TS 10th Class Exams: మే 23 నుంచి పది పరీక్షలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే..
మే 23వ తేదీ నుంచి జూన్ ఒకటి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థుల హాల్‌టికెట్లను విద్యా శాఖ ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబా టులో ఉంచడంతో పాటు పాఠశాలలకు చేరవేసింది.
TS 10th Class Exams: పదో తరగతి పరీక్షలు రాస్తున్నారా..? ఇలా రాస్తే అధిక మార్కులు మీవే..
సిలబస్‌ను 70 శాతానికి కుదించి ప్రశ్నపత్రాలను..
ప్రింటెడ్ నామినల్ రోల్స్ కూడా సంబంధిత పా ఠశాలలకు పంపామని స్పష్టం చేసింది. కరోనా వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవడంతో సిలబస్‌ను 70 శాతానికి కుదించి ప్రశ్నపత్రాలను తయారు చేశామని తెలిపింది. పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించామంది. జనరల్ సైన్స్ కేటగిరీలో మాత్రం ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ప్రశ్నాపత్రాలను వేరుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈసారి ప్రశ్నపత్రంలో చాయిస్‌లను ఎక్కువగా ఇచ్చామని వివరించింది.
పరీక్ష కేంద్రాల వద్ద..
విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు చేరువలో ఉన్న పరీక్ష కేంద్రాలనే విద్యా శాఖ కేటాయించింది. పరీక్షల నిర్వహణకు 2,861 మంది చీఫ్ సూపరింటెండెంట్లు.. 2,861 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 33 వేల మంది ఇన్విజిలేటర్లను విధుల్లోకి తీసుకుంది. రాష్ట్ర కార్యాలయం నుంచి 4 ప్రత్యేక ఫ్లైయింగ్ స్వాడ్స్ బృందాలు, 144 ఫ్లైయింగ్ స్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేసింది.
ఈ విద్యార్థులు సమయానికి రాకపోతే..
ఈ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి పరీక్ష తీరును పరిశీలిస్తాయి. పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అదనంగా నడపాలని ఆర్టీసీ అధికారులను విద్యా శాఖ కోరింది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారు. పరీక్ష కేంద్రంలో సంబంధిత జిల్లా, మండల విద్యాధికారుల ఫోన్ నంబర్లను ప్రదర్శించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఉదయం 9.35 తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు.
ఇవి పాటించారంటే విజయం మీదే..
☛ పరీక్షా సమయంలో సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి. ప్రతి రోజు విద్యార్థి నిర్ధేశించుకున్న టైమ్ టేబుల్ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది.
☛ ఉపాధ్యాయులు, స్నేహితులు, సీనియర్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతేనే విజయం మరింత సులభమవుతుంది.
☛ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ముఖ్యంగా విద్యార్థులకు పరీక్ష సమాయాల్లో ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి.
☛ విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు అవసరమైన ధైర్యాన్ని అందించాలి.
☛ ఒత్తిడిని తగ్గించేందుకు వారికి సహకారం అందిస్తే అధిక సమయం చదువుకే కేటాయిస్తారు.
☛ తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన ఆహారం అందించాలి.
☛ విద్యార్థులు సమయానికి తగినట్లుగా నిద్రపోయేలా కుటుంబసభ్యులు చూసుకోవాలి.
తెలంగాణ పదో తరగతి పరీక్షల టైం టేబుల్ ఇదే..
తేదీ | పరీక్ష |
23–5–22 | మొదటి భాష |
24–5–22 | ద్వితీయ భాష |
25–5–22 | తృతీయ భాష |
26–5–22 | గణితం |
27–5–22 | జనరల్ సైన్స్ |
28–5–22 | సోషల్ స్టడీస్ |
30–5–22 | ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్) |
31–5–22 | ఓఎస్సెస్సీ మెయిన్ (సంస్కృతం, అరబిక్) |
01–6–22 | ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు |