాలని.. లేనిపక్షంలో భారీగా జరిమానా విధిస్తామని ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది కూడా. 

చదవండి: Career guidance: పచ్చని కెరీర్‌కు అగ్రి కోర్సులు, ప్రవేశ విధానం, భవిష్యత్తు అవకాశాలు తదితర వివరాలు ఇవే..

ప్రవేశాల ప్రక్రియ ముగిసేదాకా ఆగి..

ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు కొన్నేళ్లుగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను కూడా జిల్లాల్లోని ఇతర బ్రాంచీలు/ కాలేజీల్లో చదువుతున్నట్టు లెక్క చూపుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా భవనాలు, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ లేకపోవడం వంటి అంశాలను కప్పిపుచ్చుకునేందుకు.. ఇలా చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నా యి. ఈసారి ఇంటర్‌ బోర్డ్‌ గట్టి నిఘా పెట్టడంతో ఇప్పటివరకు విద్యార్థుల జాబితా వెల్లడించలేదని.. ప్రవేశాల ప్రక్రియకు ఇంకా గడువు ఉండటంతో, అది ముగిసేలోగా జాబితాలు పంపే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

చదవండి: What After Inter HEC: హెచ్‌ఈసీ విద్యార్థులకు విభిన్న కోర్సులు, వినూత్న కెరీర్‌ అవకాశాలు ఇవే..

ఆ విద్యార్థుల పరిస్థితి ఏమిటి?

కాలేజీల్లో చేరినా లెక్కచూపని విద్యార్థుల సంఖ్య 1.25 లక్షల మంది వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు వీరిని ఆఖరి నిమిషంలో ఏదో ఒక బ్రాంచీలో చేరినట్టు చూపి, అక్కడి నుంచి పరీక్షలు రాయించే వీలుందని అంటున్నారు. దీనితోపాటు అదనపు సెక్షన్లకు అనుమతి తీసుకుని, వాటిలో చేరినట్టు చూపే అవకాశమూ ఉందని చెప్తున్నారు. అంటే ఈ 1.25 లక్షల మందీ ప్రైవేటు కాలేజీల లెక్కలోకి చేరితే.. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో టెన్త్‌ పాసైన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరే వీలుందని అంటున్నారు.

ప్రవేశాలు ఊపందుకుంటాయి
ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు తగ్గాయంటూ కొన్ని కా­ర్పొరేట్‌ కాలేజీలు, వారికి మద్దతిచ్చే కొన్ని సంఘాలు దుష్ప్ర­చారం చేస్తున్నాయి. అది వాస్తవం కాదు. టెన్త్‌ అ­డ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఇటీవలే వచ్చాయి. కొ­న్నిరోజుల్లో ఇంటర్‌ అడ్మిషన్లు ఊపందుకునే అవకాశం ఉంది.
– రామకృష్ణగౌడ్, ఇంటర్‌ విద్య పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్‌

ఇప్పటివరకు ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు ఇలా..

ప్రభుత్వ కాలేజీలు

408

57,340

కేంద్ర ప్రభుత్వ కాలేజీలు

3

135

ఎయిడెడ్‌ కాలేజీలు

43

3,252

రెసిడెన్షియల్‌ కాలేజీలు

37

669

ఎస్సీ గురుకులాలు

238

2,430

ఎస్టీ గురుకులాలు

125

1,323

బీసీ గురుకులాలు

145

1,312

మోడల్‌ స్కూల్స్‌

194

7,079

కేజీబీవీ

246

6,752

మైనార్టీ వెల్ఫేర్‌ కాలేజీలు

205

9,154

టీఎస్‌ఆర్టీసీ కాలేజీ

1

11

టీఎస్‌ స్పోర్ట్స్‌ కాలేజీ

1

25

ప్రైవేటు కాలేజీలు

1,571

1,40,659

మొత్తం

3,216

2,30,141

సమగ్ర వివరాలు సేకరిస్తున్నాం..
ఇంటర్‌ ప్రవేశాలు గత ఏడాది డిసెంబర్‌ వరకు జరిగాయి. ఈసారి ఇంకా గడువు ఉంది. ఆలోగా విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరే అవకాశం ఉంది. ప్రైవేటు కాలేజీలు ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను బోర్డుకు అందించలేదన్న అనుమానాలు వస్తున్నాయి. కాలేజీలు ఒకచోట, విద్యార్థులు మరోచోట ఉండటాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. అందుకే ప్రైవేట్‌ కాలేజీలు డేటా పంపేందుకు తటపటాయిస్తున్నాయని సందేహాలు ఉన్నాయి. ఈ అంశంలో సమగ్ర వివరాలు సేకరించాలని జిల్లా అధికారులను ఆదేశించాం.
– నవీన్‌ మిత్తల్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి

Published date : 18 Jul 2023 03:54PM

Photo Stories