Skip to main content

సమకాలీన సామాజిక ఉద్యమాలు

 

ముఖ్యాంశాలు:

 

  • 20వ. శతాబ్దం ప్రారంభం (తొలిసగం)లో యుద్ధాలు, విప్లవాలు, జర్మనీ ఫాసిజం, సోవియట్ సోషలిజం, పాశ్చాత్య ఉదార వాదం, జాతీయ విముక్తి పోరాటాలు వంటి ఘటనలు సంభవించాయి.
  • రెండో సగం- అనేక వలస పాలిత ప్రాంతాలకు స్వాతంత్య్రం రావడం, అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం, అనేక దేశాలలో మానవ హక్కుల కోసం పోరాటాలు జరిగాయి.
  • అమెరికాలో 1960లలో పౌరహక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది.
  • ఇక్కడి నల్లజాతీయులను తెల్లజాతీయులు అనేక రకాలుగా అవమానించేవారు.
  • డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మాంటగామెరీలో నల్ల జాతీయులు బస్సులు నిషేధించారు.
  •  
  • 1956లో బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాయి.
  • 1963 ఆగస్టు 28న రెండు లక్షలకు పైగా ప్రజలు వాషింగ్టన్‌లో ప్రదర్శన నిర్వహించారు.
  • నల్లజాతీయులు వేరే జాతి అని శ్వేత జాతీయుల నుంచి స్వాతంత్య్ర కోసం పోరాడాలని మాల్కం ఎక్స్ సూచించాడు.
  • యు.ఎస్.ఎస్.ఆర్, దాని ప్రభావ దేశాలలో ప్రజల స్వేచ్ఛాయుత జీవితం పై అనేక ఆంక్షలు ఉండేవి.
  • ప్రభుత్వాలు తమను కూలదోసే కుట్రం గురించి నిత్యం భయపడతూ ఉండి ప్రజాల అన్ని కార్యకలాపాలపై నియంత్రణ, నిఘా ఉంచేవి.
  • భావ ప్రకటన, కదలికల స్వేచ్ఛ, ఆంక్షలు లేని స్వేచ్ఛా పూరిత పత్రికలు వంటి మానవ హక్కుల కోసం రష్యా, తూర్పు యూరప్‌లో ఉద్యమించారు.
  • అలెగ్జాండర్ సోల్డ్‌నిత్పిన్, అణుశాస్త్రవేత్త సఖరోవ్ ఈ దేశాలలో సోషలిస్ట్ వ్యవస్థకు అంతం పలకాలని ప్రయత్నించారు.
  • 1970, 1980లలో అణ్వాయుధాలకు వ్యతిరే కంగా ఉద్యమాలు జరిగాయి.
  • అనేక ఒత్తిడుల కారణంగా అమెరికా, రష్యా దేశాలు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను తగ్గించుకోవడానికి చర్చలు మొదలు పెట్టాయి.
  • 1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (Strategic Arms Limitation Treaty) మీద సంతకాలు చేశాయి.
  • 2001లో దీన్ని అమలు చేసి తమ వద్ద ఉన్న 80శాతం ఆయుధాలను తొలిగించారు.
  • 1990 నుంచి ప్రపంచీకరణ, ‘నయా ఉదార వాదం’ అన్న పేర్లతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ మార్పులు జరిగాయి.
  • అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణుపరీక్షలకు వ్యతిరేకంగా ‘గ్రీన్ పీస్’ ఉద్యమం మొదలైంది.
  • ‘గ్రీన్ పీస్’ అనగా ఒక పడవ పేరు. ఉద్యమంలో పాల్గొనేవారు ఆ పడవలో వెళ్లారు కాబట్టి అ పేరు వచ్చింది.
  • ‘‘అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం’’ గ్రీన్‌పీస్ ఉద్యమ ముఖ్య ఉద్దేశం.
  • 1984లో మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి విషవాయువు వెలువడి వేలాది మంది చనిపోయారు.
  • నదులపై ఆనకట్టలు నిర్మించడం వల్ల ముంపుకు గురైనా ప్రాంతాలలోని ప్రజలకు, చెట్లకు, పొలాలకు, జంతువులకు జరిగేనష్టం గురించి ఎవరూ పట్టించుకోక పోవడం వల్ల ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి.
  • వీటిలో అతి ముఖ్యమైనది ‘నర్మదా బచావో ఆందోళన్’.
  • కేరళలోని పశ్చిమ కనుమలలోని సెలైంట్ వ్యాలీ (నిశ్శబ్దలోయ)లో ప్రవహిస్తున్న రెండు నదులపై ఆనకట్టల నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించి విజయం సాధించారు.
  • 1980లో విజ్ఞాన శాస్త్రం, పర్యావరణ కేంద్రం (సెంటర్ ఫర్ సైన్‌‌స, ఎన్విరాన్‌మెంట్) అనే సంస్థను అనిల్ అగర్వాల్ స్థాపించాడు.
  • నెల్లూరు జిల్లాలోని దూబగుంట మహిళలు సారాయికి వ్యతిరేకంగా 1992లో పెద్ద ఎత్తున ఉద్యమించి విజయం సాధించారు.
  • 1891లో బ్రిటిష్ వాళ్లు మణిపూర్ ప్రాంతంపై నియంత్రణ సాధించారు.
  • మణిపూర్‌ను భారతదేశంలో విలీనం చేస్తూ రాజు 1949లో ఒప్పందంపై సంతకం చేశాడు. దీన్ని కొంత మంది వ్యతిరేకించారు.
  • సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం, 1958 ప్రకారం దేశ విద్రోహచర్యల్లో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి, కాల్చి చంపడానికి భద్రతా సిబ్బందికి అధికారం ఉంది.
  • అయితే ఇది మణిపూర్‌లో దుర్వినియోగమైందని మహిళలు వేధింపులకు గురవుతున్నారని పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.
  • మణిపూర్‌లో మొదలైన మరొక ఉద్యమం-మైరాపైబీ ఉద్యమం.
  • మైటై భాషలో మైరాపైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్లు అని అర్థం.
  • 1970ల చివరికాలంలో తాగి బజారుల్లో గొడవ చేయకుండా నివారించడానికి మైరా పైబీ ఉద్యమం మొదలైంది.
  • సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కూడా మైరాపైబీ ఉద్యమం డిమాండ్ చేసింది.
  • ఇరోం షర్మిల అనే మహిళ 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా గృహనిర్భంధంలో ఉంటూ నిరాహారదీక్ష చేస్తోంది.
  • ఈ సమస్యను పరిశీలించడానికి ప్రభుత్వం సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన బి.పి.జీవన్‌రెడ్డిని నియమించింది.

 

4-మార్కుల ప్రశ్నలు-(విషయావగాహన)

 

  1. అమెరికాలో జరిగిన పౌర హక్కుల ఉద్యమం గురించి నీకేమితెలుసు?
    జ.
    అమెరికాలో పౌరహక్కుల ఉద్యమం:-
    1) అమెరికాలో ఆఫ్రో-అమెరికన్లు, నల్లజాతి అమెరికన్లు ఎదుర్కొన్న వివక్షతకు వ్యతిరేకంగా 1960లలో తీవ్ర ఉద్యమం చెలరేగింది.
    2) పాఠశాలల్లో, బస్సులలో బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వాళ్లను వేరుగా ఉంచేవారు.
    3) ఉద్యోగాల్లో, గృహవసతిలో ఓటు హక్కులో కూడా వివక్షత చూపేవారు.
    4) ఈ వివక్షతకు వ్యతిరే కంగా పౌరహక్కుల ఉద్యమం మొదలైంది.
    5) ఇందులో వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుత పద్ధతుల్లో ఉల్లంఘించడం జరిగింది.
    6) డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మంటగోమెరీలో నల్లజాతీయులు సంవత్సరం పాటు బస్సులు బహిష్కరించారు.
    7) దీని వల్ల బస్సులు నడిపే కంపెనీ తీవ్రంగా నష్టపోయింది. చివరకు న్యాయస్థానాలు బస్సులలో వివక్షతను నిషేధించాయి.
    8) నల్లజాతీయులకు, తెల్లజాతీయులకు వేరువేరు పాఠశాలలు ఉండడానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిచింది.
    9) 1963 ఆగస్టులో వాషింగ్టన్‌లో రెండు లక్షల మంది ప్రదర్శన నిర్వహించారు.
    10) ఉపాధి కల్పన, గృహవసతి, ఓటుహక్కు, శ్వేతజాతి-నల్లజాతి కలిసి చదువుకునే సదుపాయాలు..మొదలైనవి వీరి ప్రధాన డిమాండ్లు.
    ఈ ఉద్యమాల ఫలితంగా అమెరికాలో అనేక పౌర హక్కులు సాధించారు.
  2. అణ్వాయుధాలు, యుద్ధాలకు వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు జరిగాయి? వాటి ఫలితాలు?
    జ.
    1970, 1980లు ఒక కొత్త రకమైన ఉద్యమాన్ని చవి చూశాయి. అదే అణ్వాయుధాలు, యుద్ధాలకు వ్యతిరేక ఉద్యమం.
    1) 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల ఫలితాన్ని చూసినప్పటికి అమెరికా, రష్యాలు అణ్వాయుధ నిల్వలు పెంచుకోవడంలో పోటీపడ్డాయి.
    2) ఈ పోటి వల్ల మరొక ప్రపంచ యుద్ధం చెలరేగుతుందేమోనన్న భయం ప్రపంచ ప్రజలను వెన్నాడింది.
    3) ఒకవేళ యుద్ధమే చెలరేగి అణ్వాయుధాలను ఉపయోగించినట్లయితే భూమి మీద నుంచి మానవళి అంతా తుడిచిపెట్టుకుపోతుందని భయపడసాగారు.
    4) ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, మేధావులు అణ్వాయుధాల నిరోధం కోసం ఉద్యమించడం ప్రారంభించారు.
    5) అమెరికాకు వ్యతిరేకంగా వియత్నం ప్రజలు చేపట్టిన ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు స్పూర్తిని ఇచ్చింది.
    6) వియత్నాంతో యుద్ధంలో పాల్గొని అమెరికాకు తిరిగి వస్తున్న అమెరికా సైనికులు తాము చేస్తున్న యుద్ధం న్యాయమైనదేనా అని సందేహించారు.
    7) వియత్నాం యుద్ధం తర్వాత దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రరూపం దాల్చింది.
    8) ఈ ఆయుధాలను ఉత్పత్తి చేసే కంపెనీలు, ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి ఆయుధాలపై ఎక్కువ ఖర్చుపెట్టేలా చూసేవి.
    9) తర్వాత కాలంలో ఇలాంటి ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున ప్రజానిరసనలు చోటు చేసుకున్నాయి.
    10) అణ్వాయుధాలు కలిగిన దేశాల ప్రజలు వాటి నిల్వలను తగ్గించుకోవడానికి, శాంతి చర్చలు ప్రారంభించడానికి ఒత్తిడి చేశారు.
    11) ఫలితంగా అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్‌లు తమ అణ్వాయుధాలను తగ్గించుకోవడానికి చర్చలు మొదలు పెట్టాయి.
    12) 1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్‌ఏఎల్‌టీ) మీద సంతకాలు చేశాయి.
    13) 2001 నాటికి ఈ రెండు దేశాలు తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలలో 80శాతం తొలగించారు.
  3. మైరా పైబీ ఉద్యమం గురించి తెలపండి?
    జ.
    మైరాపైబీ ఉద్యమం:-మైటై భాషలో ‘మైరాపైబీ’ అంటే ‘కాగడాలు పట్టుకున్న వాళ్లు’ అని అర్థం. 1970ల చివరి కాలంలో తాగి బజారుల్లో గొడవ చేసే వారిని అడ్డుకోవడానికి మైరాపైబీ ఉద్యమం మొదలైంది. ఇది మణిపూర్‌లో జరిగింది.
    1) రాత్రుళ్లు బజారులలో మైరాపైబీ ఉద్యమకారులైన మహిళలు గ్రామాలు, పట్టణాల్లోని వార్డులలో పహారాలో పాల్గొనేవారు.
    2) వీళ్ల చేతుల్లో ఎటువంటి ఆయుధాలు ఉండేవి కావు. కర్రకు గుడ్డ చుట్టి కిరోసిన్‌తో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవి.
    3) ప్రజాశాంతికి భంగం కలగకుండా మహిళా బృందాలు ప్రతిరాత్రి ప్రతివార్డులో, ప్రతికూడలిలో కూర్చుంటాయి.
    4) ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయాలలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా ఉండేవారు.
    5) వీళ్లు ఉద్యమకారులు కాదు, వీళ్లకి రాజకీయ ఆకాంక్షలు ఏమీ లేవు. ప్రజల భద్రత, సంక్షేమానికి బాధ్యతను తమచేతుల్లోకి తీసుకున్న సాధారణ మహిళలు వీరు.
    6) సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కూడా ఈ ఉద్యమం కోరుతోంది.
    7) ఎన్నికలను బహిష్కరించడం, రిలే నిరాహారదీక్షలు మొదలైన రూపాలలో తమ నిరసనను వెల్లడించారు.
    8) ఇరోం షర్మిలా అనే మహిళ గృహ నిర్భందంలో ఉంటూ 10 సంవత్సరాల కంటే ఎక్కువకాలంగా నిరాహార దీక్ష చేస్తోంది.
    9) ఈ సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి.పి.జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు.
    10) ఇది తన నివేదికను ఇచ్చినప్పటికీ ఇప్పటికీ శాశ్వత పరిష్కారం దొరకలేదు.

    4 మార్కుల ప్రశ్నలు-(చదివి, వ్యాఖ్యానించడం)
  4. కింది పేరాగ్రాఫ్ చదివి నీ అభిప్రాయాన్ని తెలుపుము?
    1990ల నుంచి ‘ప్రపంచీకరణ’ , ‘నయా ఉదారవాదం’ అన్న పేర్లతో సంభవిస్తున్న ప్రపంచ వ్యాప్త ఆర్థిక రాజకీయ మార్పుల వల్ల ఎలాంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గిరిజన ప్రజలు, పేదరైతులు, భూమిలేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్న పట్టణపేదలు, పారిశ్రామిక కార్మికులు అందరి కంటే తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇటువంటి ప్రజలలో ఎక్కువ మందికి పాఠశాల చదువు, సరైన పోషకాహారం, వైద్యం అందుబాటులో లేవు. ఈ కారణంగా కొత్త ఉద్యోగాలు గానీ, మంచి జీతాలు గల ఉద్యోగాలు కానీ, చట్టబద్ధ లేక రాజ్యాంగ బద్ధ పరిహారాలు గానీ వీళ్లకి అందుబాటులో లేవు.
    జ. 1) ప్రపంచీకరణ అనగా వస్తు, సేవల ఉత్పత్తికి దేశాల అడ్డుగోడలు లేవు. ప్రపంచమంతా వారి ఉత్పత్తి కేంద్రాలే.
    2) 1990ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ రంగాల్లో భారీ మార్పులు సంభవిస్తున్నాయి. దీనినే ‘నయా ఉదారవాదం’ అన్నారు.
    3) ప్రపంచీకరణలో భాగంగా అభివృద్ధి పేరుతో అనేక ప్రాజెక్టుల నిర్మాణం, బహుళజాతి కంపెనీల విస్తరణ జరిగింది.
    4) ఇది ఒకవైపు అభివృద్ధికి దారి తీసినప్పటికి మరొకవైపు ఎటువంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
    5) ఖనిజాలు, విలువైన మొక్కలు, ప్రాణులు, నీళ్లు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవడం జరిగింది.
    6) దీని వల్ల తరతరాలుగా అక్కడ నివాసం ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులను తొలగించారు.
    7) దీని మూలంగా గిరిజన ప్రజలు, పేద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్న పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు.
    8) వీరంతా కొత్త ప్రాంతాలలో చెల్లా చెదురైపోయారు. గిరిజన సంస్కృతి విధ్వంసమైంది.
    9) వీరికి పాఠశాల చదువు, సరైన పోషకాహారం, వైద్యం అందుబాటులో లేవు.
    10) వీరికి కొత్త ఉద్యోగాలు గాని, మంచి జీతాలుగల ఉద్యోగాలు గానీ, చట్టబద్ధ లేక రాజ్యాంగ బద్ధ పరిహారాలు గానీ వీళ్లకి అందుబాటులో లేవు.
    11) ఈ అభివృద్ధి ప్రక్రియల వల్ల ప్రకృతి వనరులకు తీవ్ర ముప్పు ఏర్పడడంతో పర్యావరణ ఉద్యమాలు కూడా మొదలయ్యాయి.
    ఉదా:-నర్మదా బచావో అందోళన్’ , ‘చిప్కో ఉద్యమం’.
  5. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రాజకీయ వ్యవస్థలుగా ప్రజాస్వామ్యాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆంకాక్షలకు పూర్తి న్యాయం చేశాయా? ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణల ఆధారంగా ‘ప్రజాస్వామ్యం-సామాజిక ఉద్యమాలు’ అన్న అంశంపై చిన్నవ్యాసం రాయండి?
    జ.
    ప్రజాస్వామ్యం-సామాజిక ఉద్యమాలు:-
    ఆధునిక దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్యదేశాలే. ప్రజల ఆకాంక్షలకు అణుగుణంగా ఏర్పడిన ప్రభుత్వాలే ఆ దేశాలను పరిపాలిస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వాలు ఆయా దేశాల్లో అందరికీ సమాన హక్కులు లభించేలా వ్యవహరించడం లేదన్న దానికి నిదర్శనమే ఆయా దేశాల్లోని ‘సామాజిక ఉద్యమాలు’.
    అమెరికాలో నల్ల జాతీయుల హక్కులను హరించేలా ఉన్న అనేక చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ నల్లజాతీయులు పౌరహక్కుల ఉద్యమం ప్రారంభించారు. పాఠశాలల్లోను, బస్సులలోను ఇతర అనేక ప్రదేశాలలో వారు వివక్షతకు గురవుతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే అమెరికాకు ఇది ఒక మచ్చ అని చెప్పవచ్చు.
    అలాగే ఆఫ్రికా ఖండములోని దక్షిణాఫ్రికా దేశంలో కూడా నల్లజాతీయులు వివక్షతకు గురయ్యారు. దీనికి వ్యతిరేకంగా వారు సుదీర్ఘపోరాటం చేయాల్సి వచ్చింది.
    రష్యా (అప్పటి యూఎస్‌ఎస్‌ఆర్)లోను, తూర్పు యూరప్‌లోను ప్రజల స్వేచ్ఛా పూరిత భావ ప్రకటన, కదలికలపై నియంత్రణ ఉండేది. పత్రికలు, ప్రసారసాధనాలపై ఆంక్షలు ఉండేవి. దీంతో విసిగిపోయిన ప్రజలు మానవహక్కుల కోసం పలు ఉద్యమాలు చేపట్టారు.
    ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన ప్రజలు పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు చేపట్టారు.
    1984లో భారతదేశంలోని భోపాల్‌లో సంభవించిన గ్యాస్ దుర్ఘటన వల్ల వేలాది మంది చనిపోయారు. ఇప్పటికీ వేలాది మంది భాధపడుతున్నారు. ఇక్కడి ప్రజలు మెరుగైన వైద్య సదుపాయం, అంతర్జాతీయ ప్రామాణికాల ఆధరంగా నష్టపరిహారం కోసం ఉద్యమించారు.
    నర్మదా నదిపై చేపట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణానికి ముప్పు ఉందని, గిరిజన ఆవాసాలు చెల్లా చెదురు అవుతాయని మేథాపాట్కర్, బావా మహలియా ఆధ్వర్యంలో ఉద్యమించారు. మణిపూర్‌లో మహిళలు మానవహక్కుల కోసం సుదీర్ఘపోరాటం చేయాల్సి వచ్చింది.
    ఈ విధంగా ప్రజాస్వామ్య దేశాలు అని చెప్పుకుంటున్నప్పటికి అక్కడి ప్రభుత్వాలు మానవ హక్కులను ఉల్లంఘించడం వల్ల ఆ హక్కుల కోసం ప్రజలు ఉద్యమించక తప్పలేదు.


2-మార్కుల ప్రశ్నలు:-

 

  1. సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలు ఏమిటి?
    జ. సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలు:-

    1) మానవ హక్కులు
    2) పర్యావరణం
    3) సమానత్వం
    4) నష్ట పరిహారం
    5) ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత జీవనం
  2. యు.ఎస్.ఎస్.ఆర్‌లో జరిగిన మానవహక్కుల ఉద్యమం గురించి రాయండి?
    జ.
    యు.ఎస్.ఎస్.ఆర్-మానవహక్కుల ఉద్యమం:-
    1) అప్పటి యు.ఎస్.ఎస్.ఆర్‌లోను దాని ప్రభావంలో ఉన్న తూర్పు యూరప్ దేశాలలోను ప్రజల స్వేచ్ఛాపూరిత జీవితం పై అనేక ఆంక్షలు ఉండేవి.
    2) స్వేచ్చా పూరిత బహుళ పార్టీ ఎన్నికలను, సెన్సారు లేని స్వేచ్ఛా పూరిత పత్రికలు, ప్రసార సాధనాలను చివరికి సాధారణ ప్రజల స్వేచ్ఛా పూరిత భావ ప్రకటన, కదలికలు వంటి వాటిని అనుమంతించలేదు.
    3) ప్రజలు తమను కూలదేసే కుట్రలు చేస్తారని ప్రభుత్వాలు భయపడుతూ వారిపై నియంత్రణ, నిఘా ఉంచేవి.
    4) ఈ నియంత్రణల వల్ల విసిగిపోయిన ప్రజలు భావ ప్రకటన, కదలికలకు స్వేచ్ఛ, స్వేచ్ఛా పూరిత పత్రికలు వంటి మానవ హక్కుల కోసం యూఎస్‌ఎస్‌ఆర్‌లోని పలు ప్రాంతాలలో, తూర్పు యూరప్‌లోను పలు ఉద్యమాలు చేపట్టారు.
    5) ఇందులో కొందరు సాధారణప్రజలకు మరింత స్వేచ్ఛను కోరగా, కొందరు దేశంలోని సోషలిస్టు వ్యవస్థను పూర్తిగా తొలగించాలని కోరారు.
  3. ‘భోపాల్ గ్యాస్ దుర్ఘటన’ గురించి తెలపండి?
    జ. భోపాల్ గ్యాస్ దుర్ఘటన:-

    1) 1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ(డౌ కంపెనీ) నుంచి ఒక రాత్రి విషవాయువు వెలువడింది.
    2) దీని వల్ల వేలాది మంది చనిపోయారు. దీని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాది మంది బాధపడుతున్నారు.
    3) ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన.
    4) ఇందులో నష్టపోయిన ప్రజలు నాలుగు ముఖ్యమైన కోరికల కోసం ఉద్యమించారు.
    ప్రభావితులైన వారికి వైద్య సౌకర్యం
    అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్టపరిహారం
    కంపెనీ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయడం
    భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడడం.
  4. అమెరికాలోని నల్ల జాతీయులు, మైరాపైబీ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?

    అమెరికా నల్లజాతీయుల ఉద్యమం

    మైరాపైబీ ఉద్యమం

    పోలికలు:-
    1) పౌరహక్కులు, మానవ హక్కుల కోసం జరిగింది.
    2) ఈ ఉద్యమంలో మహిళలు కూడా పాల్గొన్నారు.
    3) ప్రభుత్వం చేసిన చట్టాలకు వ్యతి రేకంగా జరిగింది.
    తేడాలు:-
    1) పురుషులు ప్రధాన పాత్ర వహించారు.
    2) పగటిపూట ప్రదర్శనలు, నిరసన సభలు ఊరేగింపుల ద్వారా ఉద్యమంనడిచింది.
    3) మార్టిన్ లూథర్ కింగ్ లాంటి సమర్థవంతమైన నాయకత్వం ఉంది.
    4) వీరి ప్రధాన డిమాండ్ ‘పౌర హక్కుల చట్టం’ను చేయడం.
    పోలికలు:-
    1) మానవ హక్కుల ఉద్యమంగా మారింది.
    2) ఈ ఉద్యమాన్ని మహిళలు మాత్రమే చేశారు.
    3) ఇది కూడా ప్రభుత్వ చట్టానికి వ్యతిరేక ఉద్యమంగా మారింది.
    తేడాలు:-
    1) మహిళలు ప్రధాన పాత్ర వహించారు
    2) రాత్రిపూట గ్రామాలు, పట్టణాల్లో మహిళలు పహారా కాసేవారు.
    3) సరిైయెున నాయకత్వం లేదు.
    4) వీరి ప్రధాన డిమాండ్ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయడం.
  5. ‘గ్రీన్ పీస్ ఉద్యమం’ గురించి తెలపండి?
    జ. గ్రీన్పీస్ ఉద్యమం:-

    1) అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైంది.
    2) నిరసన తెలియజేయడానికి ఉద్యమ కారులు ప్రయాణించిన పడవ పేరు‘గ్రీన్‌పీస్’ అందుకే దీనిని ‘గ్రీన్‌పీస్’ ఉద్యమం అంటారు.
    3) ‘గ్రీన్‌పీస్’ ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం హాలండ్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఉంది. నలభై దేశాలలో ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి.
    4) వాతావరణ మార్పుపై పలు దేశాలలో ‘గ్రీన్‌పీస్’ ఉద్యమం చేపట్టింది.
    5) అనంత వైవిధ్యంతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం’దాని ఉద్దేశం.


1-మార్కు ప్రశ్నలు:-

 

 

  1. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు వ్రాయండి?
    జ.
    పర్యావరణ పరిరక్షణ నినాధాలు:-
    1) చెట్లు-ప్రగతికి మెట్లు
    2) బిందువు బిందువే సింధువు అవుతుంది.
  2. అమెరికాలోని నల్లజాతీయుల ప్రధాన కోరికలు ఏవి?
    జ.
    పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు, శ్వేతజాతి-నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు.
  3. రష్యాలో జరిగిన మానవ హక్కుల ఉద్యమంలోని ముఖ్య దోరణులు ఏవి?
    జ.
    1) సాధారణ ప్రజలకు మరింత స్వేచ్ఛ-భావప్రకటన, కదలికలు, పత్రికలు, ప్రసారసాధనాలలో పూర్తి స్వేచ్ఛ కావాలి.
    2) సోషలిస్టు వ్యవస్థకు అంతం పలకాలని కొందరు కోరారు.
  4. SARTను విస్తరించండి?
    జ.
    SART:- Strategic Arms Reduction Treaty (వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం)
  5. ‘నర్మదా బచావో ఆందోళన్’ లో ముఖ్యధోరణులు ఏవి?
    జ.
    1) మూలవాసీ ప్రజల ఉద్యమం
    2) నయా-ఉదారవాద విధానాలకు వ్యతిరేక ఉద్యమం
    3) తమ భూములను కాపాడుకోవడానికి రైతుల ఉద్యమం కింది పటము గమనించి 6, 7, 8, 9 ప్రశ్నలకు జవాబు వ్రాయండి.
    Education News
  6. నర్మదా నది ఎక్కడ జన్మిస్తుంది?
    జ.
    అమర్ కంటక్
  7. నర్మదా నది పై నిర్మించిన రెండు ప్రధాన ప్రాజెక్టులు ఏవి?
    జ.
    1) సర్దార్ సరోవర్ ప్రాజెక్టు
    2) ఇందిరా సాగర్
  8. నర్మదా నది పరివాహక ప్రదేశంలో లేని రెండు ప్రధాన నగరాలు ఏవి?
    జ.
    1) భూపాల్
    2) ఇండోర్
  9. నర్మదా నది పరివాహక ప్రాంతం లోపలి రెండు ప్రధాన నగరాలు ఏవి?
    జ.
    1) జబల్‌పూర్
    2) హోసంగాబాద్
  10. ‘సెలైంట్ వ్యాలీ ఉద్యమం’ ఫలితంగా ఆనకట్టల నిర్మాణాన్ని ఆపేసి దానిని జాతీయ పార్కుగా ప్రకటించింది. దీనిపై నీ అభిప్రాయం ఏమిటి?
    జ.
    సెలైంట్ వ్యాలీ కేరళలో ఉంది. ఇక్కడ ప్రవహించే నదులపై ఆనకట్టలు నిర్మించాలని ప్రతిపాదించినప్పుడు ఇక్కడి అరుదైన జంతువులు, మొక్కలు అంతరించిపోతాయని ఆందోళనలు జరిగాయి. ఫలితంగా ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని ఆపి దానిని జాతీయ పార్కుగా గుర్తించింది. ఇది సరిైయెున చర్యనే అని నేను భావిస్తాను.
  11. దూబగుంట మహిళలు సారాయికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ప్రేరణ కలిగించిన అంశం ఏది?
    జ.
    దూబగుంట నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామం. ఇక్కడ మహిళలు రాత్రి బడికి వెళ్లి చదువు నేర్చుకునే వారు.
    వారు చదివిన పుస్తకాలలోని ‘సీతమ్మ కథ’ అనే పాఠ్యాంశం ఆధారంగా సారాయికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రేరణ పొందారు.
  12. ‘మైరాపైబీ’ అంటే ఏమిటి? అది ఏ భాషకు చెందింది?
    జ.
    1) మైరాపైబీ అనగా కాగడాలు పట్టుకున్న వాళ్లు అని అర్థం.
    2) ఇది మైటై భాషకు చెందింది.


1/2 మార్కు ప్రశ్నలు (బహుళైచ్ఛిక ప్రశ్నలు)

 

 

  1. అమెరికాలో వివక్షతతో కూడిన సేవల బహిష్కరణలో భాగంగా నల్లజాతీయులు వీటిని బహిష్కరించారు?
    1) పాఠశాలలు
    2) న్యాయస్థానాలు
    3) బస్సులు
    4) రైళ్లు
  2. ‘నాకొక కల ఉంది...’ అన్న చారిత్రక ఉపన్యాసం ఎవరిచ్చారు?
    1) మాల్కం ఎక్స్
    2) మార్టిన్ లూథర్ కింగ్
    3) గోర్బచేవ్
    4) మహలియా
  3. 1963లో అమెరికా నల్లజాతీయులు ‘పౌరహక్కుల చట్టం’ కోసం ఈ నగరంలో ఉద్యమించారు?
    1) వాషింగ్టన్
    2) న్యూయార్‌‌క
    3) లాస్‌ఏంజిల్స్
    4) శాన్‌ఫ్రాన్సిస్కో
  4. యూఎస్‌ఎస్‌ఆర్‌లోని మానవ హక్కుల ఉద్యమం ప్రధాన డిమాండ్?
    1) స్వేచ్ఛా పూరిత బహుళపార్టీ ఎన్నికలు
    2) స్వేచ్ఛాపూరిత పత్రికలు, ప్రసారసాధనాలు
    3) ప్రజల భావప్రకటన, కదలికలకు స్వేచ్ఛ
    4) పైవన్నీ
  5. అమెరికా-వియత్నాం యుద్ధం ఏ సంవత్సరంలో ముగిసింది?
    1) 1969
    2) 1970
    3) 1975
    4) 1979
  6. SALT ని విస్తరించి రాయగా?
    1) Strategic Arms Limitation Talks
    2) Strategic Arms Limitation Treaty
    3) SiStematic Arms Limitation Talks
    4) Sistematic Arms Liberation Talks
  7. వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్‌ఏఆర్‌టీ) ఏ సంవత్సరంలో జరిగింది?
    1) 1991
    2) 2001
    3) 1995
    4) 2005
  8. ‘అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం’ ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశ్యం?
    1) నర్మదా బచావో ఆందోళన్
    2) మైరాపైబీ ఉద్యమం
    3) సెలైంట్ వ్యాలీ ఉద్యమం
    4) గ్రీన్ పీస్ ఉద్యమం
  9. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
    1) 1980
    2) 1984
    3) 1986
    4) 1990
  10. ఇది మన రాష్ట్రానికి చెందిన బహుళార్థ సాధక ప్రాజెక్టు?
    1) భాక్రానంగల్
    2) హీరాకుడ్
    3) నాగార్జున సాగర్
    4) సర్దార్ సరోవర్
  11. ‘సెలైంట్ వ్యాలీ ఉద్యమం’ ఈ రాష్ట్రానికి చెందినది?
    1) మణిపూర్
    2) కేరళ
    3) గుజరాత్
    4) మధ్యప్రదేశ్
  12. ‘సెలైంట్ వ్యాలీ’ (నిశ్శబ్ద లోయ)కి ఆపేరు రావడానికి కారణం?
    1) జంతువులు లేవు
    2) పక్షులు లేవు
    3) కీచురాళ్లు లేవు
    4) కారణమేమీ లేదు
  13. విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం (Center for Science & Environment) ఎవరు స్థాపించారు?
    1) అనిల్ అగర్వాల్
    2) మేథా పాట్కర్
    3) సుందర్ లాల్ బహుగుణ
    4) బావా మహలియా
  14. ‘నర్మదా బచావో ఆందోళన్’ సాధించిన విజయం?
    1) సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణాన్ని ఆపడం
    2) రైతుల భూములు స్వాధీనం చేసుకోకుండా చేయగలిగింది.
    3) మూల వాసీ ప్రజల హక్కులు పూర్తిగా కాపాడారు
    4) నిర్వాసితులైన ప్రజలకు తగినంత, గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశలో ప్రభుత్వం ఆలోచించేలా చేసింది.
  15. దూబగుంట మహిళలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు?
    1) సాయుధదళాల ప్రత్యేక అధికారాల చట్టం
    2) సారాయి
    3) పర్యావరణాన్ని హరించే చర్యలు
    4) ప్రాజెక్టులు
  16. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఈ సంవత్సరంలో సారాయిని అధికారికంగా నిషేధించారు?
    1) 1993
    2) 1991
    3) 1995
    4) 1994
  17. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఈ సంవత్సరంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు?
    1) 1991
    2) 1993
    3) 1995
    4) 1994
  18. ‘పోలవరం’ ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి చెందినది?
    1) ఆంధ్రప్రదేశ్
    2) తెలంగాణ
    3) ఒడిశా
    4) పశ్చిమ బెంగాల్
  19. 1891లో మణిపూర్ ప్రాంతంపై నియంత్రణ సాధించిన వారు?
    1) బ్రిటిష్
    2) ఫ్రెంచ్
    3) పోర్చుగీస్
    4) డచ్
  20. మణిపూర్ భారతదేశంలో విలినమైన సంవత్సరం?
    1) 1947
    2) 1948
    3) 1949
    4) 1950
  21. సాయుధదళాల ప్రత్యేక అధికారాల చట్టం చేసిన సంవత్సరం?
    1) 1948
    2) 1950
    3) 1952
    4) 1958
  22. ‘మైరా పైబీ’ ఉద్యమం ఎందుకోసం మొదలైంది?
    1) తాగి బజారుల్లో గొడవ చేయకుండా నివారించడానికి
    2) సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా
    3) నదులపై కట్టే ఆనకట్టలకు వ్యతిరేకంగా
    4) భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో న్యాయం కోసం
  23. 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా గృహ నిర్భంధంలో ఉంటూ నిరాహారదీక్ష చేసిన మహిళ?
    1) తంగజం మనోరమ
    2) ఇరోం షర్మిల
    3) మేథా పాట్కర్
    4) సీతమ్మ
  24. 1971 లో అమెరికా ఇక్కడ అణుపరీక్షలు జరిపింది?
    1) అలస్కా
    2) మెక్సికో
    3) క్యూబా
    4) ఐస్‌లాండ్
  25. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే ‘సుస్థిర అభివృద్ధి’ని కాంక్షించిన ఉద్యమం?
    1) మైరాపైబీ ఉద్యమం
    2) గ్రీన్‌పీస్ ఉద్యమం
    3) నర్మదా బచావో ఆందోళన్
    4) భోపాల్ గ్యాస్ ఉద్యమం
  26. ‘ప్రపంచీకరణ’ వల్ల ఈ వర్గం వారు ఎక్కువగా ప్రభావితమయ్యారు?
    1) గిరిజన ప్రజలు
    2) భూమిలేని కార్మికులు
    3) మహిళలు
    4) పైవారందరూ
  27. ‘వియత్నాం తో యుద్ధం కొనసాగినంత కాలం మేం సైనిక సేవలో చేరటానికి నిరాకరించాలన్న స్థిర నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం’ అని అమెరికా యువకులు ప్రకటించారు. అంటే వీరు?
    1) దేశ భక్తి లేని వాళ్లు
    2) యుద్ధమంటే భయపడేవాళ్లు
    3) అన్యాయమైన యుద్ధంలో పాల్గొనబోమని కోరుకునే వారు
    4) ఏదీకాదు.
  28. అమెరికాలో బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు ఈ సంవత్సరంలో నిషేధించాయి?
    1) 1950
    2) 1952
    3) 1956
    4) 1963
  29. ప్రముఖ అణు శాస్త్రవేత్త ఆండ్రే సఖరోవ్ ఈ దేశానికి చెందినవారు?
    1) అమెరికా
    2) రష్యా
    3) చైనా
    4) వియత్నాం
  30. బహుళార్థ సాధక ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం?
    1) విశాల భూభాగాలకు సాగునీరు అందించడం
    2) విద్యుత్ ఉత్పత్తి
    3) వరదలు, కరువుల నియంత్రణ
    4) పైవన్నీ


జవాబులు:-
1)
3 2) 2 3) 1 4) 4 5) 3
6) 1 7) 1 8) 4 9) 2 10) 3
11) 2 12) 3 13) 1 14) 4 15) 3
16) 2 17) 3 18) 1 19) 1 20) 3
21) 4 22) 1 23) 2 24) 1 25) 2
26) 4 27) 3 28) 3 29) 2 30) 4

 

Published date : 28 Dec 2023 11:23AM

Photo Stories