Skip to main content

స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్పై సంవ త్సారాలు: 1947 - 1977)

ముఖ్యాంశాలు:

  • భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి.
  • సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరిగాయి.
  • స్విట్జర్లాండ్‌లో మహిళలకు 1971లో ఓటుహక్కు లభించింది. కానీ, మనం ప్రారంభం నుంచే అందరికీ ఓటుహక్కు కల్పించాం.
  • నిరక్షరాస్యత సమస్య అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులను సూచించేలా కొన్ని గుర్తులను ఉపయోగించాలన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.
  • మొదటి సాధారణ ఎన్నికల్లో ఒక్కొ అభ్యర్థికి ఒక్కొ బ్యాలెట్ పెట్టె ఉపయోగించారు.
  • 1952, 1957, 1962లలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది.
  • మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రు.
  • భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది.
  • బ్రిటిష్ వారి కాలంలో దేశం ప్రెసిడెన్సీలుగా విభజించి ఉండేది.
  • మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు, గోండి, ఒడియా భాషలు మాట్లాడే వాళ్లు ఉండేవారు.
  • తెలుగు మాట్లాడే ప్రజలు తీవ్ర ఉద్యమాన్ని చేపట్టారు.
  • ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు 58 రోజుల తర్వాత 1952లో చనిపోయారు.
  • 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
  • 1953 ఆగస్టులో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పరచారు.
  • దీనిలో ఫజల్‌అలీ, కె.ఎం.ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రులు సభ్యులుగా ఉన్నారు.
  • 1956లో పార్లమెంట్ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది.
  • దీని ఆధారంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - (మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి 1953లో ఏర్పడి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణాన్ని కలిపి 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పరచారు.)
  • ఈ చట్టం ఆధారంగా 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
  • కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచిన నెలరోజులకి (1950 ఫిబ్రవరి) ప్రణాళికా సంఘాన్ని ఏర్పరచారు.
  • మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు.
  • వ్యవసాయ రంగంలో మార్పు తోసుకురావడానికి మూడు అంశాలపై దృష్టి పెట్టారు - భూసంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన.
  • మొదటి ప్రణాళిక కాలంలో పెద్ద ఆనకట్టలు కట్టడంపై దృష్టి సారించారు.
  • రెండో పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమల రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు.
  • విదేశాంగ విధానంలో భారత దేశం అలీన విధానాన్ని ఎంచుకుంది.
  • 1947లో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో, 1962లో చైనాతో, మళ్లీ 1965లో కాశ్మీర్ విషయంలో, 1971లో బంగ్లాదేశ్ విషయంలో పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చింది.
  • 1964లో జవహర్‌లాల్ నెహ్రు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు.
  • 1963లో అధికార భాష చట్టం ఆమోదించిన తర్వాత ‘హిందీ’ని జాతీయ భాషగా గుర్తించారు.
  • దీనికి వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీనినే ‘హిందీ వ్యతిరేక ఉద్యమం’ అంటారు.
  • 1964-67 మధ్య వ్యవసాయ రంగంలో ‘హరిత విప్లవం’ ప్రవేశ పెట్టారు.
  • 1965లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.
  • 1967 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి. కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఆధిక్యత తగ్గింది.
  • తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశాలలో కాంగ్రెస్ ఓడిపోయింది.
  • ఉత్తరాది రాష్ట్రాల్లో సంయుక్త విధాయక దళ్(ఎస్‌యూడీ) ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. (జనసంఘ్, స్వతంత్ర పార్టీ, సోషలిస్టులు మొ॥వారు). కానీ, అవి ఎక్కువ కాలం నిలవలేదు.
  • 1969లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ ఉద్యమంలో ముందంజలో ఉన్నారు.
  • 1969లో అసోం నుంచి విడిపోయి మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది.
  • (ఖాసి, జైంతియా, గారో ప్రాంతాలతో)
  • 1966లో పంజాబ్ ఏర్పడింది. కాని ప్రత్యేక రాజధాని లేకపోవడం వల్ల చండీఘర్‌ను హర్యానా, పంజాబ్‌ల ఉమ్మడి రాజధానిగా ఉంచారు.
  • రాంచి, అహ్మదాబాద్, జలగావ్, అలీఘర్‌లలో మతకల్లోలాలు చెలరేగాయి.
  • 1971లో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) ప్రజలకు మద్దతుగా పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో గెలుపొంది బంగ్లాదేశ్ ను ఏర్పరచింది.
  • 1971 ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ ‘గరీబీ హఠావో’ నినాదంతో బరిలోకి దిగి గెలుపొందింది.
  • 1973లో ద్రవ్యోల్బణం, ఆహార పదార్థాల కొరత, నిరుద్యోగం పెరిగాయి. దీనికి కారణం అరబ్-ఇజ్రాయిల్ యుద్ధం.
  • ఈ సమయంలో జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఒక్కటై ప్రభుత్వానికి, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. దీనినే ‘జె.పి.ఉద్యమం’ అని అంటారు.
  • ఈ ఉద్యమ తీవ్రత గుజరాత్, బీహార్‌లో ఎక్కువగా ఉంది.
  • ఈ పరిస్థితులో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం 1975లో అత్యవసర పరిస్థితి విధించింది.
  • దీంతో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ప్రభుత్వం అనేక అణచివేత చర్యలకు పాల్పడింది. ప్రతిపక్ష నాయకులందరినీ ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
  • 1976లో రాజ్యాంగానికి కీలకమైన 42వ సవరణ చేశారు.
4 మార్కుల ప్రశ్నలు - (విషయ సూచిక)
1) స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక-ఆర్థిక మార్పు తీసుకురావడానికి ఏ చర్యలు చేపట్టారు?

జ:
  1. రాజ్యాంగ ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాలలో సమానత్వాన్ని కల్పించడానికి హామీ ఇచ్చారు.
  2. దీనికి అనుగుణంగా రాజ్యాంగం ఏర్పడిన నెలరోజులకు ప్రణాళికా సంఘాన్ని ఏర్పరచారు.
  3. జవహర్‌లాల్ నెహ్రు అభిప్రాయం ప్రకారం వ్యవసాయ రంగంలో మార్పు తీసుకుని వస్తే అది గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పు అవుతుంది.
  4. సామాజిక-ఆర్థిక మార్పు కోసం నెహ్రు చూపిన మార్గంలో మూడు అంశాలు ఉన్నాయి.
    1. భూసంస్కరణలు
    2. వ్యవసాయ సహకార సంఘాలు
    3. స్థానిక స్వపరిపాలన
  5. (i) భూసంస్కరణలు:-మూడు రకాలైన భూసంస్కరణలు ప్రతిపాదించారు.
    • జమిందారీ వ్యవస్థ రద్దు
    • కౌలు విధానాల సంస్కరణ
    • భూపరిమితి విధానాలు
  6. ఈ మూడు సంస్కరణల ముఖ్య ఉద్దేశం దున్నే వాడికి భూమి చెందాలి.
  7. (ii) వ్యవసాయ సహకార సంఘాలు:-
  8. సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా లాభసాటి పరిమాణాన్ని చేరుకోవడమే కాకుండా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు మొ॥వాటిని అందించాలి.
  9. (iii) స్థానిక స్వపరిపాలన:-
  10. ఇది భూసంస్కరణలు అమలయ్యేలా చూసి గ్రామ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సహకార సంఘాలు నడిచేలా చూస్తాయి.
  11. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించారు. ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.
  12. రెండో పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు.
  13. సామాజిక మార్పు కోసం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి వివిధ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించారు.
  14. అల్ప సంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకున్నారు.
2) ఒక పార్టీ ఆధిపత్యం అంటే ఏం అర్థం చేసుకున్నారు? అది ఎన్నికల్లో మాత్రమే ఆధిపత్యమా లేక సిద్ధాంత భావజాలంలో కూడా ఆధిపత్యమా? మీ కారణాలను పెర్కొంటూ చర్చించండి.
జ. ఒక పార్టీ ఆధిపత్యం:-

స్వతంత్ర భారతదేశంలో 1952, 1957, 1962లలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఇతర అభ్యర్థులను నామ మాత్ర స్థానాలకు పరిమితం చేసి భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. అనేక రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఈ విధంగా భారతదేశంలో తొలి ముప్పై సం॥ఏకపార్టీ ఆధిపత్యం కొనసాగింది.
సిద్ధాంత భావజాలం:-
  1. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కేవలం ఎన్నికల్లో మాత్రమే కనిపించేది. ఇది సిద్ధాంత భావజాలంలో కన్పించదు.
  2. ఎందుకంటే కాంగ్రెస్‌లో ఎల్లప్పుడూ అంతర్గతంగా చిన్న చిన్న బృందాలు ఉండేవి. ఇవి నాయకుల మధ్య పోటి కారణంగా ఏర్పడ్డాయి. పార్టీ లక్ష్యాలతో వీళ్లు ఏకీభవించినప్పటికీ కొన్న విధానాల విషయంలో విభేదాలు ఉండేవి.
  3. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ విభిన్న దృక్పథాలు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా కనిపించేది.
  4. ఏకపార్టీ ఆధిపత్యంలో ఉన్న పరిస్థితులో కూడా కాంగ్రెస్ పార్టీ లోపలే రాజకీయ పోటి ఉంటూ ఉండేది.
  5. అయితే ఈ పరిస్థితి ఇతర రాజకీయ పార్టీలు లేని అప్రజాస్వామిక పరిస్థితి కాదు.
  6. ఇతర పార్టీలు పోటి చేశాయి కానీ, కాంగ్రెస్‌ని సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలు గెలుచుకోలేకపోయాయి.
  7. అయితే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని రాష్ట్రాల్లో 1967లో, కేంద్రంలో 1977లో తెరపడింది.
  8. ఆ తర్వాత దేశంలో అనేక పార్టీలు పుంజుకుని బహుళ పార్టీ వ్యవస్థగా రూపు దాల్చింది.

3) ఐక్యత సాధించే అంశంగానో లేక విభజించే దానిగానో భారతదేశ రాజకీయాలా భాష కేంద్ర బిందువుగా అనేక సార్లు తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలను గుర్తించి వాటిని వివరించండి.
జ. భారతదేశ రాజకీయాలలో ‘భాష’ స్థానం:-

  1. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం ఎదుర్కొన్న మొదటి సవాళ్లలో భాష ప్రాతిపదికన రాష్ట్రాలను పునఃవ్యవస్థీకరించడం.
  2. బ్రిటిష్ వారి కాలంలో ఒక భాష మాట్లాడే ప్రజలు అనేక ప్రెసిడెన్సీలలో, సంస్థానాలలో ఉండేవారు.
  3. ఆ కాలంలో ఒక రాష్ర్టంలో అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. ఒక భాష మాట్లాడే వారంతా ఒక రాష్ట్రంలోకి రావాలనే డిమాండ్ పెరిగింది.
  4. ఈ విధంగా సంయుక్త కర్ణాటక, సంయుక్త మహారాష్ట్ర, మహాగుజరాత్, సిక్కులకు పంజాబ్, ట్రావెన్‌కోర్-కొచ్చిన్ సంస్థానాల విలీనం వంటి డిమాండ్లు ఉన్నాయి.
  5. అయితే అప్పటికీ మతం ఆధారంగా దేశ విభజన జరిగి దేశంలో అనేక రకాల అల్లర్లు జరగడంతో భాష ప్రాతిపదికన రాష్ట్రాలను విభజిస్తే దేశం ముక్కలు కావడానికి దారి తీస్తుందని భయపడ్డారు.
  6. మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలు అన్నింటికంటే తీవ్ర ఉద్యమాన్ని చేపట్టారు. దీని ఫలితంగా 1953 అక్టోబరు 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
  7. 1953లో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఏర్పడింది.
  8. ఈ కమిటి భాష ఆధారంగా రాష్ట్రాలను పునఃవ్యవస్థీకరించాలని సూచించింది. దీని సిఫార్సులను 1956లో పార్లమెంట్ ఆమోదించింది.
  9. ఈ చట్టం ఆధారంగా 1953 అక్టోబరులో ఏర్పడిన ఆంధ్రరాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణాన్ని విలీనం చేసి 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. భాషాప్రయుక్త రాష్ట్రాలలో ఇదే తొలి రాష్ట్రం. ఈ విధంగా మొత్తం 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
  10. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు నాయకులు భయపడినట్లుగా దేశాన్ని బలహీనపరచలేదు. ఇంకా బలపడింది.
  11. అయితే కొన్ని రాష్ల్రాలలో కొంత ప్రాంతీయ అభిమానంతో కొన్ని ప్రాంతాలనే అభివృద్ధి చేయడంతో వెనుకబడిన ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. వీటిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉత్తరాఖండ్, బీహార్‌లో జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లో చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, మహారాష్ట్రలో విదర్భ ఉన్నాయి.

 

4) 1967 ఎన్నికల తర్వాత రాజకీయ వ్యవస్థలో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏవి? జ: భారతదేశ చరిత్రలో 1967 ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎన్నికలను ప్రజలు చాలా ముఖ్యంగా పరిగణిస్తున్నారని, వాటికి తమదైన ఉనికి ఉందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.
ముఖ్యమైన మార్పులు:-

 

  1. స్వాతంత్య్రం తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ తక్కువ ఆధిక్యంతో ఎన్నికైంది. ఆ పార్టీ 284 స్థానాలకే పరిమితమైంది.
  2. అనేక రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చవి చూసింది. ఉదా: తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, రాజస్తాన్, పంజాబ్.
  3. తమిళనాడులో డి.ఎం.కె అధికారంలోకి వచ్చింది.
  4. ఈ ఓటములతో కాంగ్రెస్ పార్టీ అంతరంగికంగా బలహీనపడింది. ఉత్తరాదిలో స్వల్ప మెజారిటీ పొందిన రాష్ట్రాలలో దాని ప్రతినిధులు ప్రతిపక్షాలకు ఫిరాయించారు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయి సంయుక్త విధాయకదళ్ (ఎస్‌వీడీ) ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వలేదు.
  5. ఈ విధంగా భారతదేశంలో 1967 తర్వాత ఒక రకమైన ప్రజాస్వామిక తిరుగుబాటు వచ్చిందని చెప్పవచ్చు.
  6. 1967 తర్వాత మధ్య స్థాయి కులాలు మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి. ఉదా:- హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో - జాట్, బీహార్‌లో కుర్మీ, మధ్యప్రదేశ్‌లో లోధ్, ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ,రెడ్డి, కర్ణాటకలో ఒక్కళి, తమిళనాడులో వెల్లల, అన్ని రాష్ట్రాలలో యాదవ్‌లు.
  7. 1967 తర్వాత భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ భావాలు తిరిగి ఊపందుకున్నాయి.
  8. ఆంధ్రప్రదేశ్‌లో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
  9. 1969లో అసోంలోని ఖాసి, జైంతియా, గారో ప్రాంతాల వారు ప్రత్యేక మేఘాలయ రాష్ట్రంగా ఏర్పడ్డారు.
  10. 1966లో ఏర్పడిన పంజాబ్ వారు 1968-69లో చండీగఢ్‌ను తమకే ఇవ్వాలని ఆందోళనలు చేశారు.
  11. బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలని ‘శివసేన’ ఉద్యమం చేపట్టింది.
  12. అనేక ప్రాంతాలలో మతకల్లోలాలు కూడా చెలరేగాయి.
  13. 1967 తర్వాత కాంగ్రెస్‌లోని కొంతమంది వామపక్ష పంథావైపు మొగ్గు చూపడంతో ఇందిరాగాంధీ సవాళ్లను ఎదుర్కొంది.

5) రాష్ట్రాలను ఏర్పరచడానికి మరొక ఆధారం ఏమైనా ఉందా? భాష ఆధారంగా పునఃవ్యవస్థీకరణ కంటే అది ఏవిధంగా మెరుగైనదిగా ఉండేది?
జ:-
స్వాతంత్య్రం తర్వాత భారతదేశంలోని రాష్ట్రాలను పునఃవ్యవస్థీకరించడానికి భాషను ఆధారం చేసుకున్నారు. ఇంకా ఏ ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కాని దీని వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. భాష కాకుండా ‘భౌగోళిక వనరుల’ ఆధారంగా పునఃవ్యవస్థీకరిస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే

  1. భాష ఆధారంగా చేపట్టిన ఇప్పటి రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ వల్ల బ్రిటిష్ పాలనలో కాని, స్వదేశీ సంస్థానాలలో కాని వేరు వేరు ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు ఒక రాష్ట్రంగా సంఘటితం చేశారు.
  2. అయితే వీరు చట్టం దృష్టిలో మాత్రమే సంఘటితం (ఐక్యం) చేశారు, మానసికంగా ఏ రకమైన ఐక్యత వీరి మధ్య కలగలేదు.
  3. ఒకే భాష మాట్లాడే ఈ ప్రజల మధ్య అనేక ప్రాంతీయ వ్యత్యాసాలు ఉన్నాయి. భాషలో అనేక యాసలు ఉండి ఒక ప్రాంతం వారే అధికారం చెలాయించారు. దీంతో మిగిలిన ప్రాంతాల వారు తాము వెనకబడిపోతున్నామనే భావనలో ఉండేవారు. ఇది ప్రాంతీయ వ్యత్యాసాలకు దారితీసింది.
  4. ఒక రాష్ర్టంలో ఉంటున్నామనే భావన తప్ప వీరి మధ్య మానసికంగా ఎలాంటి ఐకమత్యం కనిపించదు.
  5. అలా కాకుండా ‘భౌగోళిక వనరుల’ ఆధారంగా వ్యవస్థీకరణ చేసి ఉండాల్సింది.
  6. భౌగోళిక వనరులు అనగా నేలలు, వాతావరణం, పంటలు, పరిశ్రమలు, ప్రజల వృత్తులు, జీవన విధానం, సంసృ్కతి, సంప్రదాయాలు మొ॥
  7. వీటి ఆధారంగా వ్యవస్థీకరణ జరిగి ఉంటే ఒకే రకమైన జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన ప్రజలందరూ ఒకే రకమైన భౌగోళిక వనరులు కలిగిన ప్రాంతంలో ఒక్కటిగా ఉండేవారేమో.
  8. వాతావరణ పరిస్థితులు కాని, పంటలు, పరిశ్రమలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ప్రాంతీయ వ్యత్యాసాలకు తావు ఉండేది కాదు.
  9. ప్రజల జీవన విధానం అంతా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఒకరు మరోకరిని ఆధిపత్యం చేస్తున్నారనే భావన ఉండేది కాదు.
  10. ఉదా:- హైదరాబాద్ సంస్థానంలో తెలుగు, మరాఠీ, కన్నడ మూడు భాషలు మాట్లాడే ప్రజలున్నప్పటికి వారి మధ్య భౌగోళిక సారుప్యత వల్ల ఒక్కటిగా ఉండేవారు. రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణలో భాగంగా ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో కలిపారు. అక్కడి ప్రజలతో వీరు మమేకం కాలేక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు మొదలు పెట్టారు.

6) ఇందిరాగాంధీ తీసుకున్న ఏ చర్యలను ‘వామపక్ష పంథా వైపు మళ్లించడం’ గా పేర్కొన్నారు? అంతకు ముందు దశాబ్దాలతో పోలిస్తే ఇవి ఏ విధంగా భిన్నమైనవి? ఆర్థిక శాస్త్ర అధ్యాయాల ఆధారంగా ప్రస్తుత విధానాలకు, వీటికీ తేడా ఏమిటో పేర్కొనండి.
జ:-
1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తక్కువ మెజారిటీ సాధించడం, చాలా రాష్ట్రాల్లో ఓడిపోవడం ఇందిరాగాంధీ ఆలోచనా విధానంలో మార్పు కలిగించింది. పార్టీ సామాన్య ప్రజలకు దూరం అవుతోందని గ్రహించి వారిని పార్టీకి దగ్గర చేసే అనేక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. వాటిలో కొన్ని..

  1. 1969లో ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేశారు.
  2. 1971లో రాచరిక భరణాన్ని రద్దు చేసి, రాచరిక కుటుంబాల వారికి ఉన్న బిరుదులను రద్దు చేశారు. ఈ నిర్ణయాలను కొంతమంది ‘వామపక్ష పంథా వైపు పార్టీని మళ్లించడంగా పేర్కొన్నారు.
  3. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం గెలుపొందడం ఇందిరాగాంధీకి మరింత బలాన్ని ఇచ్చింది.
  4. ఈ ఊపుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ‘గరీబీ హఠావో’ అన్న నినాదంతో 1971లో కాంగ్రెస్ రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది.
  5. 1972లో జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మంచి ఫలితాలనే సాధించింది.
  6. ఈ విజయాలతో ఇందిరాగాంధీ అటు ప్రభుత్వం పైన, ఇటు పార్టీపైన పట్టు సాధించింది.
  7. అయితే ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయాలను సవాలు చే స్తూ న్యాయస్థానాల్లో సవాలు చేశారు.
  8. సామాజిక , ఆర్థిక మార్పు పేరుతో రాజ్యాంగాన్ని తరచూ సవరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
  9. అయితే 1994 నుంచి మళ్లీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేశారు.

7) భారత ప్రజాస్వామ్యాన్ని అత్యవసర పరిస్థితి ఏ విధంగా వెనక్కి తీసుకుపోయింది.
జ:-
అత్యవసర పరిస్థితి - దాని పరిణామాలు:-
అత్యవసర పరిస్థితి విధించడానికి దారి తీసిన పరిస్థితులు:-

  1. 1973లో దేశంలో ద్రవ్యోల్బణం, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార కొరత, నిరుద్యోగం వంటి సమస్యలు చుట్టుముట్టాయి.
  2. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
  3. ఈ సమయంలో జనసంఘ్ నాయకుడైన జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఐక్యమై కాంగ్రెస్‌కు, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇదే ‘జె.పి.ఉద్యమం’ గా పేరుపొందింది.
  4. ఇది అంతకంతకూ తీవ్రం కావడంతో 1975లో శాంతి భద్రతలు కాపాడే పేరుతో అత్యవసర పరిస్థితి విధించారు.

పరిణామాలు:-

  1. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది.
  2. శాంతి, భద్రతల పేరుతో అనేక అణచివేత చర్యలకు ప్రభుత్వం పాల్పడింది.
  3. పౌరులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులు నిలిపివేశారు.
  4. ఏ కారణం లేకుండా అరెస్టు చేయడం, హింసించడం, పౌర హక్కులకు భంగం కలిగించడం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి.
  5. మురికి వాడల తొలగింపు పేరుతో జనాలను నిరాశ్రయులను చేయడం, జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయించడం ప్రజల కోపానికి దారితీసింది.
  6. అయితే పౌర హక్కులు లేకపోవడంతో తమ నిరసనను వ్యక్తం చేసే అవకాశం ప్రజలకు లేకపోయింది. ఈ విధంగా అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యాన్ని వెనక్కి తీసుకుపోయింది.

8) అత్యవసర పరిస్థితి కాలంలో ఏ విధమైన వ్యవస్థాగత మార్పులు వచ్చాయి?
జ:-
అత్యవసర పరిస్థితి కాలంలో చెప్పుకోదగిన ముఖ్య పరిణామం రాజ్యాంగానికి 42వ సవరణ చేయడం. ఇది 1976లో చేశారు. ఇది దేశంలో అనేక మార్పులను తీసుకువచ్చింది. ఈ సవరణ ఉద్దేశ్యాలు...

  1. ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చేయడం.
  2. రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం.
  3. సామాజిక, ఆర్థిక, మార్పుకి ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుంచి రక్షణ కల్పించడం.
  4. న్యాయ వ్యవస్థ పార్లమెంట్‌కు లోబడి ఉండేలా చేయడం.
అయితే ఈ చర్యలు చాలా విమర్శలకు దారితీశాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీన పర్చడానికే ఈ సవరణలు చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలు చేసే హక్కు లేకుండా పోయింది. న్యాయస్థానాలు పార్లమెంట్‌కు లోబడి ఉండడం అంటే అవి వాటి స్వతంత్రతను కోల్పోయినట్లే. ఇది అరాచక వాదానికి దారి తీస్తుందని ప్రతిపక్షాలు, మేధావులు విమర్శించారు.
ఇదే సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికకు ఈ కింది పదాలు చేర్చారు.
1) లౌకిక 2) సామ్యవాద 3) జాతీయ సమైక్యత
ఈ పదాల చేర్చిక వల్ల భారత రాజ్యాంగం సంపూర్ణ రూపాన్ని సంతరించుకుని ప్రజల మధ్య మత బేధాలు లేకుండా, ధనిక, పేద తేడాలు లేకుండా తయారవుతుందని విశ్వసించారు. అలాగే విభిన్న ప్రజల మధ్య ఐక్యతను, సోదర భావాన్ని కల్పించడానికి తోడ్పడతాయని నమ్మారు.

4 మార్కుల ప్రశ్నలు:-
9) కింది అంశాన్ని చదివి వ్యాఖ్యానించండి.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యే ప్రపంచమంతా రష్యా కూటమి (యూఎస్‌ఎస్‌ఆర్) లేదా అమెరికా కూటమి (యూఎస్‌ఏ)గా విడిపోయింది. జవహర్‌లాల్‌నెహ్రు ఏ శిబిరంలోనూ చేరకుండా రెండింటికీ సమదూరంలో ఉంటూ విదేశీ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించ సాగాడు. అదే సమయంలో స్వాత ంత్య్రం పొంది అదే విధానాన్ని కొనసాగించలనుకుంటున్న ఇండోనేషియా, ఈజిప్టు, యుగేస్లోవియా వంటి దేశాలతో అతడు చేతులు కలిపాడు. వీళ్లంతా కలిసి అలీనోద్యమాన్ని నిర్మించారు. పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదన్న పంచశీల సూత్రాలను నెహ్రు రూపొందించాడు.
జ:-
  1. ఈ అంశం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మనం ఎంచుకున్న విదేశాంగ విధానాన్ని గూర్చి తెలియజేస్తుంది.
  2. ప్రపంచమంతా రెండు కూటములుగా... రష్యా కూటమి (యూఎస్‌ఎస్‌ఆర్), అమెరికా కూటమి (యూఎస్‌ఏ) గా విడిపోయి వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో మనం స్వాతంత్య్రం సంపాదించుకున్నాం.
  3. ఈ రెండు కూటములు కూడా వారి కూటమిలో చెరమని భారతదే శంపై ఒత్తిడి చేశాయి.
  4. అయితే అప్పటి భారతదేశ నాయకత్వం... ముఖ్యంగా జవహర్‌లాల్ నెహ్రు ఈ రెండు కూటములకు మధ్య మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే ‘అలీన విధానం’.
  5. అనగా అటూ రష్యా కూటమిలో గాని, ఇటూ అమెరికా కూటమిలో గాని చేరకుండా ప్రత్యేక విదేశాంగ విధానాన్ని అనుసరించడం.
  6. అలీన విధాన రూపశిల్పి నెహ్రుయే. మనతో పాటు ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లోవియా వంటి దేశాలతో నెహ్రు చేతులు కలిపి ఈ విధానాన్ని రూపొందించారు.
  7. ప్రపంచ శాంతి భారతదేశం ఎల్లప్పటికి కోరుకుంటుందని నిరూపించారు.
  8. పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి అంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదన్న పంచశీల సూత్రాలను రూపొందించి చైనాతో ఒప్పందం చేసుకున్నారు.

 

10) కింది అంశాన్ని చదివి నీ అభిప్రాయాన్ని తెలుపుము. 1970 దశాబ్దం ప్రథమాంకంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ పాకిస్తాన్ తమపై సవతి తల్లి ప్రేమ కనబరచడంపై నిరసనలు చెలరేగాయి. తమ బెంగాలీ అస్థిత్వాన్ని చాటుకోవడానికి ఉద్యమాలు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ముజబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది. కానీ అతడిని అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తాన్‌కి తీసుకెళ్లారు. తూర్పు పాకిస్తాన్‌లో సైనిక అణచివే త కాలం మొదలైంది. అక్కడ నుంచి తరలి వచ్చిన లక్షలాది కాందిశీకులకు భారతదేశం వసతి కల్పించి ఆహారాన్ని అందించాల్సి వచ్చింది. ఈ లోగా బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం మొదలైంది. దీంట్లో భారతదేశ సహాయాన్ని కోరారు. 1971లో భారతదేశం-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం మొదలైంది. భారతదేశం నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకుని బంగ్లాదేశ్‌కు విముక్తి సాధించి, స్వతంత్ర దేశంగా ఏర్పడేలా సహాయపడింది.
జ:-

 

  1. పాకిస్తాన్ దేశం 1947లో రెండు భాగాలుగా ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పటి పాకిస్తాన్).
  2. ఈ రెండు ప్రాంతాలలో పశ్చిమ పాకిస్తాన్ వారి ఆధిపత్యం కొనసాగేది.
  3. దీంతో తూర్పు పాకిస్తాన్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. పశ్చిమ పాకిస్తాన్ తమపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని నిరసనలు చేపట్టారు.
  4. 1970 దశకం ప్రథమాంకంలో ఇవి తారాస్థాయికి చేరాయి.
  5. సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్‌కు చెందిన ముజబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని పార్టీ గెలుపొందింది.
  6. కాని అతనికి అధికారం అప్పగించడానికి పశ్చిమ పాకిస్తాన్ వారు సిద్ధంగా లేరు.
  7. తూర్పు పాకిస్తాన్‌పై సైనిక అణచివేత కార్యక్రమం మొదలుపెట్టారు.
  8. ముజబుర్ రెహ్మాన్‌ను అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తాన్‌కు తీసుకెళ్లారు.
  9. తూర్పు పాకిస్తాన్ నుంచి ఈ సైనిక దాడుల నుంచి తప్చించుకోవడానికి లక్షలాది కాందిశీకులుగా భారతదేశానికి వచ్చారు. వారందరికి వసతి కల్పించి ఆహారాన్ని అందించాల్సి వచ్చింది.
  10. ఈ లోగా తూర్పు పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం మొదలైంది. వారు భారతదేశ సహాయాన్ని కోరారు.
  11. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోవద్దని పాకిస్తాన్ కోరింది.
  12. కాని మానవ హక్కులను హరించి వేస్తూ ఉంటే మేం చూస్తూ ఊరుకోబోమని భారత్ చెప్పి పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగింది.
  13. ఈ యుద్ధంలో భారత్ పాకిస్తాన్‌పై నెగ్గి బంగ్లాదేశ్‌కు విముక్తి సాధించింది.
  14. ఈ విధంగా 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది.

 

2 మార్కుల ప్రశ్నలు:-
1) భారతదేశంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల గురించి రాయండి.
జ:- మొదటి సార్వత్రిక ఎన్నికలు:-

 

  1. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి.
  2. ఈ ఎన్నికల్లో దేశంలోని వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారు.
  3. ఓటర్లలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్నారు. కావున వారు అభ్యర్థులను గుర్తించడానికి ప్రతి అభ్యర్థికి ఒక గుర్తును కేటాయించారు.
  4. ఈ ఎన్నికల్లో ఎంతమంది పోటీలో ఉంటే అన్ని బ్యాలెట్ బాక్స్‌లు పోలింగ్ కేంద్రంలో పెట్టారు. ఒక్కో పెట్టెను ఒక్కో అభ్యర్థికి కేటాయించి అతనికి సంబంధించిన గుర్తును ఈ పెట్టెపై అంటించేవారు.
  5. ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించి కేంద్రంలోను, రాష్ట్రాలలోను అధికారంలోకి వచ్చింది.

2) రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ ఏ విధంగా జరిగింది?
జ:
రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ:-

  1. 1953 ఆగస్టులో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘాన్ని (ఎస్‌ఆర్‌సీ) నియమించారు.
  2. దీనిలో ఫజల్ అలీ, కె.ఎం.ఫణిక్కొర్, హృదయనాథ్ కుంజ్రులు సభ్యులుగా ఉన్నారు.
  3. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు అంశాన్ని పరిశీలించవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు.
  4. ఈ సంఘం అందరితో చర్చించి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా తన నివేదికను ఇచ్చారు.
  5. దీని ఆధారంగా 1956లో భారత పార్లమెంట్ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది.
  6. ఈ చట్టం ఆధారంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (1956, నవంబరు 1)

3) భారతదేశంలో సామాజిక, ఆర్థిక మార్పు కోసం చేపట్టిన చర్యలు ఏవి?
జ:
సామాజిక, ఆర్థిక మార్పు కోసం చేపట్టిన చర్యలు:-

  1. సామాజికంగా వెనకబడిన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి విద్య, ఉద్యోగాలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించారు.
  2. ప్రణాళికా సంఘాన్ని ఏర్పరచి దాని ద్వారా పంచవ ర్ష ప్రణాళికా విధానాన్ని అమలు చేశారు.
  3. ప్రణాళిక విధానం ఆర్థిక విధానమే కాకుండా దీని ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు త గ్గుతాయని ఆశించారు.
  4. ఈ ప్రణాళిక ద్వారా వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేశారు.
  5. భూసంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన ద్వారా మెరుగైన సామాజిక, ఆర్థిక జీవనాన్ని కల్పించారు.

4) భారతదేశం అనుసరించిన విదేశాంగ విధానం ఎలాంటిది?
జ:
భారత విదేశాంగ విధానం:-

  1. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనే ప్రపంచమంతా రష్యా కూటమి, అమెరికా కూటమిగా విడిపోయి వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది.
  2. జవహర్‌లాల్ నెహ్రు నాయకత్వంలో భారతదేశం ఏ కూటమిలో చేరకుండా రెండింటికీ సమదూరంలో ఉంటూ విదేశీ విధానంలో స్వతంత్రంగా ఉంది.
  3. మనతో పాటు స్వాతంత్య్రం సంపాదించుకున్న ఇతర ఆసియా, ఆఫ్రికా దేశాలతో కలిసి ‘అలీన విధానాన్ని’ రూపొందించారు.
  4. అంతర్జాతీయ రంగంలో రెండు పొరుగు దేశాలు అనుసరించవలసిన నియమాలను సూచిస్తూ ‘పంచశీల’ సూత్రాలు రూపొందించారు.

5) హిందీ వ్యతిరేక ఉద్యమం గురించి రాయండి.
జ:
హిందీ వ్యతిరేక ఉద్యమం:-

  1. 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించడంతో జాతీయ అధికార భాషగా ‘హిందీ’ని ప్రకటించారు.
  2. అయితే హిందీని మిగిలిన దేశం మీద బలవంతంగా రుద్దుతున్నారని త మిళనాడులో డి.ఎం.కె నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమమే హిందీ వ్యతిరేక ఉద్యమం.
  3. ఇందులో భాగంగా సమ్మెలు, ధర్నాలు నిర్వహించారు. దిష్టి బొమ్మలు, హిందీ పుస్తకాలు తగలబెట్టారు.
  4. సైన్ బోర్డులలో హిందీలో ఉన్న దాని మీద చాలా చోట్ల నలుపు రంగు పూశారు.

6) హిందీ వ్యతిరేక ఉద్యమం వల్ల అధికార భాషగా హిందీని అమలు చేయడంలో కల్పించిన మినహాయింపులు ఏవి?
జ:
అధికార భాషగా హిందీని అమలు చేయడంలో కల్పించిన మినహాయింపులు:-

  • తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంతో అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి కొన్ని మినాహాయింపులు ప్రకటించారు.
  • ప్రతి రాష్ట్రానికి తన సొంత భాషను అధికార భాషగా కలిగి ఉండే అవకాశం ఉంది.
  • పత్ర వ్యవహారాలు ఇంగ్లీషు అనువాదంతో ప్రాంతీయ భాషలో ఉండవచ్చు.
  • కేంద్రం-రాష్ట్రాల మధ్య వ్యవహార భాషగా ఇంగ్లీషు కొనసాగుతుంది.
  • సివిల్ సర్వీసు పరీక్షలు కేవలం హిందీలోనే కాకుండా ఇంగ్లీషులో కూడా నిర్వహిస్తారు.

7) భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించడానికి దారి తీసిన పరిస్థితులు ఏవి?
జ:
అత్యవసర పరిస్థితి విధించడానికి దారి తీసిన పరిస్థితులు:-

  1. 1973లో అంతర్జాతీయ మార్కెట్‌లో అంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చమురు ధరలు పెరిగిపోవడంతో దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడి నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార కొరత, నిరుద్యోగం వంటి సమస్యలు చుట్టుముట్టాయి.
  2. ఈ పరిస్థితుల వల్ల ప్రజలలో అధిక శాతం అసంతృప్తితో ఉన్నారు.
  3. జనసంఘ్ నేత జయప్రకాష్ నారాయణ్ (జేపీ) నేతృత్వంలో ప్రతిపక్షాలు ఐక్యమై ఇందిరాగాంధీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇదే ‘జేపీ ఉద్యమం’.
  4. ఇది అంతకంతకు తీవ్రం కావడంతో 1975లో శాంతి భద్రతలు కాపాడే పేరుతో అత్యవసర పరిస్థితి విధించారు.

1 మార్కు ప్రశ్నలు:-
1) భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు? ఎవరు నిర్వహించారు?
జ:-

  1. భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలను 1952లో నిర్వహించారు.
  2. వీటిని కొత్తగా ఏర్పడిన భారత ఎన్నికల సంఘం నిర్వహించింది.

2) బ్రిటిష్ వారి కాలంలో దేశం ఏ విధంగా విభజించి ఉండేది?
జ:-
బ్రిటిష్ వారి కాలంలో దేశం ప్రెసిడెన్సీలు (కలకత్తా, మద్రాసు, బాంబే) గాను, సెంట్రల్ ప్రావిన్స్‌స్, బీదర్ వంటి పెద్ద రాష్ట్రాలుగాను విభజించి ఉండేది.

3) మద్రాసు ప్రెసిడెన్సీలో ఏయే భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు?
జ:-
మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు, గోండి, ఒడియా భాషలు మాట్లాడే వారు ఉన్నారు.

4) రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఎప్పుడు ఏర్పడింది? దానిలోని సభ్యులు ఎవరు?
జ:-

  1. రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం 1953 ఆగస్టులో ఏర్పడింది.
  2. దీనిలోని సభ్యులు... ఫజల్ అలీ, కె.ఎం.ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రు.

5) భారతదేశంలో అమలు పరిచిన భూసంస్కరణల ప్రధాన ఉద్దేశాలు ఏవి?
జ:-
1) జమిందారీ వ్యవస్థ రద్దు
2) కౌలు విధానాల సంస్కరణ
3) భూ పరిమితి విధానాలు
వీటిన్నిటి ప్రధాన ఉద్దేశం దున్నేవాడికే భూమి చెందేలా చూసి మరింత ఉత్పత్తి చేయడానికి ప్రోత్సాహించడం.

6) జవహర్‌లాల్ నెహ్రు కాలంలో భారతదేశం చేసిన యుద్ధాలు ఏవి?
జ:-

  1. 1947-48లో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో యుద్ధం.
  2. 1962లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడంలో ఆ దేశంతో యుద్ధం.
7) లాల్‌బహదూర్ శాస్త్రి కాలంలో భారతదేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏవి?
జ:-
  1. దక్షిణాదిన తమిళనాడులో డి.ఎం.కె చేపట్టిన హిందీ వ్యతిరేక ఉద్యమం.
  2. 1965లో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో యుద్ధం.
8) సంయుక్త విధాయక దళ్ (ఎస్‌వీడీ) అంటే ఏమిటి?
జ:-
  1. ఉత్తరాది రాష్ట్రాలలో 1967 తర్వాత కాంగ్రెస్‌కు వ్యతిరేకమైన శాసన సభ్యులు ఏకమై ఒక సంయుక్త కూటమి ఏర్పాటు చేశారు. దీనినే సంయుక్త విధాయక దళ్ (ఎస్‌వీడీ) అన్నారు.
  2. దీనిలో జనసంఘ్, సోషలిస్టులు, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ ఫిరాయింపుదారులు, స్థానిక పార్టీల శాసన సభ్యులు ఉన్నారు.
9) 1967 తర్వాత వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ భావాలు బలాన్ని సంపాదించుకున్నాయి అనడానికి రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జ:-
  1. ఆంధ్రప్రదేశ్‌లో 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది.
  2. 1969 డిసెంబరులో అస్సాంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రజలు ‘మేఘాలయ’ అనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి విజయం సాధించారు.
10) ‘1967 ఎన్నికల తర్వాత ఇందిరాగాంధీ వామపక్ష పంథా వైపు మొగ్గు చూపింది’ అనడానికి రెండు ఉదాహరణలు ఏవి?
జ:-
  1. 1969లో ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ చట్టం చేయడం.
  2. 1971లో రాచరిక భరణాన్ని, రాచరిక బిరుదులను రద్దు చేయడం.

11) జె.పి.ఉద్యమం అనగానేమి?
జ:
1973లో దేశంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఆహార కొరత, నిరుద్యోగం వంటి సమస్యలకు నిరసనగా జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జరిగిన ఉద్యమమే ‘జె.పి.ఉద్యమం’ గా పెరుపొందింది.

12) అత్యవసర పరిస్థితి కాలం నాటి రెండు పరిస్థితులను తెలపండి.
జ:

  1. దేశంలో ప్రాథమిక హక్కులు నిలిపి వేశారు.
  2. అకారణంగా అరెస్టు చేయడం, హింసించడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
13) 42వ రాజ్యాంగ సవరణ రెండు ముఖ్య ఉద్దేశ్యాలు ఏవి?
జ:
  1. ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చేయడం.
  2. కేంద్రం, రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం.
బహుళైచ్ఛిక ప్రశ్నలు - 1/2 మార్కు

1) స్విట్జర్లాండ్‌లో మహిళలకు ఓటు హక్కు ఈ సం॥కల్పించారు......( )
a) 1951
b) 1965
c) 1971
d) 1980

2) నిరక్షరాస్యత సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం ఈ చర్య చేపట్టింది....( )
a)రాజకీయ పార్టీలు లేకపోవడం
b)ఎన్నికల్లో ఇద్దరే పోటి చేయాలి
c)అక్షరాస్యులకే ఓటు హక్కు కల్పించడం
d)అభ్యర్థులకు గుర్తులను కేటాయించడం

3) భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి.........( )
a)1952
b)1957
c)1950
d)1947

4) మొదటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ......( )
a)స్వతంత్ర పార్టీ
b)భారత జాతీయ కాంగ్రెస్
c)కమ్యూనిస్ట్ పార్టీ
d)సంయుక్త విధాయక దళ్

5) బ్రిటిష్ వారి కాలంలో భారతదేశం ఈ విధంగా విభజించి ఉండేది.....( )
a)ప్రెసిడెన్సీలు
b)ప్రావిన్సులు
c)స్వదేశీ సంస్థానాలు
d)పైవన్నీ

6) ఈ భాషకు చెందిన ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించారు....( )
a)తమిళం
b)కన్నడం
c)తెలుగు
d)మలయాళం

7) 1953కు పూర్వం తెలుగు మాట్లాడే ప్రజలు ఈ రాష్ట్రాల్లో ఉండేవారు.....( )
a)మద్రాసు, బొంబాయి
b) మద్రాసు, హైదరాబాద్
c)హైదరాబాద్, బొంబాయి
d)హైదరాబాద్, బీదర్

8) రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఎప్పుడు ఏర్పడింది......( )
a)1953 ఆగస్టు
b)1956 నవంబరు
c)1953 అక్టోబరు
d)1956 ఆగస్టు

9) మొదటి పంచవర్ష ప్రణాళికలో ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు......( )
a)వ్యవసాయం
b)పరిశ్రమలు
c)మౌలిక రంగాలు
d)పేదరిక నిర్మూలన

10) భూసంస్కరణలలో ముఖ్య ప్రతిపాదన.....( )
a)జమిందారీ వ్యవస్థను రద్దు చేయడం
b)కౌలు విధానాల సంస్కరణ
c)భూపరిమితి విధానాలు
d)పైవన్నీ

11) అలీన విధానాన్ని అనుసరించడంలో మన దేశంతో కలిసి వచ్చిన దేశం......( )
a)రష్యా
b)ఇంగ్లాండ్
c)ఈజిప్టు
d)పాకిస్తాన్

12) భారత-చైనా మధ్య యుద్ధం ఏ సం॥జరిగింది....( )
a)1947
b)1956
c)1962
d)1965

13) జవహర్‌లాల్ నెహ్రు మరణం తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి అయినవారు....( )
a)ఇందిరాగాంధీ
b)లాల్‌బహదూర్ శాస్త్రి
c)రాజీవ్ గాంధీ
d)మొరార్జీదేశాయ్

14) 1965లో భారతదేశం ఈ దేశంతో యుద్ధం చేయాల్సి వచ్చింది.....( )
a)చైనా
b)పాకిస్తాన్
c)శ్రీలంక
d)ఆఫ్ఘనిస్తాన్

15)తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం నడిపించిన పార్టీ.........( )
a)డి.ఎం.కె
b)ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
c)పి.ఎం.కె
d)కాంగ్రెస్

16) 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాల్లో ఘోరంగా పరాజయం పాలైంది.....( )
a)ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్
b)తమిళనాడు, మహారాష్ట్ర
c)కేరళ, కర్ణాటక
d)తమిళనాడు, కేరళ

17) ‘జాట్’ కులస్తులు ఈ రాష్ట్రాలలో బలంగా ఉన్నారు......( )
a)హర్యానా, పంజాబ్
b)ఉత్తరప్రదేశ్, హర్యానా
c)బీహార్, మధ్యప్రదేశ్
d)హర్యానా, బీహార్

18) 1969లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారు.....( )
a)ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ వారు
b)హర్యానాలోని పంజాబ్ వారు
c)అసోంలోని గిరిజనులు
d)ఎవరూ కాదు

19) 370వ అధికరణం ప్రకారం ప్రత్యేక సౌక్యరాలు పొందుతున్న రాష్ట్రం....( )
a)సిక్కిం
b)నాగాలాండ్
c)పంజాబ్
d)జమ్ము-కాశ్మీర్

20) 1971లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధానికి కారణం....( )
a)కాశ్మీర్ అంశం
b)బంగ్లాదేశ్ విముక్తి
c)చొరబాట్లు
d)తీవ్రవాద దాడులు

21) ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ఇచ్చింది.....( )
a)జవహర్‌లాల్ నెహ్రు
b)ఇందిరాగాంధీ
c)లాల్‌బహదూర్ శాస్త్రి
d)మొరార్జీదేశాయ్

22) ఇందిరాగాంధీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక ఉద్యమానికి నేతృత్వం వహించిన వ్యక్తి.......( )
a)చరణ్ సింగ్
b)మొరార్జీ దేశాయ్
c)జయప్రకాష్ నారాయణ్
d)వి.పి.సింగ్

23) స్వతంత్ర భారతదేశంలో తొలి ముప్పై సంవత్సరాలలో ఈ రంగాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు..........( )
a)వ్యవసాయం, పరిశ్రమలు
b)వ్యవసాయం, మౌలిక రంగాలు
c)పరిశ్రమలు, మౌలిక రంగాలు
d)విద్య, ప్రజారోగ్యం

జవాబులు:
1. c 2. d 3. a 4. b 5. d 6. c 7. b 8. a 9. a 10. d 11.c 12. c
13. b 14. b 15. a 16. d 17. b 18. a 19. d 20. b 21. b 22. c 23. d
Published date : 28 Dec 2023 11:00AM

Photo Stories