Skip to main content

బాలకార్మికులు లేని మండలం.. 20 ఏళ్లుగా జాతీయస్థాయిలో గుర్తింపు..

పలక, బలపం పట్టాల్సిన చిట్టిచేతులు పలుగు, పార పట్టి మట్టిపనులు చేస్తున్నాయి... బడీడు పిల్లలు బండెడు చాకిరీ చేస్తున్నారు... ఆటపాటలతో అలరించాల్సినవారు కాయకష్టం చేసిచేసి అలసిపోతున్నారు... ఇలా బాల కార్మిక వ్యవస్థలో మగ్గి బతుకులు బుగ్గి చేసుకునేవారెవరూ ఆ మండలంలో కానరారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేపట్టిన ప్రత్యేక కార్య క్రమంలో 18 గ్రామాలు కలిగిన వేల్పూర్‌ మండలం వంద శాతం ఫలితాలను సాధించి జాతీయస్థాయిలో ఖ్యాతినార్జించింది. 20 ఏళ్ల నుంచి నిర్విరామంగా విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న మండలంగా, బాలకార్మికులు లేని మండలంగా నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూర్‌ గుర్తింపు పొందిం ది. 2001లో చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములైన అప్పటి అధికారులు, నాయకులను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అక్టోబర్‌ 8న జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో సత్కరించనున్నారు.
బాలకార్మికులు లేని మండలం.. 20 ఏళ్లుగా జాతీయస్థాయిలో గుర్తింపు..
బాలకార్మికులు లేని మండలం.. 20 ఏళ్లుగా జాతీయస్థాయిలో గుర్తింపు..

అక్షరయజ్ఞంలో భాగస్వాములు వీరే...

2001 నాటి అక్షర యజ్ఞంలో భాగస్వాములైన అధికారులతో అప్పుడు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అశోక్‌కుమార్, అప్పుడు ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీపీ ఎడ్ల దీన, జడ్పీటీసీ సభ్యుడు వసంత్‌గౌడ్, డిపెప్‌ అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ జగదీశ్వర్‌గౌడ్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సుధాకర్‌రావు, జీసీడీవోగా పని చేసిన నిర్మల కుమారి, నోడల్‌ అధికారి సాయన్న, ఎంపీడీవో విశ్వనాథసుబ్రమణ్యం, మండల రెవెన్యూ అధికారి ఆంజనేయులు, ఎంఈవోలుగా పనిచేసిన లక్ష్మయ్య, శంకర్, ఎంఆర్‌పీలుగా విధులు నిర్వహించిన ప్రకా‹Ù, లక్ష్మణ్, అంబరీష్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సత్కరించడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

మహాయజ్ఞానికి బాటలు పడింది ఇలా...

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు 2001లో అప్పటి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. పైలట్‌ ప్రాజెక్టు కింద జిల్లాలోని రెంజల్, ఎడపల్లి, నందిపేట్, వేల్పూర్‌ మండలాలను అధికారులు ఎంపిక చేశారు. 5 నుంచి 14 ఏళ్ల వయస్సులోపు వారు ఎవరైనా బడి మానేసి బాలకార్మికులుగా చేరారా అని గుర్తించడానికి సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా వేల్పూర్‌ మండలంలోని వివిధ గ్రామాలలో 398 మంది బాల కార్మికులను అధికారుల బృందం గుర్తించింది. పూర్వపు క్లాసుకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇవ్వడానికి వేల్పూర్‌లో బ్రిడ్జి స్కూల్‌ను ఏర్పాటు చేశారు. 398 మంది బాల కార్మికులకు విముక్తి కలి్ప ంచి బ్రిడ్జి స్కూల్‌లో అడ్మిషన్ ఇప్పించారు. 

పనులకు వెళ్లకుండా పకడ్బందీగా చర్యలు 

పనుల నుంచి విముక్తి కల్పించిన తరువాత వారు మళ్లీ పనులకు వెళ్లకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. గ్రామాభివృద్ధి కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని గ్రామాలలో వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు, పశుపోషకులతో అధికారులు అవగాహన సమావేశం నిర్వహించారు. బడీడు పిల్లలను కార్మికులుగా మారిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అప్పట్లో బాల కార్మికుల విముక్తి కోసం నిర్వహించిన సమావేశానికి అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత నేషనల్‌ వాటర్‌ మిషన్, అడిషనల్‌ అండ్‌ మిషన్ డైరెక్టర్‌ జి అశోక్‌ కుమార్‌ హాజరై అవగాహన కలి్పంచారు. 

నిరంతరం పర్యవేక్షణ...

బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన తర్వాత వేల్పూర్‌ మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల నమోదును వంద శాతం చేయించారు. ఎవరైనా 14 ఏళ్లలోపు విద్యార్థులు బడిమానివేశారా.. ఒకవేళ టీసీ తీసుకుని ఎక్కడికైనా వలస వెళ్లారా.. అనే విషయాలపై అధికారులు సమాచారం సేకరించారు. నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు. అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు గ్రామాభివృద్ధి కమిటీలను భాగస్వాములను చేయడంతో బాలకార్మికులను పనుల్లో పెట్టుకోవడానికి ఎవరూ సాహసించలేదు. దీని ఫలితంగా 20 ఏళ్ల నుంచి బాల కార్మికులు లేని మండలంగా వేల్పూర్‌కు కీర్తి ప్రతిష్టలు లభించాయి.

ఆర్థిక చేయూత...

మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి వ్యవసాయ పనుల నిమిత్తం వలస వచి్చన కూలీల కుటుంబాలకు చెందిన పిల్లలే బాల కార్మికులుగా మారారు. స్థానిక కుటుంబాలకు చెందిన బాల కార్మికుల సంఖ్య స్వల్పంగానే ఉండేది. అయితే ఈ కూలీల కుటుంబాలకు ఆర్థిక చేయూతను ఇవ్వడానికి కొంత మంది ముందుకు రావడంతో తమ పిల్లలను బాల కార్మికులుగా పని చేయించకుండా తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. బాల కార్మికులతో ఎవరైనా పని చేయిస్తే చర్యలు తీసుకుంటామని గ్రామాభివృద్ధి కమిటీలు హెచ్చరించడంతో ఎంతో మంది పిల్లలను పనుల్లోకి పంపడానికి వెనుకంజ వేశారు. 

అందరి సహకారం, పూర్వపు అధికారుల స్ఫూర్తితో...Vanaja Reddy

అందరి సహకారం, పూర్వపు అధికారులు అందించిన స్ఫూర్తితో బాల కార్మికులు లేని మండలంగా వేల్పూర్‌ను జాతీయ స్థాయిలో అగ్రభాగంలో నిలిపాం. ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల సహకారం మరువలేనిది. ప్రతి ఒక్కరూ విద్యాహక్కు చట్టాన్ని గౌరవించడంతోనే బాల కార్మికులు లేని మండలంగా వేల్పూర్‌ నిలిచింది.
– వనజారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి, వేల్పూర్‌
చదవండి:

గుడ్ న్యూస్ ఏపీలో 190 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

రాతపరీక్ష లేకుండా దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు

Published date : 08 Oct 2021 03:27PM

Photo Stories