Skip to main content

కొందరి కళ్లు నీలంగా ఉంటాయి ఎందుకు?

eyes కంటిగుడ్డులోని వర్ణకాలు (పిగ్మెంట్స్) కంటి రంగును నిర్ణయిస్తాయి. కంటి గుడ్డులో ఉండే మెలనిన్ అనే జీవ రసాయన ద్రవ పదార్థం పరిమాణాన్ని బట్టి కంటి రంగు లేతనీలం రంగు నుంచి ముదురు గోధుమరంగు వరకు ఉంటుంది. తల వెంట్రుకలు తెల్లగానో, బంగారు రంగులోనో ఉండే పాశ్చాత్యుల కళ్లు ఈ మెలనిన్‌ను తక్కువ శాతంలో ఉత్పన్నం చేస్తాయి. ఈ కారణంగా వారి కంటిగుడ్డుపై పతనమయ్యే కాంతి నుంచి నీలం రంగు ఎక్కువగా పరావర్తనం చెందుతుంది. అందువల్ల వారి కళ్లు నీలం రంగులో కనబడతాయి. మెలనిన్ పరిమాణం ఎక్కువయ్యే కొలదీ కంటి రంగు పరిధి ఆకుపచ్చ నుంచి గోధుమ రంగు వరకు ఉంటుంది. కంటిరంగును జన్యువులు కూడా నిర్ణయిస్తాయి. ఈ విషయమై శాస్త్రజ్ఞులు ఇంతవరకూ ఒక కచ్చితమైన అభిప్రాయానికి రాకపోయినా, ప్రపంచంలో నీలంరంగుకన్నా ఆకుపచ్చరంగు, ముదురు గోధుమ రంగు కళ్లు ఉండేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. నీలంరంగు కళ్లు కలవారు ఉత్తర ఐరోపాలో ఎక్కువగా ఉంటే, మిగతా ప్రపంచంలో గోధుమరంగు కళ్లు కలవారే ఎక్కువ. ప్రతి పదిలక్షల మందిలో ఒకరికి కుడికన్ను ఒక రంగులో ఉంటే, ఎడమకన్ను మరో రంగులో ఉంటుంది. జన్యుపరంగా వచ్చే ఈ పరిస్థితిని‘హైడ్రోక్రోమియా’ అంటారు.

- లక్ష్మీ ఈమని
Published date : 25 Sep 2013 11:57AM

Photo Stories